
ఎరువులకూ సమ్మె సెగ
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాదీ రైతులకు ఎరువుల సమస్య తలెత్తనుంది. విచిత్రమేంటంటే.. ఓడరేవుల్లో, గోడౌన్లలో పుష్కలంగా ఎరువుల నిల్వలు ఉన్నా అవి రైతుల దరిచేరని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో ఉధృతంగా జరుగుతున్న సమ్మె ఒక వైపు, నాబార్డ్ చైర్మన్ ప్రకాశ్ బక్షి సిఫారసులకు నిరసనగా ‘ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల’ సిబ్బంది ఆందోళన బాట పట్టడం మరోవైపు.. ఎరువుల సరఫరాపై ప్రభావం చూపించనున్నాయి. ఈ సమస్యలను అధిగమించి సకాలంలో రైతుల ఎరువుల సరఫరాకు ప్రత్యామ్నాయాలపై అటు ప్రభుత్వం కానీ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులుకానీ దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. విదేశాల నుంచి మన ఓడరేవులకు చేరుతున్న ఎరువులు, వాటిని రైల్వే వ్యాగన్లలో వివిధ జిల్లా కేంద్రాలకు తరలించడంతోనే తమ బాధ్యత తీరిపోయిందన్న వైఖరి ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఎరువుల సమస్యపై ప్రస్తావిస్తే ‘ఎక్కడా ఎరువుల కొరత లేదు. ప్రతి జిల్లాలోను అవసరానికన్నా ఎక్కువగానే ఎరువుల నిల్వలు ఉన్నాయంటూ’ అధికారులు గణాంకాలను ఉదహరిస్తున్నారు. అవసరానికి మించి నిల్వలు ఉండటం వాస్తవమే అయినా అవి రైతులకు అందచేయడంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఆలోచించడంలేదు.
పెరిగిన యూరియా వినియోగం..: గత ఏడాదితో పోల్చుకుంటే రాష్ట్రంలో యూరియా, డీఏపీ వినియోగం తగ్గింది. డీఏపీ తదితర ఎరువులపై ‘సబ్సిడీ’ తీసివేయడంతో యూరియా ధరకు, మిగతా ఎరువుల ధరలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. కాంప్లెక్స్ ఎరువులు కొనలేక, పైరుకు ఏదో ఒక ఎరువు వేయాలన్న ధోరణితో రైతులు యూరియా వేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో జూలై 31 నాటికి 7.45 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది 8.35 లక్షల టన్నుల యూరియా అమ్ముడైంది. ఇదే సమయంలో గత ఏడాది డీఏపీ 1.86 లక్షల టన్నులు అమ్ముడవగా, ఈ ఏడాది 1.51 లక్షల టన్నులు అమ్ముడవడమే దీనికి నిదర్శనం.
నిల్వలు భారీగా ఉన్నా..: అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను యూరియా 330 డాలర్ల నుంచి 303 డాలర్లకు పడిపోయిన నేపథ్యంలో దాదాపు 20 లక్షల టన్నుల యూరియా కొనుగోలు చేశామని, గుజరాత్, ముంబై తదితర పడమటి ప్రాంతమంతా అధిక నిల్వలతో నిండిపోవడం కారణంగా ఈ 20 లక్షల టన్నుల యూరియా మన తూర్పు తీర ప్రాంత ఓడరేవులకే వస్తోందని ఓ ఎరువుల కంపెనీ అధికారి వివరించారు. ఆగస్టు నెలలో ఇప్పటి వరకూ 13 ర్యాక్‌లలో (రైల్వే వ్యాగన్లు) దాదాపు 35,750 టన్నుల ఎరువులు వివిధ జిల్లాలకు సరఫరా అయ్యాయని, ఓడరేవుల్లో మరో 17 ర్యాక్‌ల(46,750 టన్నులు) లోడింగ్ జరుగుతోందని, రెండు మూడు రోజుల్లో ఈ సరకు కూడా వివిధ జిల్లాలకు చేరుకోనుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఆగస్టు నెలలో 4,63,530 టన్నుల యూరియా సరఫరా లక్ష్యం కాగా ఇప్పటికే(16-8-13కు) 2,61,893 టన్నుల యూరియా వివిధ జిల్లాలకు సరఫరా చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఎరువుల నిల్వలకు కొదవ లేదని కాకపోతే వచ్చిన నిల్వలను రైతుల వద్దకు సక్రమంగా చేరవేయడంలోనే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఓ ఎరువుల కంపె నీ ప్రతినిధి వివరించారు. సీమాంధ్రలో జరుగుతున్న సమ్మె కారణంగా రైల్వే వ్యాగన్ల నుంచి ఎరువుల బస్తాలను రోడ్డు మార్గంలో తరలించేందుకు ‘ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు’ ముందుకు రావడంలేదని, దాంతో ఎరువులను ఎక్కువగా తెలంగాణ జిల్లాలకు తరలించామని ఓ ఎరువుల కంపెనీ అధికారి చెప్పారు.
సహకార సంఘాల ఆందోళన..: సీమాంధ్రలో జరుగుతున్న సమ్మెకు తోడు, ప్రాథమిక సహకార సంఘాల(ప్యాక్స్)ను నిర్వీర్యం చేస్తూ ‘బక్షి సిఫారసుల’ అమలును వ్యతిరేకిస్తూ ‘సహకార’ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఈ నెల 19న అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీబీల ముట్టడి కార్యక్రమాలను ప్రకటించారు. ఎరువుల సరఫరాలో ‘ప్యాక్స్’ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కృష్ణా డెల్టాలో ఇప్పుడిప్పుడే వరి నాట్లు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్యాక్స్’ సిబ్బంది ఆందోళన బాట పడితే ఎరువులు గోడౌన్లలోనే ఉండిపోయే ప్రమాదం ఉంది. రాబోయే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావిస్తే, ఇప్పటి వరకు ఎరువుల రవాణా సమస్య తలెత్తలేదని, భవిష్యత్‌లో అలాంటి సమస్య వస్తే ఆలోచిస్తామని అంటున్నారు.