సాధారణంగా రిటైర్మెంట్ వయస్సు సమీపించిన ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడిగించుకోవాలంటే.. వయసు నిబంధనను సవరించాలి.
పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకు కొందరు నిమ్స్ వైద్యుల ఎత్తుగడ
శుక్రవారమే ప్రారంభమైన రహస్య బ్యాలెట్
డైరెక్టర్ అనుమతితోనే జరుగుతున్న బాగోతం.. నిబంధనలకు నీళ్లు
మీ సేవలు చాలు.. వెళ్లిపోమ్మంటున్న జూనియర్ ఫ్యాకల్టీలు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా రిటైర్మెంట్ వయస్సు సమీపించిన ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడిగించుకోవాలంటే.. వయసు నిబంధనను సవరించాలి. అందులోనూ ఆ పని చేయాల్సింది ప్రభుత్వమే. కానీ నిమ్స్‌లో మాత్రం దీనంతటికీ నీళ్లోదిలేశారు. నిమ్స్‌లో 62 ఏళ్ల వయసు దాటితే పదవీ విరమణ చేయాలి. కానీ, కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన పలువురు వైద్యులు మళ్లీ పదవిలో కొనసాగడానికి రహస్య బ్యాలెట్ విధానానికి పూనుకున్నారు. అందుకు డెరైక్టర్‌నూ ఒప్పించారు. ఈ మేరకు వైద్యులందరూ రహస్య బ్యాలెట్ పద్ధతిలో పాల్గొనాలంటూ శుక్రవారం నిమ్స్ వైద్యులందరికీ డీన్ నుంచి ఓ ఈ-మెయిల్ సందేశం వచ్చింది. ఒక్కసారిగా వచ్చిన ఈ సందేశంతో వైద్యులు కంగుతిన్నారు.
అసలు ఆ బ్యాలెట్‌లో మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటో ఆప్షన్‌లో.. ‘మీ పదోన్నతులకు అడ్డుకాము. శస్త్రచికిత్సలు మీ ఇష్టమొచ్చినట్టే చేసుకోవచ్చు. విభాగాధిపతి పోస్టులను రొటేషన్ పద్ధతిలో ఇస్తాం. 65 ఏళ్ల వయసుకు ఓటేస్తున్నాం’ అని... రెండో ఆప్షన్‌లో ‘ఒప్పుకొనేది లేదు’ అని... మూడో ఆప్షన్‌లో ‘మేము నిర్ణయించుకోలేం. తటస్థంగా ఉంటాం’ అని పెట్టారు. ఈ రహస్య బ్యాలెట్‌లో శుక్రవారం కొంతమంది వైద్యులు ఓటేశారు కూడా. శనివారం సాయంత్రం వరకూ ఈ ఓటింగ్ కొనసాగనుంది. అయితే, నిమ్స్‌లో 140 మందికి పైగా ఫ్యాకల్టీ సభ్యులుండగా.. 70 శాతం మంది వయస్సు పెంపును వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ‘మిమ్మల్ని భరించలేం, మీరు చేసిన సేవలు చాలు. ఇక వెళ్లిపోండి’ అంటూ కొంతమంది బ్యాలెట్‌లో రాసినట్టు నిమ్స్ వర్గాల సమాచారం. నిమ్స్ చరిత్రలో ఇలాంటి తిరకాసు నిర్ణయాలు లేవని, వయసు దాటాక కూడా ఇదేం పరిస్థితి అని పలువురు వైద్యులు విమర్శిస్తున్నారు. కొత్తగా వచ్చిన డెరైక్టర్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలపై మండిపడుతున్నారు. కాగా.. వైద్యుల్లో వీబీఎన్ ప్రసాద్, జగన్మోహన్‌రావు, పీవీఎల్‌ఎన్ మూర్తి, ముకుందరెడ్డి, పీవీ రావు తదితరులు కొద్ది రోజుల్లో పదవీవిరమణ చేయనున్నారు.