నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
అదనపు సిబ్బందితో కార్యదర్శుల భర్తీకి చర్యలు
నిరుద్యోగుల ఆందోళలను పట్టించుకోని సర్కారు
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కార్యరూపం ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ప్రభుత్వ శాఖల్లో అదనపు సిబ్బందిని గుర్తించి ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లో నియమించేందుకు చర్యలు చేపట్టింది.
విశాఖపట్నం : జిల్లాలో 925 పంచాయతీలున్నాయి. వీటిలో 37 మేజర్ పంచాయతీలుండగా మిగిలినవి మైనర్ పంచాయతీలు. మేజర్, మైనర్ పంచాయతీలను కలిపి 558 క్లస్టర్స్‌గా విభజించారు. మేజర్ పంచాయతీలకు ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్లు, మైనర్ పంచాయతీలకు కార్యదర్శులుండాలి. 558 క్లస్టర్స్‌కు 558 మంది కార్యదర్శులు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 393 మంది మాత్రమే ఉన్నారు. 165 క్లస్టర్స్‌కు కార్యదర్శులు లేనేలేరు. ఒక్కో కార్యదర్శి రెండు మూడు పంచాయతీలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారిపై పని ఒత్తిడి పెరిగిపోయింది. ఇటీవల పింఛన్ల పంపిణీని కూడా కార్యదర్శులకు అప్పగించడంతో రోజువారీ కార్యకలాపాలపై వారు ఏ మాత్రం దృష్టి పెట్టడంలేదు. దీంతో పన్నుల వసూళ్లు, ధ్రువీకరణ పత్రాల జారీపై తీవ్ర జాప్యం జరుగుతోంది. పంచాయతీలకు ఇన్‌చార్జి కార్యదర్శులు చుట్టపు చూపుల్లా వచ్చి వెళ్తున్నారే తప్ప ఈ ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉండడం లేదు. ఖాళీగా ఉన్న ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినప్పటికీ ఏమాత్రం పట్టించుకోని సర్కార్ భారం తగ్గించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సిబ్బందిని గుర్తించి వారిని కార్యదర్శులుగా పంచాయతీలకు పంపించాలని నిర్ణయించింది. ఈ మేరకు జారీ చేసిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం శాఖల వారీగా అదనపు సిబ్బందిని గుర్తించే పనిలో పడింది.
ఆసక్తి ఉన్న వారితో జాబితాలివ్వండి
కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఈ మేరకు శాఖాధిపతులకు సోమవారం ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేశారు. శాఖల వారీగా ఏఏ కేడర్‌లో ఎంతమంది పనిచేస్తున్నారు? అదనంగా ఉన్న సిబ్బంది ఎంతమంది? వారిలో పంచాయతీ కార్యదర్శులుగా వెళ్లేందుకు ఆసక్తి ఉన్న వారెంతమంది? వంటి వివరాలతో నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా ఈ జాబితాలను సిద్ధం చేసి డిసెంబర్‌లోగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో నింపేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. రికార్డు అసిస్టెంట్ మొదలు సీనియర్ సహాయకులు వరకు, ఆసక్తి ఉంటే సూపరింటెండెంట్ ఉద్యోగులు సైతం కార్యదర్శులు, ఈవోలుగా పనిచేయడానికి అర్హులుగా నిర్ధారించారు. డిగ్రీ చదివి, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికి మాత్రమే డిప్యుటేషన్‌పై కార్యదర్శిగా వెళ్లడానికి అనుమతివ్వనున్నట్టు ప్రకటించారు.