rocket launching station
-
పీఎస్ఎల్వీ సీ43 రెడీ
భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)నుంచి నింగిలోగి ఎగిరేందుకు పీఎస్ఎల్వీ సీ43 వాహన నౌక సిద్ధమయింది. గురువారం ఉదయం 9.58 గంటలకు ప్రయోగించనున్నారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేసుకుని నింగికెగిరేందుకు లాంచ్ పాడ్ వద్దకు వెళుతున్న రాకెట్.. శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 9.57 గంటలకు పీఎస్ఎల్వీ సీ – 43 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించనున్నారు. దీనికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశంలో ప్రయోగ తేదీని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున 5.57 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఉదయం 9.57 గంటలకు నింగివైపునకు దూసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ – 43 రాకెట్ సిద్ధంగా ఉంది. నాలుగు దశల రాకెట్ అనుసంధానాన్ని పూర్తి చేసి మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్టీ)æ నుంచి రాకెట్‌ను ప్రయోగవేదికపై వదిలిపెట్టి వెనక్కి వచ్చింది. 44.4 మీటర్ల ఎత్తున పీఎస్ఎల్వీ సీ – 43 రాకెట్ ప్రయోగ సమయంలో ఇంధనంతో కలిపి 320 టన్నుల బరువుతో నింగికి పయనమవుతుంది. ప్రయోగంలో 380 కిలోల హైసిస్ స్వదేశీ ఉపగ్రహంతో పాటు 261.5 కిలోల బరువు కలిగిన 8 దేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఉపగ్రహాల బరువు 641.5 కిలోలు కావడంతో స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా ప్రయోగించనున్నారు. దీన్ని కోర్ అలోన్ ప్రయోగం అంటారు. షార్‌లోని మొదటి ప్రయోగవేదికకు సంబం«ధించిన మొబైల్ సర్వీస్ టవర్‌లో రాకెట్‌ను అనుసంధానించిన కొన్ని దృశ్యాలను ఇస్రో మంగళవారం విడుదల చేసింది. రాకెట్‌లోని కోర్ అలోన్ దశ(ప్రథమ) ప్రయోగవేదికపై అనుసంధానం రాకెట్ మొదటి దశను కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డిజైన్ చేసి తీసుకొచ్చి ఇక్కడ అనుసంధానం చేశారు. ఈ దశలో రాకెట్ నింగికి దూసుకెళ్లడానికి 138.2 టన్నుల ఘన ఇంధనాన్ని నింపుతారు రాకెట్ రెండోదశలో విడి భాగాలను అమరుస్తున్న దృశ్యం రాకెట్ రెండోదశలో 2.8 వ్యాసార్థంలో ఉన్న మోటార్లో 42 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపుతారు. ఈ దశనూ వీఎస్సెస్సీలోనే తయారు చేశారు. మూడో దశ రాకెట్ విడిభాగాల అమరిక ఈ దశ రెండు మీటర్ల వ్యాసార్థంలో ఉంటుంది. మూడో దశలో 7.6 టన్నుల ఘన ఇంధనం, నాలుగోదశలో 2.5 ద్రవ ఇంధనాన్ని నింపుతారు. నాలుగో దశకు పైభాగంలో 641.5 కిలోల బరువు కలిగిన 31 ఉపగ్రహాల పొందికను అమర్చి అనుసంధానం చేస్తున్న దృశ్యం శిఖరభాగంలో నాలుగో దశ రాకెట్ అనుసంధానం ఈ దశలోనే ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. ఈ దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపుతారు. రాకెట్ అనుసంధానం పూర్తయ్యాక మొబైల్ సర్వీస్ టవర్ నుంచి రాకెట్ వదిలిపెట్టి వెనక్కి వెళ్తున్న దృశ్యం -
జపాన్‌లో కుప్పకూలిన రాకెట్
-
ఎగిరింది 60 అడుగులే.. కుప్పకూలిన రాకెట్..
టోక్యో, జపాన్ : ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తయారు చేసిన రాకెట్ తారాజువ్వలా 60 అడుగులు ఎగిరి అక్కడే కుప్పకూలింది. జపాన్‌కు చెందిన ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ మోమో-2 పేరుతో దాదాపు 2.7 మిలియన్ డాలర్లను ఖర్చు చేసి రాకెట్‌ను తయారు చేసింది. దక్షిణ హొకైడో ద్వీపంలోని టైకి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. దాదాపు 10 మీటర్ల పొడవున్న మోమో-2 రాకెట్ లాంచింగ్ పాడ్ నుంచి గాలిలోకి 60 అడుగుల ఎత్తు ఎగిరి కుప్పకూలింది. గతేడాది మోమో రాకెట్ ప్రయోగం కూడా ఇదే తరహాలో విఫలం చెందింది. ఈ ఘటనలో లాంచింగ్ పాడ్ కొద్దిగా దెబ్బతింది. అయితే, ఎవరికీ గాయాలు కాలేదని ఇంటర్స్టెల్లార్ వ్యవస్థాపకుడు టకఫుమి హొరీ తెలిపారు. ప్రయోగ విఫలానికి గల కారణాలను అన్వేషించి మళ్లీ ప్రయోగం చేపడతామని ఆయన వెల్లడించారు. -
భారీ ప్రయోగాల కోసం హు‘షార్’!
శ్రీహరికోట(సూళ్లూరుపేట) : ఇక్కడి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి భవిష్యత్తులో రాకెట్ ప్రయోగాల సంఖ్యను పెంచుకోవడానికి, అలాగే భారీ రాకెట్ ప్రయోగాలకు వీలు కల్పించేలా చేపట్టిన రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ నిర్మాణం జోరుగా సాగుతోంది. దీని నిర్మాణాన్ని మరో రెండు నెలల్లోనే పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఉంది. ఇక్కడినుంచే 2018 ప్రథమార్థంలో జీఎస్ఎల్వీ మార్క్–3 లాంటి భారీ ప్రయోగం చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. అంతర్జాతీయ స్థాయి వసతులుండేలా.. షార్‌లో రెండో అసెంబ్లింగ్ బిల్డింగ్ అవసరాన్ని 2013లోనే శాస్త్రవేత్తలు గుర్తించి ప్రతిపాదించారు. 2015లో బిల్డింగ్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.628.95 కోట్లు మంజూరు చేసింది. 2016 నాటికి పనులు ప్రారంభించారు. 96 మీటర్ల ఎత్తు కలిగిన ఈ భవన నిర్మాణాన్ని చాలావరకు పూర్తి చేశారు. ఈ వెహికల్ అనుసంధానం భవనంలో అంతర్జాతీయ స్థాయి వసతులుండేలా ఇస్రో శాస్త్రవేత్తలే డిజైన్ చేశారు. ప్రస్తుతమున్న మొదటి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్(వ్యాబ్) ఎత్తు 80 మీటర్లు కాగా, ఇప్పుడు నిర్మిస్తున్న రెండో వ్యాబ్ ఎత్తు 96 మీటర్లు, వెడల్పు 36 మీటర్లు ఉండి 22 అంతస్తులుండేలా డిజైన్ చేశారు. ఇందులో 82 మీటర్లు ఎత్తు కలిగి 450 టన్నుల బరువు ఎత్తగలిగే సామర్థ్యమున్న భారీ క్రేన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మంజూరైన రూ.628.95 కోట్లలో ప్లాట్‌ఫారాలకు రూ.70 కోట్లు, డోర్లకు(తలుపులు) రూ.24 కోట్లు, బోగీలకు రూ.8 కోట్లు, క్రేన్‌కు రూ.22 కోట్లు, హాలర్కు రూ.10 కోట్లు, ట్రాక్‌కు రూ.23 కోట్లు, సర్వీస్ వ్యవస్థకు రూ.45 కోట్లు, సివిల్ పనులన్నింటికీ కలపి రూ.280 కోట్లు, మిగిలిన రూ.146.95 కోట్లు ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇతర ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. నిజానికి 2013లో రూ.363.95 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. తదుపరి రూ.628.95 కోట్లకు బడ్జెట్ పెరిగింది. ప్రస్తుతం పెరిగిన మెటీరియల్ కాస్ట్ వల్ల అదనంగా మరో వంద కోట్లు దాకా బడ్జెట్ పెరిగినట్టుగా తెలుస్తోంది. భారీ ప్రయోగాలకోసం... జీఎస్ఎల్వీ రాకెట్ల రూపకల్పనలో క్రయోజనిక్ దశలో ఒడిదుడుకులు ఎదురవడం తెలిసిందే. అందులో సాంకేతికపరమైన సమస్యలన్నింటినీ ఇస్రో అ«ధిగమించింది. ముఖ్యంగా మార్క్–3 లాంటి భారీప్రయోగం విషయంలో తొలిప్రయత్నంలోనే విజయం సాధించడంతో భవిష్యత్తులో భారీ ప్రయోగాలే లక్ష్యంగా పనిచేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న రెండో వ్యాబ్ జీఎస్ఎల్వీ మార్క్–3, చంద్రయాన్–2 లాంటి భారీ ప్రయోగాలకు ఉపయోగపడనుంది. దీని నిర్మాణం పూర్తయ్యాక ఏడాదికి 12 పీఎస్ఎల్వీ, 4 జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేయాలని ఇస్రో నిశ్చయంతో ఉంది. మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా మరో రాకెట్ అనుసంధాన భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోంది. రాకెట్ ప్రయోగాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా వాటికవసరమైన ఘన ఇంధన దశలు, ఘన ఇంధన స్ట్రాపాన్ బూస్టర్లు తయారీకిగాను ఘన ఇంధన విభాగాన్ని మరింతగా విస్తరించే దిశలో అడుగులేస్తోంది. ఈ క్రమంలో ఘన ఇంధన తయారీకి అవసరమైన మరో 29 భవనాల్ని రూ.226 కోట్లతో నిర్మించేందుకు ఇటీవలే టెండర్ల ప్రక్రియను ముగించింది. దీన్ని మరో ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. ఇవన్నీ పూర్తయితే ఇస్రోకు గుండెలాంటి షార్ ప్రపంచంలోనే వరల్డ్‌క్లాస్ రాకెట్ ప్రయోగకేంద్రంగా మారనుంది. -
అంతరిక్ష వాణిజ్యంలోనూ హోరాహోరీ
బీజింగ్/న్యూఢిల్లీ : భారత్, చైనా మధ్య ఇప్పటికే అనేక అంశాల్లో తీవ్ర పోటీ, ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా మరో ఇరు దేశాల మధ్య మరో హోరాహోరీ పోరుకు రంగం తెర లేచింది. అంతరిక్ష రంగంలో భారత్, చైనాలు తమదైన శైలిలో దూసుకు పోతున్నాయి. ఇదే క్రమంలో ఇరు దేశాలు అంతరిక్ష వాణిజ్యం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. వాణిజ్య రంగంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైనాకన్నా అడుగు ముందే ఉంది. ఈ నేపథ్యంలో చైనా అంతరిక్ష వాణిజ్యంలో తమ ధరలను భారీగా తగ్గిస్తూ.. ఇస్రోకు సవాలు విసిరింది. రాకెట్ లాంచింగ్ ప్రోగ్రామ్‌లో ధరలను తగ్గించడం అనేది ఇస్రోను ఆర్థికంగా దెబ్బతీసే అంశం. చైనా ఏరెస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పోరేషన్ (సీఏఎస్‌సీ) తీసుకున్న నిర్ణయంపై ఇస్రో ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ఇస్రో కూడా ఇదే దారిలో ఉందని.. రాకెట్ లాంచింగ్‌లో ధరలను తగ్గించే ఆలోచన చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇస్రో ఇప్పటికే ఒకేసారి మైక్రో, నానో, మిని, స్టాండర్డ్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి.. ఖర్చును బాగా తగ్గించుకుందని.. ఈ నేపథ్యంలో ధరలను మరింత తగ్గించడం పెద్ద కష్టమేం కాదని ఇస్రో అధికారులు చెబుతున్నారు. -
శ్రీహరి కోటలో ఉద్యోగుల బంద్
శ్రీహరికోట : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉద్యోగులు మంగళవారం బంద్ పాటించారు. స్టేషన్ మొదటి గేటు వద్ద బైఠాయించిన యూనియన్ నాయకులు లోపలికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. సీపీఎం, సీపీఐ నాయకులు ఈ బంద్‌కు నేతృత్వం వహించారు. దీంతో స్టేషన్ వద్ద కొనసాగే పనులకు తీవ్ర అంతరాయం కలిగింది.