రంగంలోకి ఢిల్లీ మెట్రో
- వీజీటీఎం ఉడా పరిధిని పరిశీలిస్తున్న డీఎంఆర్‌సీ
- డీపీఆర్ తయారీకి కసరత్తు
- ఉడా పరిధిలో ఢిల్లీ బృంద పర్యటన
సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా పరిధిలో నిర్మించ తలపెట్టిన మెట్రో ప్రాజెక్టు బాధ్యతల్ని ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో వీజీటీఎం ఉడా పరిధిలో మెట్రో ప్రాజెక్టు నిర్మించనున్న ప్రాంతాల్లో అధికారులు శుక్రవారం పర్యటించారు. వాస్తవానికి డిటైల్డ్ ప్రాజెక్టు తయారీ బాధ్యతల్ని తొలుత ప్రభుత్వం వీజీటీఎం ఉడాకు అప్పగించింది. అయితే, దీనికంటే ముందే ఉడా అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధంచేయటం.. ఆ తర్వాత కేంద్రబృంద పర్యటన.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలతో మెట్రో సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారుచేయడం జరిగాయి.
ఉడా పరిధి అంతా మెట్రోరైల్ ఉండేలా నాలుగు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. చివరకు ప్రాజెక్టు మంజూరుచేసిన క్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు నాలుగు ప్రతిపాదనల్ని క్రోడీకరించి 49 కిలోమీటర్ల మార్గం మేరకు నూతన ప్రతిపాదన సిద్ధంచేసి ఖరారు చేశారు. దీనికి సంబంధించిన బాధ్యతలను ఉడాకు అప్పగించారు. వెంటనే ఉడా
అధికారులు కంపెనీ ప్రొఫైల్స్ స్వీకరణ కార్యక్రమం టెండర్ల ప్రక్రియ ద్వారా నిర్వహించారు. చివరకు ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు నిపుణుడు శ్రీధరన్ సేవలు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటున్న క్రమంలో ప్రాజెక్టు పూర్తి బాధ్యతలు డీఎంఆర్‌సీకి కేటాయించారు. ప్రాజెక్టుకు సంబంధించి పనులు యథాతథంగా నిలిపివేయాలని ప్రత్యేక జీవో కూడా జారీచేశారు. ఇదంతా జరిగి మూడు రోజులైంది. ప్రాజెక్టు ఇంకా డీపీఆర్ తయారీకి సంబంధించిన టెండర్ల దశలోనే ఉంది. అయితే, టెండర్లు లేకుండానే.. నేరుగా ఢిల్లీ మెట్రోకే ప్రాజెక్టును అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈక్రమంలో ఢిల్లీ మెట్రో ఇంజినీర్లు ఉడా మాస్టర్‌ప్లాన్ ఆధారంగా వీజీటీఎం ఉడా పరిధిలో పర్యటించారు. వారి పర్యటన వివరాలు పూర్తి గోప్యంగా ఉంచారు. అయితే, డీపీఆర్ తయారీలో భాగంగా ఉడా పరిధిపై అవగాహన కోసం మెట్రో మార్గం నిర్మించనున్న 49 కిలోమీటర్లు గన్నవరం, కంకిపాడు, విజయవాడ, గొల్లపూడిలో వారు పర్యటించారు. అలాగే, శుక్రవారం ఉదయం వీజీటీఎం ఉడా కార్యాలయంలోని సిటిజన్ చార్టర్‌లో కూడా మెట్రో మాస్టర్ ప్లాన్‌ను ఢిల్లీ బృందం కొనుగోలు చేసింది.