
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి అలిపిరి: కార్పొరేట్ కళాశాలల్లో ప్రతిభా కుసుమాలు రాలిపోతున్నాయి. తిరుపతిలో న్యూమారుతీనగర్‌లో ఉన్న నారాయణ మెడికల్ అకాడమీలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న మండి శ్రీహర్ష (17) మంగళవారం సాయంత్రం హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. చిత్తూరు జిల్లా బీ.కొత్తకోటకు చెందిన శ్రీధర్‌కు ముగ్గురు కొడుకులు. పెద్ద కుమారుడు శ్రీహర్ష పదో తరగతిలో 9.8 శాతం గ్రేడ్‌తో ఉత్తీర్ణుడయ్యాడు. శ్రీహర్షను డాక్టర్‌ను చేయాలనే కోరికతో తండ్రి శ్రీధర్ తిరుపతి నారాయణ మెడికల్ అకాడమీలో చేర్చారు.
చదువులో చురుగ్గా ఉండే శ్రీహర్ష గత శనివారం ఇంటికి వెళ్లి ఆదివారం అమ్మానాన్నలతో గడిపాడు. తిరిగి మంగళవారం మధ్యాహ్నం కళాశాలకు చేరుకుని స్నేహితులతో కలిసి మెస్‌లో భోజనం చేసి తలనొప్పిగా ఉందని చెప్పి రూమ్‌కి వెళ్లాడు. సాయంత్రం తరగతులు ముగిశాక గది తలుపులు తీసిన స్నేహితులకు శ్రీహర్ష ఉరేసుకుని కనిపించాడు. దీంతో విద్యార్థులు విషయాన్ని కాలేజీ యాజమాన్యానికి తెలిపారు. వెంటనే విద్యార్థిని రుయా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
కాగా, శ్రీహర్ష చదువులో చురుగ్గా ఉంటాడనీ, సున్నిత మనస్తత్వమని చెబుతున్న కళాశాల యాజమాన్యం బలవన్మరణానికి కారణాలు తెలియదంటోంది. కళాశాల ప్రిన్సిపల్ మాధవరెడ్డి, ఏజీఎం శంకరరావులు ఆస్పత్రి దగ్గర మీడియాతో మాట్లాడారు. రెండు రోజులు ఇంటిదగ్గర ఉండి వచ్చిన శ్రీహర్షకు ఏమైందో తెలియదని, కాలేజీలో తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పారు. శనివారం ఇంటికి వచ్చిన తన కుమారుడు మంగళవారం తిరిగి కాలేజీకి వెళ్తూ ‘ఆరోగ్యం జాగ్రత్త నాన్నా’ అని చెప్పి వెళ్లాడని తండ్రి శ్రీధర్ భోరున విలపిస్తూ చెప్పారు. ఈ మధ్యనే తాను కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్‌ని కలిసి వచ్చాననీ, బాగా చదువుతున్నట్లు చెప్పారని పేర్కొన్నారు.
రుయాకు చేరుకున్న విద్యార్థి సంఘాలు
శ్రీహర్ష ఆత్మహత్య గురించి తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నాయకులు రాత్రి 8 గంటలకు రుయా ఆస్పత్రికి చేరుకుని కళాశాల యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి నారాయణ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం నాయకులు మురళీధర్, హేమంత్‌కుమార్‌రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు బండి చలపతి, దాము, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘ నాయకులు నాగరాజు, వసీం అక్రం తదితరులు రుయా దగ్గర నిరసన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment