ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ నిరవధిక సమ్మె చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు స్థానిక కర్నూల్‌రోడ్డులోని విద్యుత్ కార్యాలయం వద్ద సోమవారం రిలే దీక్ష ప్రారంభించారు. కేంద్రం మొండివైఖరి వీడి వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే పిలుపు మేరకు సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులకు ఉద్యోగులు బాధ్యులు కాదన్నారు. దీక్షకు ఎన్‌జీఓ నాయకులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా చైర్మన్ అబ్దుల్‌బషీర్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం కేంద్రానికి తాకుతుందని, ఇదే విధంగా సమ్మె కొనసాగించాలని సూచించారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెను ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారని వివరించారు. ప్రజల ఇబ్బందుకు కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతన్నారు. విద్యుత్ ఉద్యోగులకు తాము పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యుత్ జేఏసీ నాయకులు హరిబాబు, పిచ్చయ్య, జయాకరరావు, సాంబశివరావు, ఎన్‌జీఓ నాయకులు బండి శ్రీను, పి రాజ్యలక్ష్మి, మస్తాన్‌వలి, కృష్ణారెడ్డి, కేఎల్ నరశింహారావు, ప్రభాకర్, శ్రీను, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
టైర్లు కాల్చి విద్యార్థుల నిరసన
సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక రామ్‌నగర్‌లోని ఒకటో లైన్ వద్ద భారీ ఎత్తున రోడ్డుపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే టీ నోట్‌ను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు, ఎంపీ తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమైక్యాంధ్ర ఫ్రంట్ నాయకులు నాగరాజు, రాజశేఖర్, వినోద్, విశ్వనాథ్, వనీల్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు ప్రారంభం
Published Tue, Oct 8 2013 4:56 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement