భూసేకరణకు ఇబ్బందుల్లేకుండా చూడండి | See land without problems | Sakshi
Sakshi News home page

భూసేకరణకు ఇబ్బందుల్లేకుండా చూడండి

Published Wed, Feb 24 2016 12:26 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

భూసేకరణకు ఇబ్బందుల్లేకుండా చూడండి - Sakshi

భూసేకరణకు ఇబ్బందుల్లేకుండా చూడండి

కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు

విజయవాడ బ్యూరో: ఎయిర్‌పోర్టులు, పోర్టులు, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల విషయంలో భూసేకరణకు ఇబ్బందులు లేకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, మంత్రులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రూ.16,500 కోట్ల వ్యయంతో 1205 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణ పనులు చేపట్టినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వెయ్యి కిలోమీటర్ల మేర అమరావతి-కర్నూలు, అమరావతి-అనంతపురం రహదారులు నిర్మిస్తామన్నారు. రద్దీని బట్టి ఈ మార్గంలో రెండు, నాలుగు, ఆరు రహదార్లను నిర్మిస్తామన్నారు. వీటికి భూసేకరణ ఇబ్బందులు లేకుండా 15 రోజుల్లో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమరావతి ఔటర్ రింగు రోడ్డుకు సవివర నివేదిక సిద్ధం చేసినట్లు ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించే సూక్ష్మ చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ)ల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్ విస్తరణకు భూములు సేకరించాలని ఆదేశించారు. నిర్ణీత కాల పరిమితిలోపు పరిశ్రమలు స్థాపించకపోతే ప్రభుత్వం కేటాయించిన భూములను తిరిగి వెనక్కితీసుకోవాలని ఆదేశించారు. అమరావతిలో నాలెడ్జ్ ఎకానమీ జోన్ (కేఈజెడ్) ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నాలెడ్జ్ ఆధారిత ఆర్థికాభివృద్ది కోసం ఉపయోగపడే ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిది అవుతుందని తెలిపారు.

విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో రెండోరోజు మంగళవారం ఆయన పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ భాగస్వామ్యంతో ఈ సంవత్సరం జూన్‌కల్లా కేఈజెడ్ పనులు ప్రారంభించి 2017నాటికి మొదటి దశను పూర్తిచేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. హార్వర్డ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారం తీసుకుని ముందుకెళ్లాలని, ప్రతి జిల్లాలోనూ కేఈజెడ్ నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జాయింట్ వెంచర్‌లో టవర్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు వారంలో ప్రతిపాదనలు సిద్ధంచేయాలని చెప్పారు. 49 శాతం వాటా ద్వారా ఈ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఫైబర్ గ్రిడ్ పనులను సమీక్షించిన ముఖ్యమంత్రి ప్రతి ఇంటికీ ఇంటర్‌నెట్, టెలిఫోన్, కేబుల్ టీవీని ఫైబర్ లైన్ ద్వారా అందించాలనేది తమ ఆశయమని చెప్పారు. దేశంలో ఇంటర్‌నెట్ సగటు వేగం 2.5 ఎంబీపీఎస్ కాగా అంతర్జాతీయ స్థాయిలో ఇది పది ఎంబీపీఎస్‌గా ఉందన్నారు. మన రాష్ట్రంలో అంతకుమించిన వేగంతో తక్కువ ధరకే త్వరలోనే అందిస్తామన్నారు. జూన్ నాటికి 23 వేల కిలోమీటర్ల కేబుల్ వేయడం పూర్తవుతుందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో కోటీ 30 లక్షల కుటుంబాలకు ఫైబర్ గ్రిడ్ ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. రూ.333 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులో మొబైల్ నుంచి ల్యాండ్‌లైన్ టెలిఫోన్‌కు వచ్చే కాల్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు. కేంద్రం కూడా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చూసి ఆశ్చర్యపోయిందని తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ ఏపీ ఫైబర్ గ్రిడ్ బ్యాండ్ విడ్త్‌నే వినియోగించాలని ఆదేశించారు. జాతీయ రహదారుల పక్కన వసతుల కల్పన మంచి ఆదాయ వనరని, వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నారు. 193 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న శ్రీకాకుళం జిల్లా అన్నింట్లోనూ వెనుకబడ్డానికి సరైన ప్రణాళికలు రూపొందించక పోవడమేనన్నారు. నేవీ సహకారంతో క్రూయిజ్, వాటర్ స్కూటర్స్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తేవచ్చన్నారు. విరాట్ యుద్ధ నౌకను విశాఖలో ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చన్నారు.

సమావేశంలో మౌలిక సదుపాయాలపై ఆ శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ ప్రజెంటేషన్ ఇస్తూ మార్చికల్లా గన్నవరం ఎయిర్‌పోర్టు భూసేకరణ పూర్తవుతుందని, ఏప్రిల్‌లో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని తెలిపారు. ప్రాజెక్టులు రాకుండా, అభివృద్ధి జరక్కుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయన్నారు. ప్రాజెక్టులు రావడంతో లాభం తప్ప నష్టం జరగదనే విషయాన్ని ప్రజలకు వివరించగలిగితే భూసేకరణ సమస్యే కాదని చెప్పారు. జిల్లాకు రెండేసి చొప్పున 25 ఇండస్ట్రియల్ సిటీలు నిర్మిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ చెప్పారు. ప్రతి కుటుంబానికి ఇల్లు అంశంపై పారిశ్రామికవేత్త శ్రీనిరాజు ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండోరోజు సమావేశాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇంధన రంగంపై చర్చతో ప్రారంభించారు. సమావేశంలో పలువురు మంత్రులు, 13 జిల్లాల కలెక్టర్లు, ముఖ్యకార్యదర్శులు, విభాగాధిపతులు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement