సీమాంధ్రలో మిన్నంటిన సమైక్య నిరసనలు
కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీఎన్జీవో సంఘం మంగళవారం హైదరాబాద్ లో డిమాండ్ చేసింది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు సమ్మె ఉధృతంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి వెంటనే సమైక్య ఉద్యమంలో పాల్గొన్నాలని ఎపీఎన్జీవో సంఘం గతంలో వారిని కొరింది. అయితే ఆ విషయంపై ప్రజాప్రతినిధులు తర్జనభర్జన పడుతుండటంతో గత అర్థరాత్రి నుంచి ఏపీఎన్జీవో సంఘం సమ్మెను మరింత తీవ్రతరం చేసింది. దీంతో సీమాంధ్రలోని 13 జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది.
అయా జిల్లాల్లోని ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడ డిపోల్లోనే నిలిచిపోయాయి. సమ్మె ప్రకటించిన ఏపీ ఎన్జీవోల పలు ప్రజాసంఘాలు, ఆర్టీసీ, వ్యాపార సంస్థలు మద్దతు ప్రకటించాయి. తిరుపతి నగరంలోని గాంధీ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి టీచర్స్ జేఏసీ తమ నిరసన తెలిపింది. అలాగే తిరుపతి నుంచి తిరమలకు వెళ్లే బస్సులు డిపోల్లోనే పరిమితమైయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆ సంస్థకు చెందిన కార్మికులు నిరసనకు దిగారు. వివిధ ప్రాంతల నుంచి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అయితే భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేక టీటీడీ చేతులెత్తేసింది.
నెల్లూరు జిల్లాలోని తడ మండలం కాజులూరు వద్ద సమైక్యవాదులు కార్మికులను అడ్డుకున్నారు. కావలిలో బస్సు సర్వీసులను నిరసనకారులు అడ్డుకుని నిలిపివేశారు. దాంతో చెన్నై- బెంగళూరు నగరాల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. నెల్లూరు కలెక్టరేట్‌కు ఏపీఎన్జీవోలు మంగళవారం తాళం వేసి తమ నిరసన తెలియజేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కూడా ఇంచుమించి ఇదే పరస్థితి నెలకొంది. సమైక్యాంధ్రకు మద్దతుగా కృష్ణా జిల్లాలో బంద్ కొనసాగుతుంది.
జిల్లాలోని వివిధ పట్టాణాల్లో బస్సులు డిపోలకే పరిమితమైనాయి. ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం చేపట్టిన సమ్మెలో పాల్గొన్నాయి. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. విశాఖ జిల్లాలో కూడా బంద్ కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. నగరంలోని వివిధ డిపోల్లో 1060 బస్సులు నిలిచిపోయాయి. దాంతో నిత్యం రద్దిగా ఉండే ద్వారకా బస్టాండ్ మంగళవారం బోసిపోయింది.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లకు రవాణా సర్వీసులు ఆగిపోయయి. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరి మార్చుకోవాలని ఆర్టీసీ కార్మికులు మద్దెలపాలెం డిపో వద్ద రాస్తారోకో చేశారు. అయితే సమ్మెతో రోజుకు రూ.70 లక్షలు నష్టం వస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కోన్నారు. అనంతపురంలో సమైకాంధ్ర మద్దతుగా నిరసనకారులు చేపట్టిన సమ్మె ఉధృతంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఏపీఎన్జీవోలు సమ్మెలో పాల్గొన్నారు.