సాక్షి, ముంబై: శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే పుణే, పింప్రి-చించ్‌వడ్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. నాగపూర్‌లో సోమవారం నుంచి శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఎన్సీపీకి చెందిన బాపూ పటారే, అన్నా బన్సోడేలతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు లక్ష్మణ్ జగ్తాప్, విలాస్ లాండేలు రాజీనామా చేశారు. పింప్రి-చించ్‌వడ్, వడ్‌గావ్, శేరి, బోసరీ తదితర ప్రాంతాల్లో ప్రజలు నివసించే ఇళ్లను క్రమబద్దీకరించాలని ఎన్నో రోజులుగా కోరుతున్నా, ముఖ్యమంత్రికి ఎన్నోసార్లు విన్నవించుకున్న స్పందన కరువైందని, అందుకు నిరసనగానే తాము రాజీనామా చేస్తున్నామని ఎమ్మెల్యేలు ప్రకటించారు.
పింప్రి-చించ్‌వడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిన గ్రామాల్లోని గ్రామపంచాయితీలు అనుమతించిన నిర్మాణాలను అక్రమకట్టడాలుగా కార్పొరేషన్ పేర్కొంది. ఈ నిర్మాణాలను క్రమబద్దీకరించాలని స్థానిక ప్రజలతోపాటు రాజకీయ నాయకులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. గ్రామపంచాయితీ అనుమతించిన కట్టడాలను అవసరమైతే నామమాత్ర జరిమానాతో లేదా ఉల్లాస్‌నగర్ కార్పొరేషన్ తరహాలో ఈ కట్డాలను కూడా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు తెచ్చినా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అందుకు నిరసనగానే చివరికి ఇలా రాజీనామాలు చేయాల్సివచ్చిందన్నారు.
మమ్మల్ని అడ్డుకునేందుకే: ప్రతిపక్షాలు
నలుగురి ఎమ్మెల్యేల రాజీనామాలను ప్రతిపక్షాలు రాజకీయ స్టంట్‌గా అభివర్ణిస్తున్నాయి. పింప్రి-చించ్‌వడ్ చుట్టుపక్కల పరిసరాల్లోని అక్రమంగా పేర్కొనే కట్టడాలను క్రమబద్ధీకరించాలనే డిమాండ్ సుమారు గత నాలుగేళ్లుగా ఉందని, ఈ విషయంపై నాగపూర్ అసెంబ్లీ హాల్ ఎదుట మంగళవారం తాము ధర్నా చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించామని, అయితే తమకు ఎక్కడ గుర్తింపు దక్కుతుందోనన్న ఆందోళనతో ఇలా ఎన్సీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారని ప్రతిపక్ష బీజేపీ, శివసేన నేతలు ఆరోపించారు.
మండేలాకు నివాళి...
మానవహక్కుల పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు రాష్ట్ర అసెంబ్లీ సోమవారం నివాళులర్పించింది. శీలాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఇరు సభల్లో మండేలాకు నివాళిగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
విదర్భ కోసం డిమాండ్...
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశాల్లో ఒకటైన ప్రత్యేక విదర్భ కూడా సోమవారం సభను కుదిపేసింది. సభలో ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ప్రత్యేక విదర్భ కోసం పట్టుబట్టారు. అంతటితో ఊరుకోకుండా అసెంబ్లీ బయట ప్లకార్డులు, బ్యానర్లను చేతబట్టుకొని, నినాదాలు చేస్తూ విదర్భ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను చాటారు. రానున్న రోజుల్లో విదర్భ డిమాండ్ సభను మరింతగా కుదిపేసే అవకాశం ఉంది.
నలుగురి రాజీనామా
Published Tue, Dec 10 2013 12:29 AM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement
Advertisement