Industrial Township
-
చిన్న పారిశ్రామిక టౌన్‌షిప్‌లు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళీకరించడం, స్మార్ట్ పారిశ్రామిక టౌన్‌షిప్‌లు, టైర్–2, 3 పట్టణాల్లో రంగాల వారీ ప్రత్యేకమైన పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందని పరిశ్రమల ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా తెలిపారు. దేశ పారిశ్రామికీకరణకు ఈ చర్యలు ఊతమిస్తాయన్నారు.ఫిక్కీ వార్షిక సమావేశంలో భాగంగా మాట్లాడారు. పలు శాఖల మద్దతుతో పారిశ్రామికాభివృద్ధికి అనుకూల ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జాతీయ పారిశ్రామిక నవడా కార్యక్రమం, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ), వ్యాపార సులభతర నిర్వహణ సంస్కరణలు పారిశ్రామికాభివృద్ధికి వీలు కల్పించినట్టు భాటియా తెలిపారు. విద్యుదీకరణ పారిశ్రామికీకరణను వేగవంతం చేసిందని భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి కరమ్ రిజ్వి ఇదే కార్యక్రమంలో భాగంగా అన్నారు.తయారీలో పోటీతత్వం, దేశీయ వాటాను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. ప్రైవేటు పెట్టుబడులు అన్నవి దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా ఉండాలని ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ అనంత్ గోయెంకా అన్నారు. రంగాల వారీ పారిశ్రామిక పార్క్‌లు ఎంతో మార్పును తీసుకురాగలవన్నారు. కాకపోతే స్థానికంగా, విదేశాల్లోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌లు) నుంచి పాఠాలను పరిగణనలోకి తీసుకోవాలని, తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచాలని సూచించారు. -
ఏపీలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు
-
ఏపీలో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో జపాన్ ఇండ్రస్టియల్ టౌన్‌షిప్‌కు శ్రీకారం చుడుతున్నట్లు పరిశ్రమలు, ఐటి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. డీపీఐఐటీ, సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన జపాన్ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భాగస్వామ్య సదస్సులో కేంద్ర డీపీఐఐటీ శాఖ కార్యదర్శి గురు ప్రసాద్ మోహపాతర, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ రవీన్, ఈడీ ప్రతాప్ రెడ్డి, జపాన్‌కు చెందిన ఎకనమీ, ట్రేడ్, పరిశ్రమల శాఖ (ఎంఈటీఐ) వైస్ మంత్రి సన్ షిగెహిరో టనక, జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్( జేఈటీఆర్‌వో సీఐఐ వైస్ ఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్, జపాన్ భారత అంబాసిడర్ సంజయ్ కె వర్మ, సీఐఐ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. (చదవండి: విదేశాల్లోనూ యువతకు ఉపాధి కల్పన) ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ, ఎప్పటి నుంచో జపాన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. విశాఖలో 10 లక్షల చదరపు అడుగుల్లో జపనీస్ ఎన్క్లేవ్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. చైనా నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే జపాన్ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా 'జపాన్ డెస్క్ ఏర్పాటు' చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలో ఏటీసీ టైర్స్, యొకొహొమా గ్రూప్ వంటి ప్రఖ్యాత పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఒక్క వాహనాల టైర్ల తయారీలోనే రెండువేల మందికి ఉపాధి, యువతకు శిక్షణ అందించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.(చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్) శ్రీసిటీలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ భారీ స్థాయిలో ఏర్పాటయ్యిందన్నారు. వైజాగ్- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ) అభివృద్ధిలో భాగంగా మరో జపాన్ పారిశ్రామిక టౌన్ షిష్‌కు ప్రతిపాదించామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 25కిపైగా జపాన్ కంపెనీల పెట్టుబడులు పెట్టాయన్నారు. కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు వున్న 2,500 కి.మీ తూర్పు తీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఈస్ట్‌కోస్ట్ ఎకనామిక్ కారిడార్‌ను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని,అందులో భాగంగా తొలి దశలో విశాఖ చెన్నై కారిడార్ అభివృద్ధి జరగనుందని వెల్లడించారు. జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజన్సీ నేతృత్వంలో కృష్ణపట్నం కేంద్రంగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ , ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్(ఎన్ఐసీడీఐటీ) భాగస్వామ్యం ద్వారా చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్(సీబీఐసీ) అభివృద్ధికి 1300 కోట్ల నిధులు కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో పరిశ్రమలను ఆదుకోవడం కోసం కోవిడ్-19 సమయంలో ఆత్మనిర్భర్ సహా పలు కీలక సంస్కరణలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధిలో జపాన్ పాత్ర ఎంతో కీలకమని, రాష్ట్రంతో జపాన్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఏడాదిన్నర ప్రభుత్వంతో మరింత అనుబంధం ఏర్పడిందని మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఇండస్ట్రియల్ టౌన్షిప్ నిర్మిస్తాం
కలెక్టర్ యువరాజ్ అచ్యుతాపురం:ఎస్ఈజెడ్ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు వసతి ఏర్పాటుకు ఇండస్ట్రియల్ టౌన్షిప్ నిర్మాణం చేపడతామని కలెక్టర్ యువరాజ్ తెలిపారు. సోమవారం ఆయన బ్రాండిక్స్ పరిశ్రమను సందర్శించారు. దూరప్రాంతాలనుంచి పరిశ్రమకు రావడం వల్ల ఎదుర్కొం టున్న సమస్యలను యాజమాన్యం, ఉద్యోగులనుంచి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులను తరలించడంలో పరిశ్రమలకు భారంగా ఉందన్నారు. ఉద్యోగులు వ్యయప్రయాసలు పడాల్సి వస్తుందన్నారు. ట్రాఫిక్ సమస్య, ఇంధన వినియోగం తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా టౌన్షిప్ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఉద్యోగులు తమ జీతం నుంచి కొంత భాగాన్ని వాయిదాగా చెల్లించడానికి ముందుకు వస్తే ఇంటినిర్మాణం చేపట్టి అందిస్తామన్నారు. ఇందుకోసం చోడపల్లి సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. సెజ్‌కు సమీపంలో మరికొంత ప్రభుత్వ స్థలాన్ని సేకరించి టౌన్‌ఫిప్‌కు సిద్ధం చేస్తామని వివరించారు. చదరపు అడుగు రూ.వెయ్యి నుంచి రూ.1500 ధరలో నిర్మాణం చేపట్టేలా సంస్థలకు అప్పగిస్తామన్నారు. ఉద్యోగికి తక్కువ ధరకు అపార్టమెంట్ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొదటి వాయిదా చెల్లించిన వెంటనే ఉద్యోగికి ఇల్లు అప్పగిస్తామని వాయిదాలు పూర్తయిన తరువాత ఇంటి డాక్యుమెంట్‌ను అందజేస్తామని చెప్పారు. మొదటి విడతగా 15 వేల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం నిర్మించే పైపులైన్‌కు పూడిమడక మత్స్యకారులు సహకరించాలని కోరారు. ఉన్నఫలంగా 4,500 మందికి ఉద్యోగాలు కల్పించడం సాధ్యపడదన్నారు. ప్యాకేజీ తీసుకొని పైపులైన్‌క అంగీకరిస్తే అంచెలంచెలుగా ఉపాధి కల్పిస్తామని తెలిపారు. దీనిపై మత్స్యకారులతో బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రాండిక్స్ హెచ్ఆర్ మేనేజర్ రఘుపతి, భాస్కర్ , శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణకు ఇబ్బందుల్లేకుండా చూడండి
కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు విజయవాడ బ్యూరో: ఎయిర్‌పోర్టులు, పోర్టులు, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల విషయంలో భూసేకరణకు ఇబ్బందులు లేకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, మంత్రులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రూ.16,500 కోట్ల వ్యయంతో 1205 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణ పనులు చేపట్టినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వెయ్యి కిలోమీటర్ల మేర అమరావతి-కర్నూలు, అమరావతి-అనంతపురం రహదారులు నిర్మిస్తామన్నారు. రద్దీని బట్టి ఈ మార్గంలో రెండు, నాలుగు, ఆరు రహదార్లను నిర్మిస్తామన్నారు. వీటికి భూసేకరణ ఇబ్బందులు లేకుండా 15 రోజుల్లో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమరావతి ఔటర్ రింగు రోడ్డుకు సవివర నివేదిక సిద్ధం చేసినట్లు ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించే సూక్ష్మ చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ)ల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్ విస్తరణకు భూములు సేకరించాలని ఆదేశించారు. నిర్ణీత కాల పరిమితిలోపు పరిశ్రమలు స్థాపించకపోతే ప్రభుత్వం కేటాయించిన భూములను తిరిగి వెనక్కితీసుకోవాలని ఆదేశించారు. అమరావతిలో నాలెడ్జ్ ఎకానమీ జోన్ (కేఈజెడ్) ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నాలెడ్జ్ ఆధారిత ఆర్థికాభివృద్ది కోసం ఉపయోగపడే ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిది అవుతుందని తెలిపారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో రెండోరోజు మంగళవారం ఆయన పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ భాగస్వామ్యంతో ఈ సంవత్సరం జూన్‌కల్లా కేఈజెడ్ పనులు ప్రారంభించి 2017నాటికి మొదటి దశను పూర్తిచేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. హార్వర్డ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారం తీసుకుని ముందుకెళ్లాలని, ప్రతి జిల్లాలోనూ కేఈజెడ్ నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జాయింట్ వెంచర్లో టవర్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు వారంలో ప్రతిపాదనలు సిద్ధంచేయాలని చెప్పారు. 49 శాతం వాటా ద్వారా ఈ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఫైబర్ గ్రిడ్ పనులను సమీక్షించిన ముఖ్యమంత్రి ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్ టీవీని ఫైబర్ లైన్ ద్వారా అందించాలనేది తమ ఆశయమని చెప్పారు. దేశంలో ఇంటర్నెట్ సగటు వేగం 2.5 ఎంబీపీఎస్ కాగా అంతర్జాతీయ స్థాయిలో ఇది పది ఎంబీపీఎస్‌గా ఉందన్నారు. మన రాష్ట్రంలో అంతకుమించిన వేగంతో తక్కువ ధరకే త్వరలోనే అందిస్తామన్నారు. జూన్ నాటికి 23 వేల కిలోమీటర్ల కేబుల్ వేయడం పూర్తవుతుందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో కోటీ 30 లక్షల కుటుంబాలకు ఫైబర్ గ్రిడ్ ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. రూ.333 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులో మొబైల్ నుంచి ల్యాండ్‌లైన్ టెలిఫోన్‌కు వచ్చే కాల్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు. కేంద్రం కూడా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చూసి ఆశ్చర్యపోయిందని తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ ఏపీ ఫైబర్ గ్రిడ్ బ్యాండ్ విడ్త్‌నే వినియోగించాలని ఆదేశించారు. జాతీయ రహదారుల పక్కన వసతుల కల్పన మంచి ఆదాయ వనరని, వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నారు. 193 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న శ్రీకాకుళం జిల్లా అన్నింట్లోనూ వెనుకబడ్డానికి సరైన ప్రణాళికలు రూపొందించక పోవడమేనన్నారు. నేవీ సహకారంతో క్రూయిజ్, వాటర్ స్కూటర్స్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తేవచ్చన్నారు. విరాట్ యుద్ధ నౌకను విశాఖలో ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చన్నారు. సమావేశంలో మౌలిక సదుపాయాలపై ఆ శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ ప్రజెంటేషన్ ఇస్తూ మార్చికల్లా గన్నవరం ఎయిర్‌పోర్టు భూసేకరణ పూర్తవుతుందని, ఏప్రిల్‌లో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని తెలిపారు. ప్రాజెక్టులు రాకుండా, అభివృద్ధి జరక్కుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయన్నారు. ప్రాజెక్టులు రావడంతో లాభం తప్ప నష్టం జరగదనే విషయాన్ని ప్రజలకు వివరించగలిగితే భూసేకరణ సమస్యే కాదని చెప్పారు. జిల్లాకు రెండేసి చొప్పున 25 ఇండస్ట్రియల్ సిటీలు నిర్మిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ చెప్పారు. ప్రతి కుటుంబానికి ఇల్లు అంశంపై పారిశ్రామికవేత్త శ్రీనిరాజు ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండోరోజు సమావేశాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇంధన రంగంపై చర్చతో ప్రారంభించారు. సమావేశంలో పలువురు మంత్రులు, 13 జిల్లాల కలెక్టర్లు, ముఖ్యకార్యదర్శులు, విభాగాధిపతులు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. -
‘డ్రాగన్’ చేతికి భవానీ ద్వీపం
* పారిశ్రామిక టౌన్షిప్ ఏర్పాటు చేయించేందుకు సర్కారు యత్నం * చైనా బృందానికి ప్రత్యేక హెలీకాప్టర్ సమకూర్చిన వైనం సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: కృష్ణమ్మ గర్భంలో కొలువుదీరి ఆంధ్రప్రదేశ్ పర్యాటక చిత్రపటంలో ప్రముఖంగా చోటు దక్కించుకున్న భవానీ ద్వీపాన్ని చైనాలోని అతిపెద్ద ప్రైవేటు కమర్షియల్ స్పేస్ డెవలపర్ డాలియన్ వాండా కంపెనీ చేతికి అప్పగించేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమవుతోంది. భవానీ ద్వీపాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించాలనే యోచనలో ఉన్న ప్రభుత్వానికి వాండా గ్రూప్ ప్రతినిధుల పర్యటన కలిసొచ్చింది. 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ద్వీపంలో ఐదు నక్షత్రాల హోటల్ నిర్మించేందుకు వాండా గ్రూపు ప్రతినిధులు ఆసక్తి కనబరిచినట్లు అధికార వర్గాల సమాచారం. జూలై 15 నాటికి సింగపూర్ నుంచి సీడ్ కేపిటల్ ప్లాన్ అందిన తర్వాత భవానీ ద్వీపాన్ని లీజుకిచ్చేందుకు సర్కారు పెద్దలు ఉద్యుక్తులవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం ఆహ్వానంతో.... :ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో వాండా కంపెనీ ప్రతినిధుల్ని ఆహ్వానించారు. డాలియన్ వాండా గ్రూప్‌తో పారిశ్రామిక టౌన్షిప్ ఏర్పాటు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడుతోంది. వాండా గ్రూప్ పారిశ్రామిక టౌన్‌షిప్‌కు అనువైన స్థలం కోసం కొద్దిరోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. అందులో భాగంగా గురువారం మన రాష్ట్రానికీ వచ్చింది. దీంతో మాథ్యూ అబాట్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పరిశీలించింది. గురువారం రాజధాని ప్రాంతంలోని అనంతవరం, నిడమర్రుతోపాటు కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి ప్రాంతాల్లో పర్యటించింది. శుక్రవారం ప్రకాశం జిల్లా దొనకొండ, నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టుకు సమీపంలోని కత్తువపల్లి ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను పరిశీలించింది. భవానీ ద్వీపం ఏరియల్ వ్యూ కోసం ఏపీఐఐసీ, ఇన్‌క్యాప్ ఉన్నతాధికారులు హెలీకాప్టర్‌ను రప్పించారు. అందులోనే చైనా బృందం విజయవాడ నుంచి దొనబండ అటు నుంచి కృష్ణపట్నం పోర్టు అక్కడి నుంచి తిరుపతి వెళ్లింది. వాండాపైఆసక్తి తెలియజెప్పేందుకే చైనా బృందానికి ప్రభుత్వం రెడ్‌కార్పెట్ వేసినట్లు తెలుస్తోంది. -
నలుగురి రాజీనామా
సాక్షి, ముంబై: శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే పుణే, పింప్రి-చించ్వడ్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. నాగపూర్‌లో సోమవారం నుంచి శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఎన్సీపీకి చెందిన బాపూ పటారే, అన్నా బన్సోడేలతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు లక్ష్మణ్ జగ్తాప్, విలాస్ లాండేలు రాజీనామా చేశారు. పింప్రి-చించ్వడ్, వడ్గావ్, శేరి, బోసరీ తదితర ప్రాంతాల్లో ప్రజలు నివసించే ఇళ్లను క్రమబద్దీకరించాలని ఎన్నో రోజులుగా కోరుతున్నా, ముఖ్యమంత్రికి ఎన్నోసార్లు విన్నవించుకున్న స్పందన కరువైందని, అందుకు నిరసనగానే తాము రాజీనామా చేస్తున్నామని ఎమ్మెల్యేలు ప్రకటించారు. పింప్రి-చించ్వడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిన గ్రామాల్లోని గ్రామపంచాయితీలు అనుమతించిన నిర్మాణాలను అక్రమకట్టడాలుగా కార్పొరేషన్ పేర్కొంది. ఈ నిర్మాణాలను క్రమబద్దీకరించాలని స్థానిక ప్రజలతోపాటు రాజకీయ నాయకులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. గ్రామపంచాయితీ అనుమతించిన కట్టడాలను అవసరమైతే నామమాత్ర జరిమానాతో లేదా ఉల్లాస్‌నగర్ కార్పొరేషన్ తరహాలో ఈ కట్డాలను కూడా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు తెచ్చినా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అందుకు నిరసనగానే చివరికి ఇలా రాజీనామాలు చేయాల్సివచ్చిందన్నారు. మమ్మల్ని అడ్డుకునేందుకే: ప్రతిపక్షాలు నలుగురి ఎమ్మెల్యేల రాజీనామాలను ప్రతిపక్షాలు రాజకీయ స్టంట్‌గా అభివర్ణిస్తున్నాయి. పింప్రి-చించ్వడ్ చుట్టుపక్కల పరిసరాల్లోని అక్రమంగా పేర్కొనే కట్టడాలను క్రమబద్ధీకరించాలనే డిమాండ్ సుమారు గత నాలుగేళ్లుగా ఉందని, ఈ విషయంపై నాగపూర్ అసెంబ్లీ హాల్ ఎదుట మంగళవారం తాము ధర్నా చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించామని, అయితే తమకు ఎక్కడ గుర్తింపు దక్కుతుందోనన్న ఆందోళనతో ఇలా ఎన్సీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారని ప్రతిపక్ష బీజేపీ, శివసేన నేతలు ఆరోపించారు. మండేలాకు నివాళి... మానవహక్కుల పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు రాష్ట్ర అసెంబ్లీ సోమవారం నివాళులర్పించింది. శీలాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఇరు సభల్లో మండేలాకు నివాళిగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. విదర్భ కోసం డిమాండ్... గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశాల్లో ఒకటైన ప్రత్యేక విదర్భ కూడా సోమవారం సభను కుదిపేసింది. సభలో ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ప్రత్యేక విదర్భ కోసం పట్టుబట్టారు. అంతటితో ఊరుకోకుండా అసెంబ్లీ బయట ప్లకార్డులు, బ్యానర్లను చేతబట్టుకొని, నినాదాలు చేస్తూ విదర్భ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను చాటారు. రానున్న రోజుల్లో విదర్భ డిమాండ్ సభను మరింతగా కుదిపేసే అవకాశం ఉంది.