ఏడుగుర్ని బలిగొన్న అతి వేగం
ఏలూరు (వన్ టౌన్) : పది నిముషాలలో గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన వారిని మృత్యువు కబళించింది. ఏలూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు కాగా, మరొకరు కారు డ్రైవర్. ఆగివున్న లారీని వెనుక నుంచి టవేరా కారు అతి వేగంతో ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు ముందు భాగం లారీ వెనుక భాగంలోకి చొచ్చుకుపోయింది. మృతదేహాలు బయటకు తీయడానికి కూడా వీలులేనంతగా వాహనంలో ఇరుక్కుని ఛిద్రమైపోయాయి. మొహాలు గుర్తు పట్టలేనంతగా గాయాలయ్యూరుు. హృదయ విదారకమైన ఈ ఘటన ఏలూరు ఆశ్రం కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో టవేరా కారు డ్రైవర్ రమణ, అందులో ప్రయూణిస్తున్న మహిళలు పల్లిశెట్టి రాజ్యం, అప్పల భారతీరత్నం, కుప్పం లక్ష్మి, పైడిమర్రి నాగరత్నం, పాలడుగు కస్తూరిబాయ్, వంకినేని విజయలక్ష్మి మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన అనూరాధ, కె.సీతామహాలక్ష్మి, రత్నకుమారిలను చికిత్స నిమిత్తం తొలుత ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు, విజయవాడ ఆసుపత్రులకు తీసుకెళ్లారు.
అంతా ఏలూరు వారే
ఏలూరు దక్షిణపు వీధికి చెందిన 9 మంది మహిళలు శ్రీ వెంకటేశ్వర గానామృతం భక్త బృందం పేరిట చుట్టుపక్కల నాలుగు జిల్లాలలో ఎక్కడ వెంకటేశ్వర స్వామి కల్యాణాలు జరిగినా వెళ్లి భజనలు చేసి వస్తుంటారు. శనివారం ఉదయం టవేరా కారులో రావులపాలెంలో జరిగిన వెంకటేశ్వరస్వామి కల్యాణానికి హాజరై తిరిగి ఏలూరు వస్తుండగా రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదానికి గురయ్యూరు. జాతీయ రహదారిపై లారీ ఆపిన డ్రైవర్ సిగ్నల్స్ కూడా వేయకుండా లారీ వెనుక రెండువైపులా మట్టలు తగిలించి ఉంచాడు. వెనుక వస్తున్న టవేరా వాహనం డ్రైవర్ లారీ రన్నింగ్‌లో ఉందనుకుని వేగంగా వచ్చేశాడు. లారీ ఆగివున్న విషయం గ్రహించి కారును అదుపు చేసేలోపే ప్రమాదం జరిగిపోయింది. ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు విధులకు హాజరై ఏలూరు వస్తున్న డీఎస్పీ కెజీవీ సరిత ఈ ఘటన చూసి తక్షణమే స్పందించారు. కొన ఊపిరితో ఉన్న ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు.