12 నుంచి రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ | Second round medical Counselling from 12th of September | Sakshi
Sakshi News home page

12 నుంచి రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్

Published Tue, Sep 3 2013 1:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM

Second round medical Counselling from 12th of September

విజయవాడ, న్యూస్‌లైన్: ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకూ హైదరాబాద్‌లో రెండో విడత కౌన్సెలింగ్ జరగనుంది. ఉస్మానియా యూనివర్సిటీ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీఆర్‌ఆర్ సెంటర్) క్యాంపస్, జేఎన్‌టీయూలో కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్‌వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఈ మేరకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
 
11న హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో మాత్రమే స్పెషల్ కేటగిరీ (పోలీస్ మార్టిరీస్ చిల్డ్రన్(పీఎంసీ), వికలాంగ, ఎన్‌సీసీ, క్యాప్(ఆర్మీ) అభ్యర్థులకు ఉదయం 9 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్లను.. సీట్లు పొందిన వారు జాయిన్ కానందున మిగిలిన దాదాపు 20 ఎంబీబీఎస్, 135 బీడీఎస్ సీట్లను.. కొత్తగా అనుమతి పొందిన అనిల్ నీరుకొండ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్(విశాఖపట్నం), రాజమండ్రి జీఎస్‌ఎల్ డెంటల్ కళాశాల, హైదరాబాద్ మల్లారెడ్డి డెంటల్ కళాశాలల్లో 50 చొప్పున బీడీఎస్ సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందని వారు, సీట్లు పొంది జాయిన్ కాని వారు, సీట్లు పొంది మెరుగైన కళాశాలల్లో చేరగోరే అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. సీట్లు, కళాశాలల వివరాల కోసం 5న యూనివర్సిటీ (హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్) వెబ్‌సైట్ చూడవచ్చు.
 
 ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకూ నోటిఫికేషన్‌లో ఇచ్చిన మేరకు ఆయా ర్యాంకుల వారీగా నిర్దేశించిన తేదీల్లో (ఓసీ, బీసీ-ఏ టు ఈ, ఎస్‌సీ, ఎస్‌టీ) అభ్యర్థులందరూ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. అలాగే, 16న 12,001 నుంచి 16 వేల ర్యాంకు వరకూ ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ-ఏ కేటగిరీ అభ్యర్థులు, మధ్యాహ్నం 1 గంట నుంచి 16,001 నుంచి 20 వేల ర్యాంకు వరకూ ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 17న 12,001 నుంచి 15 వేల ర్యాంకు వరకు ఏయూ రీజియన్‌లోని బీసీ-బీ అభ్యర్థులు, 12,001 నుంచి 20 వేల ర్యాంకు వరకూ ఏయూ, ఎస్‌వీయూ రీజియన్‌లోని బీసీ-ఈ అభ్యర్థులు, 20,001 నుంచి 30 వేల ర్యాంకు వరకు ఏయూ రీజియన్‌లోని ఎస్‌టీ అభ్యర్థులు మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థుల కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం విడుదల చేస్తారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో మెడికల్ కౌన్సెలింగ్‌ను హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహించాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement