తలకాయలు మార్చినా తలరాతలు మారేనా?
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీల్లో అంతర్మథనం మొదలైంది. అనేకరకాల సమీక్షల తర్వాత ఇరుపార్టీల అధిష్టానాలు.. రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షులను, కీలక పదవుల్లో ఉన్న నాయకులను మార్చాలని నిర్ణయించాయి. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో కథనాలు వస్తున్నాయి. మహారాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మార్చాలని కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు.
ఇక ఎన్సీపీలో కూడా ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు భాస్కర్ జాదవ్‌ను మార్చనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రకమైన మార్పులు ప్రజాస్వామ్య కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలకు మళ్లీ అధికారాన్ని కట్టబెడతాయా? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తలకాయలు మార్చినంత మాత్రనా ఇరుపార్టీల తలరాతలు మారే అవకాశం లేదని కొందరు చెబుతుండగా నాయకత్వ మార్పు కొంతమేరకైనా ప్రజలపై ప్రభావం చూపుతుందని మరికొందరంటున్నారు.
సోనియాను కలిసిన నారాయణ్ రాణే...
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కేవలం రెండంటే రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరుతూ ఆ పార్టీ నేత నారాయణ్ రాణే, అధినేత్రి సోనియా గాంధీని కలిసినట్లు తెలిసింది. దీంతో రాణేను పార్టీ అధినాయకత్వమే పిలిపించిందా? లేక రాణే స్వయంగా వెళ్లి అధిష్టానాన్ని కలిశారా? అనే విషయంలో ఎటువంటి స్పష్టత లేకున్నా మొత్తానికి పార్టీ పదవులతోపాటు ముఖ్యమంత్రి పదవిలో కొత్తవారిని కూర్చోబెట్టాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందనే సమాచారం బయటకు వచ్చింది.
ముఖ్యమంత్రి పదవిని షోలాపూర్ నేత, మాజీ హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు ఇవ్వనున్నట్లు కొందరు చెప్పుకుంటున్నారు. ఇక ఎంసీసీసీ అధ్యక్ష పదవిని మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావ్ చవాన్‌కు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అయితే పెయిడ్ న్యూస్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చవాన్ దాని నుంచి బయటపడితేగానీ ఏ నిర్ణయం తీసుకోలేమనే నిర్ణయంలో అధిష్టానం ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
ఫలిస్తే సరే.. మరి వికటిస్తే..
పార్టీ అధిష్టానం చేస్తున్న కసరత్తు ఫలిస్తే సరే... మరి వికటిస్తే పరిస్థితి ఏంటని ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఎంపికచేసేవారి విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ఎంపిక చేసే ముందు కూడా పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయమై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. కీలక పదవుల బాధ్యతలను కొత్తవారికి అప్పగించినప్పుడు వారి మద్దతుదారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకపోయినా వారి ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. వ్యక్తులకే కాకుండా ప్రాంతాలవారీగా కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇలా అన్ని విషయాల్లో సమతూకం పాటించినప్పుడే మార్పులు సత్ఫలితాలనిస్తాయని చెబుతున్నారు.
జాదవ్ స్థానంలో ఎవరో?
కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీలో కూడా ప్రక్షాళన జరిగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు భాస్కర్ జాధవ్‌ను మార్చనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల పదాధికారులతో శరద్‌పవార్ నిర్వహించిన సమావేశంలో ఈ విషయమై అభిప్రాయాలు కూడా సేకరించినట్లు చెప్పుకుంటున్నారు. భాస్కర్ జాదవ్‌కు మంత్రి మండలిలో చోటిచ్చి పార్టీ అధ్యక్ష బాధ్యతలను సునీల్ తట్కరే కు అప్పగించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్న నేపథ్యంలో అధిష్టానం కూడా ఆ దిశగానే యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌లో మార్పుల జరిగిన తర్వాత వాటికి అనుగుణంగా పార్టీలో మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఠాక్రేలకు భుజ్‌బల్ చురకలు
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేలకు ఎన్సీపీ నేత, ప్రజాపనుల శాఖమంత్రి ఛగన్ భుజ్‌బల్ చురకలించారు. ‘ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నవారందరికీ శుభాకాంక్షలు’ అంటూ పరోక్షంగా ఠాక్రేలిద్దరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్‌ఠాక్రేలు ముఖ్యమంత్రులు కావాలంటూ ఇరు పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఇటీవల వార్తాపత్రికల్లో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. వీటిపై స్పందించిన భుజ్‌బల్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.