అన్నదమ్ముల్లాంటి తెలుగువారి మధ్య విద్వేషాలు రగిల్చారు
కాంగ్రెస్ పార్టీ తీరుపై వైఎస్ విజయమ్మ ధ్వజం
విజయమ్మ నేతృత్వంలో రాష్ట్రపతి, ప్రధానితో వైఎస్సార్ సీపీ నేతల భేటీ
సమస్యలకు పరిష్కారం చూపకుండా విభజన సమంజసం కాదని స్పష్టీకరణ
సమన్యాయం చేయాలని వినతి.. చేయలేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలి
వైఎస్‌లాంటి సమర్థుడైన నేత లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్న ప్రధాని
విభజన అంశంపై మంత్రుల కమిటీ వేస్తామని హామీ
ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనతో సీమాంధ్ర అగ్నిగుండంలా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయంకానీ, యూపీఏ నిర్ణయంకానీ త్వరలో ప్రభుత్వ నిర్ణయం కాబోతోందని తెలిసి తామంతా ఆందోళనతో ఢిల్లీకి వచ్చామన్నారు. ‘‘విభజన ప్రకటనతో సీమాంధ్ర అగ్నిగుండంగా మారింది. సీమాంధ్ర వ్యాప్తంగా కోట్ల మంది అన్యాయం జరుగుతోందంటూ ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు. సచివాలయం, ఇరిగేషన్, ఎల్‌ఐసీ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా తెలుగు వారు రెండుగా విడిపోయారు. ఇలా విడిపోవడం, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని నిర్ణయించడం చాలా బాధగా ఉంది. నిర్ణయం పూర్తిగా అమల్లోకి రాకముందే తెలుగు ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచారు. అన్నదమ్ముల్లాంటి ప్రాంతాల మధ్య కొట్లాటలు పెట్టారు’’ అని విజయమ్మ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. 2004, 2009లో వైఎస్ హయాంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా లేని పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఎందుకొచ్చాయని ఆమె ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో ఆందోళనలు, నిరసనలు, విభజన నిర్ణయంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలను ప్రధాని, రాష్ట్రపతి, ఇతర పార్టీల దృష్టికి తెచ్చేందుకు విజయమ్మ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం మంగళవారం ఢిల్లీకి వచ్చింది. ఈ బృందం మొదటగా పార్లమెంట్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆయన కార్యాలయంలో కలిసింది. 20 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో సీమాంధ్రలోని వాస్తవ పరిస్థితిని వివరించింది. రాష్ట్ర విభజన విషయంలో తమ పార్టీ విధానం, పలు వేదికలపై పార్టీ వెల్లడించిన వైఖరులతో కూడిన నివేదికను ఆయనకు సమర్పించింది. విభజన నిర్ణయం ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేసేదిలా లేదని, అనేక సమస్యలను పరిష్కరించకుండా నిర్ణయం చేయడం ఏమాత్రం సమంజసం కాదని విజయమ్మతో పాటు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రధానికి వివరించారు. తండ్రిలా అందరికీ సమన్యాయం చేయాలని, అలాకాని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరారు. దీనికి ప్రధాని స్పందిస్తూ ‘వైఎస్ లాంటి సమర్థుడైన నాయకుడు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఆయన ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కావు. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక విభజన అంశాలను పరిశీలించేందుకు మంత్రుల కమిటీని వేస్తాం. కమిటీ అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలిస్తుంది’ అని తెలిపారు. అనంతరం పార్టీ నేతల బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి భవన్‌లో కలిసింది. విభజన అంశాలను వివరించి సమన్యాయం చేయాలని కోరింది. దీనికి రాష్ట్రపతి స్పందిస్తూ అన్ని అంశాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం ఎలా ఉందని ప్రణబ్ వాకబు చేశారు. ఈ భేటీ అనంతరం విజయమ్మ విలేకరులతో మాట్లాడుతూ.. అసలు ఏ ప్రాతిపదికన విభజన నిర్ణయం తీసుకుంటున్నారో చెప్పకుండా ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ప్రధాని, రాష్ట్రపతిలకు తాము వివరించామన్నారు. విభజన అంశంపై మంత్రుల కమిటీ వేస్తామని ప్రధాని హామీ ఇవ్వగా అన్ని అంశాలు పరిశీలిస్తామని రాష్ట్రపతి తెలిపారని విజయమ్మ అన్నారు.
పరిష్కారం చూపకుండా విభజనెలా?
విభజనతో తలెత్తే అనేక సమస్యలకు పరిష్కారం చూపకుండా రాష్ట్రాన్ని వీడదీయడం భావ్యం కాదని విజయమ్మ అన్నారు. నదీ జలాలు, విద్యుత్ పంపిణీ, రాజధాని విషయంలో సమస్యల పరిష్కారం ఎలా చేస్తారో చెప్పకుండా, ఏ పార్టీనీ, ఆ ప్రాంత ప్రజలను సంప్రదించకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని ఆక్షేపించారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని ప్రధాని, రాష్ట్రపతిలను కోరామని విజయమ్మ తెలిపారు. ఇదే సమయంలో ‘‘న్యాయం చేయలేకపోతే విభజన చేసే నిర్ణయాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారు? సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంపై వారు ఏ పార్టీతో చర్చించారు? ఎవరితో మాట్లాడారు? సీమాంధ్ర ప్రజలకు చెప్పకుండా నిర్ణయం ఎలా తీసుకున్నారు?’’ అని అడిగామన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగానే తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నా చలనం లేకపోవడంతో తాను, జగన్ సైతం రాజీనామా చేశామని వెల్లడించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో ఒక్క ఏపీనే ఎందుకు విభజించాల్సి వస్తోందని ప్రశ్నించారు. ‘‘మిగతా రాష్ట్రాల జోలికి పోని కేంద్రం, కేవలం జగన్‌ను చూసే రాష్ట్రాన్ని విడగొడుతున్నట్టు మాకు అనిపిస్తోంది. ఈ తీరు మమ్మల్ని తీవ్ర బాధకు గురిచేస్తోంది’’ అని వెల్లడించారు.
రాష్ట్ర ప్రాతినిధ్యం లేకుండానే..
ఇక కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీపై విజయమ్మ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ఆంటోనీ కమిటీలో సభ్యులుగా కేరళ నుంచి ఆంటోనీ, తమిళనాడు నుంచి చిదంబరం, కర్ణాటక నుంచి మొయిలీ ఉన్నారు. మధ్యప్రదేశ నుంచి దిగ్విజయ్ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు చెప్పగలిగేవారు ఒక్కరూ కమిటీలో లేరు. అలాంటప్పుడు సోనియాకు రాష్ట్ర ప్రజల మనోభావాలు ఎలా తెలుస్తాయి’’ అని ఆమె ప్రశ్నించారు. ఆంటోనీ కమిటీకి సమస్యలు చెప్పండని, విభజన ప్రక్రియ ఆగదు అని దిగ్విజయ్ పదేపదే చెబుతున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రధాని, రాష్ట్రపతిని కలిసి పలు అంశాలు వివరించామన్నారు.
నీటి కేటాయింపులు ఎలా చేస్తారు?
అడ్డగోలు విభజన చేస్తే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఉప్పు నీరు తప్పితే మంచినీరు ఎక్కడుందని విజయమ్మ ప్రశ్నించారు. ‘‘నారాయణపూర్, ఆల్మట్టి నిండితే తప్ప కిందకి నీరొచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ ఏర్పడితే నాగార్జునసాగర్, శ్రీశైలం, పోలవరం ప్రాజెక్టులకు నీరెక్కడి నుంచి కేటాయిస్తారు? ఇక కృష్ణా డెల్టాలో మిగులు జలాలు తగ్గించే పరిస్థితి ఉంది. దిగువన ఉన్న రాష్ట్రానికి కరువొచ్చినా, వరదొచ్చినా భవిష్యత్‌లో రైతుకు ఇబ్బందే. వీటన్నింటికీ కేంద్రం జవాబు చెప్పాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు.
తెలంగాణ పరిస్థితి ఏంటి?
తెలంగాణలోని నెట్టెంపాడు, భీమా, ఎస్‌ఎల్‌బీసీ, సీమాంధ్రలోని హంద్రీ నీవా, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని ఎలా కేటాయిస్తారో తెలుపలేదని విజయమ్మ అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల పూర్తయితే తప్ప తెలంగాణకు న్యాయం జరగదని వివరించారు. ఈ సమస్యలన్నింటి పై కేంద్రం సమాధానం చెప్పాలని కోరారు. వైఎస్ మూడు ప్రాంతాలకు సమానంగా జలయజ్ఞం చేపట్టార ని, ప్రగతి పథంలో ముందుకు నడిపించాలని కోరుకున్నారని వెల్లడించారు.
ఉన్నవన్నీ హైదరాబాద్ చుట్టూనే: ‘‘భోపాల్, జైపూర్, భువనేశ్వర్, పాట్నా, లక్నోలు రాజధానులుగా ఉన్నా ఆయా రాష్ట్రాల్లో ఇతర చోట్ల అభివృద్ధి చేశారు. కానీ హైదరాబాద్ విషయంలో 90% ప్రభుత్వ రంగం అంతా ఇక్కడే కేంద్రీకృతమై ఉంది. నెహ్రూ అనేక పరిశ్రమలను హైదరాబాద్‌కు తెచ్చారు. సీమాంధ్ర నుంచి 80, 90% అనుబంధ పరిశ్రమలు హైదరాబాద్‌కే వచ్చాయి. సీమాంధ్రలో కేవలం వైజాగ్ స్టీల్స్ ఒక్కటే కనిపిస్తోంది. రైస్ మిల్లులు, గోదాములు తప్పితే అక్కడ ఏమీలేవు. ఆదాయంలో 45 నుంచి 50% వరకు హైదరాబాద్ నుంచే ఆదాయం వస్తోంది. దాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేస్తే మిగతా ప్రాంతం పరిస్థితి ఏంటి?’’ అని రాష్ట్రపతిని, ప్రధానిని అడిగామన్నారు.
కలిసినవారు వీరే: రాష్ట్రపతిని, ప్రధానిని కలిసిన వారిలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ మైసూరారెడ్డి, సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ, సోమయాజులు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గుర్నాథరెడ్డి, సుచరిత, భూమన కరుణాకర్‌రెడ్డి, పి.రామకృష్ణారెడ్డి, కె.శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బాలరాజు, ధర్మాన కృష్ణదాసు, బాలినేని శ్రీనివాసరెడ్డి, బాబూరావు, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి, సాయిరాజ్, కొడాలి నాని, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, నేతలు కోన రఘుపతి, నారాయణలు ఉన్నారు.
అగ్నిగుండంగా సీమాంధ్ర
Published Wed, Aug 28 2013 1:32 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement