పిఠాపురం : ఎప్పుడు వెళ్లేదే కదా ఎలాగైనా వచ్చేస్తారన్న నమ్మకంతో ఇంత హడావిడి జరుగుతున్నా తమ వారి కోసం ఎవరికీ చెప్పకుండా ఉండిపోయారు వారంతా. కానీ అందరూ తిరిగొచ్చారు. వీరి జాడమాత్రం పది రోజులైనా లేకుండా పోయింది. దీంతో ఆందోళన కట్టలు తెంచుకుంది ఆ మత్స్యకార కుటుంబాల్లో. కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు కొత్తపట్నానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంపై చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ నెల 16న కొత్తపట్నానికి చెందిన పట్టా సూర్యారావు ఫైబర్ బోటుపై అతడితో పాటు అదే గ్రామానికి చెందిన చక్కా సూరిబాబు, చక్కా నాగేశ్వరరావు, పట్టా చంద్రరావు, పట్టా ప్రభుదాస్, పాత్రి దావీదు, సూర్యమళ్ల వెంకటరమణ చేపల వేటకు వెళ్లారు.
వీరితో పాటు వెళ్లిన బోట్లన్నీ బుధవారం నాటికి తిరిగొచ్చాయి. వీరి బోటు మాత్రం రాక పోవడంతో మత్స్యకారుల కుటుంబాల వారు ఆందోళనకు గురై మీడియాకు సమాచారం అందించారు. వేటకు వెళ్లిన రోజు ఉదయం 11 గంటల వరకూ సెల్‌ఫోన్ పనిచేసిందని, మత్స్యకారులంతా క్షేమంగా ఉన్నట్టు చెప్పారన్నారు. అప్పటి నుంచి ఫోన్ పనిచేయడం లేదన్నారు. తమవారు తిరిగొస్తారన్న నమ్మకంతో ఉన్నామని, అందుకే ఎవరికీ చెప్పలేదని బాధిత కుటుంబాల వారు చెబుతున్నారు.
బోటులో ఇంజన్ పాడై, తెరచాప సాయంతో వచ్చేందుకు పది రోజులుగా కష్టపడుతున్నారేమోనని భావించామన్నారు. మత్స్యకారుల జాడ లేకపోవడంతో వారికేమైనా ప్రమాదం సంభవించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెల్‌ఫోన్ చార్జింగ్ అయిపోయి ఉండవచ్చని, అవి పనిచేయకపోవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. బోటు యజమాని సహా వీరంతా మూడు కుటుంబాలకు చెందిన వారే.
ఏడుగురు మత్స్యకారుల గల్లంతు
Published Thu, Jun 25 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM
Advertisement