శ్రీహరికోట(సూళ్లూరుపేట) : ఇక్కడి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి భవిష్యత్తులో రాకెట్ ప్రయోగాల సంఖ్యను పెంచుకోవడానికి, అలాగే భారీ రాకెట్ ప్రయోగాలకు వీలు కల్పించేలా చేపట్టిన రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ నిర్మాణం జోరుగా సాగుతోంది. దీని నిర్మాణాన్ని మరో రెండు నెలల్లోనే పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఉంది. ఇక్కడినుంచే 2018 ప్రథమార్థంలో జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 లాంటి భారీ ప్రయోగం చేయాలనే కృతనిశ్చయంతో ఉంది.
అంతర్జాతీయ స్థాయి వసతులుండేలా..
షార్‌లో రెండో అసెంబ్లింగ్ బిల్డింగ్ అవసరాన్ని 2013లోనే శాస్త్రవేత్తలు గుర్తించి ప్రతిపాదించారు. 2015లో బిల్డింగ్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.628.95 కోట్లు మంజూరు చేసింది. 2016 నాటికి పనులు ప్రారంభించారు. 96 మీటర్ల ఎత్తు కలిగిన ఈ భవన నిర్మాణాన్ని చాలావరకు పూర్తి చేశారు. ఈ వెహికల్ అనుసంధానం భవనంలో అంతర్జాతీయ స్థాయి వసతులుండేలా ఇస్రో శాస్త్రవేత్తలే డిజైన్ చేశారు. ప్రస్తుతమున్న మొదటి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్(వ్యాబ్) ఎత్తు 80 మీటర్లు కాగా, ఇప్పుడు నిర్మిస్తున్న రెండో వ్యాబ్ ఎత్తు 96 మీటర్లు, వెడల్పు 36 మీటర్లు ఉండి 22 అంతస్తులుండేలా డిజైన్ చేశారు. ఇందులో 82 మీటర్లు ఎత్తు కలిగి 450 టన్నుల బరువు ఎత్తగలిగే సామర్థ్యమున్న భారీ క్రేన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మంజూరైన రూ.628.95 కోట్లలో ప్లాట్‌ఫారాలకు రూ.70 కోట్లు, డోర్లకు(తలుపులు) రూ.24 కోట్లు, బోగీలకు రూ.8 కోట్లు, క్రేన్‌కు రూ.22 కోట్లు, హాలర్‌కు రూ.10 కోట్లు, ట్రాక్‌కు రూ.23 కోట్లు, సర్వీస్ వ్యవస్థకు రూ.45 కోట్లు, సివిల్ పనులన్నింటికీ కలపి రూ.280 కోట్లు, మిగిలిన రూ.146.95 కోట్లు ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇతర ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. నిజానికి 2013లో రూ.363.95 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. తదుపరి రూ.628.95 కోట్లకు బడ్జెట్ పెరిగింది. ప్రస్తుతం పెరిగిన మెటీరియల్ కాస్ట్ వల్ల అదనంగా మరో వంద కోట్లు దాకా బడ్జెట్ పెరిగినట్టుగా తెలుస్తోంది.
భారీ ప్రయోగాలకోసం...
జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ల రూపకల్పనలో క్రయోజనిక్ దశలో ఒడిదుడుకులు ఎదురవడం తెలిసిందే. అందులో సాంకేతికపరమైన సమస్యలన్నింటినీ ఇస్రో అ«ధిగమించింది. ముఖ్యంగా మార్క్–3 లాంటి భారీప్రయోగం విషయంలో తొలిప్రయత్నంలోనే విజయం సాధించడంతో భవిష్యత్తులో భారీ ప్రయోగాలే లక్ష్యంగా పనిచేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న రెండో వ్యాబ్ జీఎస్‌ఎల్‌వీ మార్క్–3, చంద్రయాన్–2 లాంటి భారీ ప్రయోగాలకు ఉపయోగపడనుంది. దీని నిర్మాణం పూర్తయ్యాక ఏడాదికి 12 పీఎస్‌ఎల్‌వీ, 4 జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేయాలని ఇస్రో నిశ్చయంతో ఉంది. మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా మరో రాకెట్ అనుసంధాన భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోంది. రాకెట్ ప్రయోగాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా వాటికవసరమైన ఘన ఇంధన దశలు, ఘన ఇంధన స్ట్రాపాన్ బూస్టర్లు తయారీకిగాను ఘన ఇంధన విభాగాన్ని మరింతగా విస్తరించే దిశలో అడుగులేస్తోంది. ఈ క్రమంలో ఘన ఇంధన తయారీకి అవసరమైన మరో 29 భవనాల్ని రూ.226 కోట్లతో నిర్మించేందుకు ఇటీవలే టెండర్ల ప్రక్రియను ముగించింది. దీన్ని మరో ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. ఇవన్నీ పూర్తయితే ఇస్రోకు గుండెలాంటి షార్ ప్రపంచంలోనే వరల్డ్‌క్లాస్ రాకెట్ ప్రయోగకేంద్రంగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment