‘సాక్షి’ కథనంపై సీఈవో వివరణ
3 నెలల బకాయిలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ పథకం కింద వడ్డీ బకాయిలు ఉన్నమాట వాస్తవమేనని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అంగీకరించింది. మూడు నెలల బకాయిలను నాలుగు రోజుల్లో మహిళా సంఘాల ఖాతాలకు నేరుగా జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ‘సెర్ప్’ అదనపు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎ.మురళి బుధవారం ఒక ప్రకటనలో వివరించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు నెలల కోసం రూ.299 కోట్లు మహిళా సంఘాలకు చెల్లించినట్లు తెలిపారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు రూ.307 కోట్లు దాదాపు 6.94 లక్షల మహిళా సంఘాలకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే అక్టోబర్ నెలకు సంబంధించిన వడ్డీ విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. వడ్డీని మహిళా సంఘాలకు చెల్లించడానికి అవసరమైన నిధులను గ్రీన్‌ఛానెల్‌లో పెట్టామని, వచ్చే అర్ధసంవత్సరానికి చెల్లించే దాదాపు రూ.720 కోట్ల వడ్డీ మొత్తాన్ని కూడా ముందుగానే చెల్లించాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు మురళి తెలిపారు.
స్త్రీనిధి రుణాలపై వడ్డీ మాటేమిటీ..?: స్త్రీనిధి పథకం కింద ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటుచేసి మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నారు. వీటిని సైతం ప్రభుత్వం వడ్డీలేని రుణాల జాబితాలో చేర్చించి. కానీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఈ పథకం కింద కూడా వడ్డీని ప్రభుత్వం చెల్లించలేదు. ఇది సంస్థపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోందని ఇటీవల జరిగిన స్త్రీనిధి సంస్థ బోర్డు డెరైక్టర్ల సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం తీసుకుని తాము మహిళా సంఘాలకు ఇస్తున్నామని, మహిళా సంఘాల నుంచి వడ్డీ వసూలు చేయకుండా కేవలం అసలు మాత్రమే వసూలు చేస్తున్నట్లు డెరైక్టర్లు తెలిపారు. బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీని సంస్థ సొంత నిధుల నుంచి చెల్లించాల్సి రావడం సంస్థ పనితీరుపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అవును బకాయిలున్నాయి: సెర్ప్
Published Thu, Nov 7 2013 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement
Advertisement