
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రానికి చెందిన మాజీ ఎన్నికల ప్రధానాధికారి, సీనియర్ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి జాతీయస్థాయి పురస్కారం లభించింది. రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గానూ ఉత్తమ ఎన్నికల నిర్వహణ కేటగిరిలో ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని జొరావర్ ఆడిటోరియంలో శనివారం జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదిగా ఉత్తమ ఎలక్షన్ సిఈవో అవార్డును అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా... స్వేచ్ఛాయుతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల యంత్రాంగాన్ని గోపాలకృష్ణ ద్వివేది నడిపించారు. ప్రజాస్వామికంగా ఎన్నికల కమిషన్ నిబంధనలను పకడ్భందీగా అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల ప్రధాన అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది తీసుకున్న నిర్ణయాలు, అయన అనుసరించిన విధానాలకు గానూ జాతీయస్థాయిలో ఈ పురస్కారం లభించింది. ప్రస్తుతం గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ఈ పురస్కారాన్ని అందుకున్న గోపాలకృష్ణ ద్వివేదికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment