సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం బాటలోనే నడవాలని రాష్ట్ర పార్టీ పెద్దలు నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో, అప్పుడు పార్టీలో కొనసాగే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉంటారన్న అంశంపై పీసీసీ నేతలు అంచనా వేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా సీమాంధ్ర మంత్రుల్లో పార్టీని వీడేవారెందరు,ఏం జరిగినా కచ్చితంగా పార్టీలోనే కొనసాగే వారెందరని కూపీ లాగుతున్నారు. ఏ జిల్లాలో ఏ మంత్రి ఎలా ఆలోచిస్తున్నారు, ఆయన వ్యూహమేమిటి అంటూ వారి సన్నిహిత నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొద్దిరోజులుగా సీమాంధ్ర మంత్రులను విడివిడిగా పిలిపించుకుని దీనిపై నేరుగా మాట్లాడుతున్నట్టు తెలిసింది. సీఎం, బొత్సతో కలిపి మంత్రివర్గంలో ప్రస్తుతం సీమాంధ్ర నుంచి 19 మంది ఉన్నారు.
విభజనపై ముందుకే వెళ్తే వీరిలో కనీసం తొమ్మిది మంది పార్టీని వీడతారని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సమాచారం. పార్టీ వర్గాల సమాచారం మేరకు... కోస్తాంధ్రలో కన్నా ల క్ష్మీనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్ (గుంటూరు), పార్థసారథి (కృష్ణా), తోట నరసింహం (తూర్పుగోదావరి), ఆనం రామనారాయణరెడ్డి (నెల్లూరు), ఎం.మహీధర్‌రెడ్డి (ప్రకాశం), ఉత్తరాంధ్రలో పి.బాలరాజు (విశాఖపట్నం), కొండ్రు మురళీమోహన్ (శ్రీకాకుళం), రాయలసీమలో ఎన్.రఘువీరారెడ్డి (అనంతపురం), సి.రామచంద్రయ్య (కడప) కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని హామీ ఇచ్చారు. ఇక సమైక్యాంధ్ర ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న మంత్రులెవరూ కాంగ్రెస్‌లో కొనసాగుతారన్న నమ్మకం పార్టీ పెద్దలకు లేదంటున్నారు. ముఖ్యంగా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్న మంత్రులంతా పార్టీని వీడనున్న వారేనని పెద్దలు అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో ఎంతమంది పార్టీతో ఉంటారన్న దానిపై కూడా పీసీసీ అంచనాలు రూపొందిస్తోంది.
పార్టీని వీడే మంత్రులెందరు?
Published Tue, Oct 1 2013 4:01 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement