షెడ్యూల్‌పై తకరారు | second phase assembly meeting from january | Sakshi
Sakshi News home page

షెడ్యూల్‌పై తకరారు

Published Thu, Dec 19 2013 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

second phase assembly meeting from january

 సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల షెడ్యూల్‌పై తెలంగాణ, సీమాంధ్ర నేతల మధ్య వివాదం పీటముడిలా మారింది. ఇరు ప్రాంతాల నేతలు పట్టు విడవకపోవడంతో షెడ్యూల్ ఖరారులో స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన తుది నిర్ణయాన్ని వెలువరించలేదు. శాసనసభ తాజా షెడ్యూల్‌ను బుధవారమే విడుదల చేయాలని ఆయన ముందుగా భావించినా, నేతల మధ్య ఏకాభిప్రాయం మృగ్యం కావడంతో అధికారిక బులెటిన్ విడుదల కాలేదు. తెలంగాణ బిల్లుపై చర్చను కొనసాగించడంతో పాటు త్వరితంగా ముగించి రాష్ట్రపతికి బిల్లును తిరిగి పంపించాలని తెలంగాణ ప్రాంత నేతలు వాదిస్తున్నారు. కానీ రాష్ట్ర విభజన బిల్లు కీలకమైనందున విస్తృతంగా చర్చించాలంటే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇచ్చిన గడువు దాకా సమావేశాలను కొనసాగించాల్సిందేనని సీమాంధ్ర ప్రతినిధులంటున్నారు. కూలంకష చర్చకు వీలుగానే రాష్ట్రపతి జనవరి 23 వరకు గడువు ఇచ్చారని వాదిస్తున్నారు.
 
 విభజన బిల్లుపై సోమవారమే చర్చ ప్రారంభమైందని, దాన్ని కొనసాగించడంతో పాటు సభ తదుపరి షెడ్యూల్‌ను స్పీకర్ ఖరారు చేసే విషయమై మంగళవారం సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ)లో చర్చ జరిగింది. కానీ ఆ విషయంలో గందరగోళం నెలకొంది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరు ప్రాంతాల నేతలు వేర్వేరుగా స్పీకర్‌ను కలసి తమ తమ వాదనలను గట్టిగా వినిపించారు. చర్చ కొనసాగించడంతో పాటు షెడ్యూల్‌పైనా పరస్పర భిన్న వాదన లు చెబుతుండడంతో స్పీకర్ వారికి ఎలాంటి సమాధానమూ ఇవ్వలేకపోయారు. ప్రస్తుత సమావేశాలను శుక్రవారం దాకా కొనసాగించడంతో పాటు మలి విడత సమావేశాలను క్రిస్మస్ సెలవుల అనంతరం డిసెంబర్ 27 నుంచి తిరిగి ప్రారంభించేలా స్పీకర్‌ను ఒప్పించాలని తెలంగాణ నేతలు భావించారు. జనవరి 10కల్లా తెలంగాణ బిల్లుపై చర్చను పూర్తి చేసి సమావేశాలను ముగించాలని, ఆపై బిల్లును సభ్యుల అభిప్రాయాలతో రాష్ట్రపతికి తిరిగి పంపేలా చూడాలని అనుకున్నారు. స్పీకర్‌ను పలుమార్లు కలసి తమ అభిప్రాయాన్ని వివరించారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు కనుక ఇతరే అంశాలనూ పట్టించుకోకుండా తక్షణం బిల్లుపై చర్చను కొనసాగించాలని కోరారు. ‘‘పదో తేదీ దాకా పూర్తిగా విభజన బిల్లుపైనే చర్చ కొనసాగించవచ్చు. సీమాంధ్ర సభ్యుల్లో మాట్లాడేందుకు ఎంతమందికి అవకాశమిచ్చినా ఈ సమయం సరిపోతుంది. అవసరమైతే తెలంగాణ సభ్యులమంతా బిల్లుకు మద్దతు ప్రకటిస్తూ క్లుప్తంగా ప్రసంగిస్తాం’’ అని చెప్పారు. అందుకు అనుమతివ్వాలని టీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్‌కు లేఖ కూడా అందించారు.
 
 టీ నేతల మథనం
 అంతకుముందు పలువురు టీ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహతో ఆయన చాంబర్లో సమావేశమై చర్చించారు. టీఆర్‌ఎస్ నేతలను కూడా దామోదర ఆహ్వానించి మంతనాలు జరిపారు. మంత్రి కె.జానారెడ్డి చాంబర్లో కూడా పలుమార్లు టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విడిగా భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీకే అరుణ, జె.గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, బసవరాజు సారయ్య, దానం నాగేందర్, రాంరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్‌లు అనిల్‌కుమార్, ఆరేపల్లి మోహన్ తదితరులు వీటిలో పాల్గొన్నారు. రాష్ట్రపతి 40 రోజుల గడువిచ్చినా విభజన బిల్లుపై చర్చను అవసరమైన మేరకే కొనసాగించి ఆపై సమావేశాలను ముగించాలని అభిప్రాయపడ్డారు.
 
 కిరణ్ వాదన విన్పించిన సీమాంధ్ర సభ్యులు
 సీమాంధ్ర సభ్యులు టీ సభ్యులకు భిన్న వాదనలను స్పీకర్ ముందుంచారు. ప్రస్తుత సమావేశాలను గురువారంతోనే ముగిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో చెప్పడం తెలిసిందే. ప్రణబ్ రాష్ట్రానికి రానుండడం, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ప్రధాని వద్దకు  అఖిలపక్షాన్ని తీసుకెళ్లాల్సి ఉన్నందున20వ తేదీ దాకా సమావేశాలు జరపడం కుదరదని వారికి కిరణ్ వివరించారు. గురువారంతో సభను వాయిదా వేయించి, జనవరి 3-10 మధ్య మలి విడత, 17-23 తేదీల మధ్య చివరి విడత సమావేశాలను జరిపి బిల్లుపై చర్చ కొనసాగిస్తామన్నారు. ఇవే అంశాలను సీమాంధ్ర నేతలు బుధవారం స్పీకర్ మనోహర్ ముందు పెట్టారు. వీటినే షెడ్యూల్‌లో పొందుపర్చాలంటూ పట్టుబట్టారు. కిరణ్ కూడా దీనిపై స్పీకర్‌తో మాట్లాడి ఒత్తిడి తెచ్చారు. మరోవైపు తెలంగాణ నేతలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
 
  విభజన బిల్లును జాప్యం చేయించేందుకే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ‘చర్చను జనవరి 23 దాకా కొనసాగిస్తే తరవాత సభ్యుల అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి కేంద్రానికి నివేదిక పంపేందుకు మరో మూడు రోజులు పడుతుంది. అంతేగాక చర్చకు సమయం చాలలేదనే సాకుతో రాష్ట్రపతిని మరింత సమయం కోరి, బిల్లు సకాలంలో కేంద్రానికి చేరకుండా చేసే ప్రమాదముంది’ అంటూ ఆందోళన చెందుతున్నారు. అందుకే సీమాంధ్ర నేతలు చెబుతున్న షెడ్యూల్‌కు వారు ససేమిరా అంటున్నారు. ఏదేమైనా సభా నాయకుడిగా కిరణ్ సూచనల మేరకే షెడ్యూల్ నిర్ణయమవుతుందని అసెంబ్లీ వర్గాలంటున్నాయి. ఆయన కూడా స్పీకర్‌పై ఒత్తిడి పెంచుతుండటంతో జనవరి 3 నుంచే మలివిడత షెడ్యూల్ ఉండొచ్చని చెబుతున్నాయి. ప్రణబ్ రాకతో పాటు కిరణ్ నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్షం వెళ్లాల్సి ఉన్నందున అసెంబ్లీ గురువారం నిరవధికంగా వాయిదా పడనుందంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement