సమైక్య వాణి | seemandhra MLAs protests for samaikyandhra | Sakshi
Sakshi News home page

సమైక్య వాణి

Published Tue, Dec 17 2013 5:57 AM | Last Updated on Fri, May 25 2018 9:39 PM

seemandhra MLAs protests for samaikyandhra

 సాక్షి ప్రతినిధి, కడప :  రాజకీయాల కోసం తెలుగు ప్రజలను చీల్చరాదంటూ నినదిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ వేదికగా సమైక్యవాణిని వినిపించారు. సోమవారం అసెంబ్లీలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి, ఆకేపాటి అమర్‌నాధరెడ్డి విభజనవాదులకు ధీటైన జవాబు చెప్పారు. ఒక దశలో వేర్పాటు వాదులతో  బాహాబాహికి దిగారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రాంతానికొక అభిప్రాయం వెల్లడిస్తున్న నేపథ్యంలో సమైక్య రాష్ట్రమే అజెండాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఉద్యమిస్తోంది.

తెలంగాణాలో పార్టీ పరిస్థితి గురించి ఆలోచించకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఏకైక అజెండాగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ నేతల మద్దతు కూడగట్టడంలో నిమగ్నమయ్యారు. అదే స్ఫూర్తితో గ్రామస్థాయి వరకు ఆ పార్టీ కేడర్ సమైక్య రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఉద్యమాలు చేస్తోంది. మెజారిటీ ప్రజల పక్షమే తమ అభిమతమంటూ ప్రత్యక్ష ఆందోళనలను సుదీర్ఘకాలంగా కొనసాగిస్తోంది.
 అసెంబ్లీ వేదికగా పోరాటం :
 ప్రజాభీష్టం మేరకు ప్రత్యక్ష పోరాటంలో నిమగ్నమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ వేదికగా సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాధరెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ప్రత్యక్ష పోరులో ముందు వరుసలో నిలుస్తున్నారు. సోమవారం అసెంబ్లీ వేదికగా సమైక్యవాదులపై విభజనవాదులు ప్రత్యక్ష దాడులకు సన్నద్ధమయ్యారు. సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా తమ వాణిని వినిపించడంలో జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఏమాత్రం వెనుకంజ వేయలేదు.

విభజనవాదులతో రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రత్యక్షంగా తలపడటంతో ఆయన చేతికి స్వల్పంగా గాయమై ఎముక చిట్లినట్లు సమాచారం. విభజన వల్ల రాయలసీమ, కోస్తాంధ్రలో ఉత్పన్నమయ్యే సమస్యలను  రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో ఎత్తిచూపారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని  విభజనవాదులు ఆయనపై కూడా ప్రత్యక్ష దాడికి సిద్ధమయ్యారు. ఇంతకాలం సమైక్యవాణిని వినిపించిన ముఖ్యమంత్రి కిరణ్ గొంతు మూగబోయిందని, సమైక్యం కోసం ఎందుకు పోరాటం చేయరని టీడీపీ అధినేత చంద్రబాబును ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఈ సందర్భంగా నిలదీశారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సమైక్యవాణిని చిత్తశుద్ధితో ప్రదర్శించడంపై పలువురు సమైక్యవాదులు హర్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement