పదేళ్లు ప్రత్యేక హోదా: వెంకయ్య నాయుడు
సాక్షి, కాకినాడ: కేంద్రంలో అధికారంలోకి రాగానే సీమాంధ్రకు కల్పించిన ప్రత్యేక హోదాను ఐదేళ్ల నుంచి పదేళ్లకు పొడిగిస్తామని బీజేపీ అగ్రనేత ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. ‘మోడీఫర్ పీఎం’ కార్యక్రమాన్ని సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేసి ఉంటే కాంగ్రెస్ అధిష్టానం కచ్చితంగా దిగివచ్చేదన్నారు.
వారి చేతకానితనం వల్లే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చిందని, ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నందునే అనైతికపద్దతిలో ప్రవేశపెట్టినా బిల్లుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. విభజన అనివార్యం కావడంతో సీమాంధ్రులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఉభయసభల్లో తమ పార్టీ చేసిన పోరాటం ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిందన్నారు. అయితే వాటిని అమలు చేసే సత్తా కాంగ్రెస్‌కు లేదని, మరో మూడు నెలల్లో అధికారంలోకి రానున్న బీజేపీ ప్రభుత్వం వాటిని సమర్థంగా అమలు చేస్తుందన్నారు.