ప్యాకేజీపైనా రాజకీయాలా? : వెంకయ్య
కాంగ్రెస్ తీరుపై వెంకయ్య ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్ర కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపైనా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ సీమాంధ్రలో పర్యటిస్తూ ప్యాకేజీ కాంగ్రెస్ గొప్పతనంగా చెప్పుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బండారు దత్తాత్రేయ వ్యక్తిగత సమాచారంతో రూపొందించిన ప్రత్యేక వెబ్‌సెట్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. లోక్‌సభలో బిల్లుపై చర్చ పూర్తయిన తర్వాత రాజ్యసభలో ఈ అంశాలపై బీజేపీ పట్టుబట్టిన తరువాతనే కాంగ్రెస్ ప్యాకేజీ ఇవ్వడానికి ముందుకొచ్చిందని విడమరచి చెప్పారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ‘హూ ఈజ్ కిరణ్’ అంటూ జైరాం చేసిన వ్యాఖ్యలను వెంకయ్య తప్పుపట్టారు. జూన్ తరువాత సోనియా గాంధీని కూడా ‘హూ ఈజ్ సోనియా’అంటారేమోనని ఎద్దేవా చేశారు.
తెలుగు ప్రజలంటే కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిన్న చూపని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి తెలుగువారికి దక్కే అవకాశం ఉన్నప్పటికీ, వేరే రాష్ట్రం అధికారికి పొడిగింపు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను సీమాంధ్రలో కలపడంపై అడిగిన ప్రశ్నకు.. ‘విభజన జరుగుతున్నప్పడు సమస్యలు వస్తాయని, చర్చించుకొని పరిష్కరించుకోవాలి’ అని బదులిచ్చారు. పొత్తు కోసం టీఆర్‌ఎస్‌ను సంప్రదించే అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు ఆ పార్టీ ఎంఐఎం, సీపీఐలతో పొత్తుకు ప్రయత్నిస్తోందన్న వార్తలు వచ్చాయన్నారు.