గందరగోళంలో టీడీపీ | Selection of candidates for the chairman of the Group Fights | Sakshi
Sakshi News home page

గందరగోళంలో టీడీపీ

Published Sun, Mar 16 2014 5:13 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM

Selection of candidates for the chairman of the Group Fights

  •      చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో గ్రూప్ తగాదాలు
  •      తేలని టీడీపీ చైర్మన్ అభ్యర్థి
  •      పలమనేరులో కాంగ్రెస్ నుంచి వచ్చినవారితో పోటీ!
  •      పుంగనూరులో రెండు వర్గాల వైరం
  •      మదనపల్లెలోనూ ఇదే తంతు
  •      జిల్లా నాయకులకు దిశా నిర్దేశం చేయని చంద్రబాబు
  •  సాక్షి, చిత్తూరు: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులు ఎవరనేది తేల్చుకోలేక టీడీపీ సతమతమవుతోంది. అభ్యర్థులు ఎవరికి వారు టీడీపీ పేరుతో నామినేషన్లు వేశారు. వీరిలో ఎందరికి పార్టీ బీ-ఫారం వస్తుందో తేలాల్సి ఉంది. ప్రతి మున్సిపాలిటీల్లో ఏడెనిమిది మంది టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తానంటే తానని ప్రచారం చేసుకుంటున్నారు. మున్సిపాలిటీల వారీగా చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లూ ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అడిగివారికి మీరే చైర్మన్ అభ్యర్థి గెలుచుకుని రండి చూద్దామంటున్నారు. దీంతో ఆరు మున్సిపాలిటీల్లో ఎవరికివారు చైర్మన్ అభ్యర్థిత్వం కోసం గ్రూప్‌లుగా ఏర్పడి పైరవీలు చేస్తున్నారు.
     
    పుంగనూరులో వైఎస్‌ఆర్‌సీపీ ముందంజ

     
    పుంగనూరులో చైర్మన్ పదవిని మైనారిటీలకే ఇస్తామని ప్రకటించి వైఎస్‌ఆర్‌సీపీ ముందంజలో ఉంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముస్లింలకు చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించి ఆ దిశగా ముందుకెళుతున్నారు. అదే సమయంలో ఇక్కడ టీడీపీ నియోజకవర్గ నాయకులుగా ఇద్దరు ఉన్నారు. ఎవరి గ్రూప్ వారిదే అన్నట్లు సాగుతున్నారు. టీడీపీ నేత వెంకటరమణరాజు చైర్మన్ అభ్యర్థిత్వానికి కొన్నిపేర్లు సూచిస్తున్నారు. మరో నాయకుడు శ్రీనాథరెడ్డి వర్గం కొన్ని పేర్లు సూచిస్తోంది. టీడీపీ తరఫున ఫలానా సామాజికవర్గానికి లేదా ఫలానా వ్యక్తికి చైర్మన్ పదవి ఇస్తామని ప్రకటించలేని దుస్థితి నెలకొంది.
     
    శ్రీకాళహస్తిలో..
     
    శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో వైఎస్‌ఆర్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జనరల్‌సీటులో బీసీ నాయకుడు మిద్దెల హరిని ప్రకటించారు. అదే స్ఫూర్తితో ఎన్నికలకు పార్టీ దూసుకెళుతోంది. మరోవైపు టీడీపీ చైర్మన్ అభ్యర్థి తేలడం లేదు. టీడీపీ నుంచి గురవయ్యనాయుడు, రాధారెడ్డి పోటీపడుతున్నారు. ఇంకా ఒకరిద్దరు కొత్తగా రాజకీయాల్లోకి దిగినవారు ఆశలు పెట్టుకున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికనేది ఎమ్మెల్యే  గోపాలకృష్ణారెడ్డి చెప్పలేదు. కాంగ్రెస్ కూడా ప్రకటించలేదు.
     
    మదనపల్లెలో..
     
    మదనపల్లెలోని 35 వార్డులకు అధికంగానే నామినేషన్లు టీడీపీ తరఫున దాఖలయ్యాయి. ఇంతవరకు చైర్మన్ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటించలేని స్థితి. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఒకరు చైర్మన్ పదవి ఆశిస్తున్నా గ్రీన్‌సిగ్నల్ రాలేదు. అలాగే టీడీపీకి చెందిన బీసీ నేత చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. చంద్రబాబు నోటి వెంట నువ్వే మా చైర్మన్ అభ్యర్థివి అన్న మాటరాలేదని వాపోతున్నారు. బీసీ సామాజిక వర్గానికి రిజర్‌‌వ అయిన ఈ పదవి కోసం మరో ఆరేడుగురు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
     
    పలమనేరులో..

     
    పలమనేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి, గతం నుంచి టీడీపీలో ఉన్నవారికి చైర్మన్ అభ్యర్థి ఎంపికలో గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయి. గల్లా అరుణకుమారి ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆమెతో సన్నిహిత సంబంధాలు ఉండి టీడీపీలోకి వచ్చినవారు తమకే చైర్మన్ గిరి అన్న ఆశతో ఉన్నారు. సీటు జనరల్ మహిళ కావడంతో ఏడెనిమిది మంది చైర్మన్ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి ఎక్కడ ప్రాధాన్యం ఇస్తారోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొంది. అలాగే జిల్లా నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయడం లేదు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement