మళ్లీ కన్సల్టెన్సీల రాజ్యం | seven special machines for andhra pradesh development | Sakshi
Sakshi News home page

మళ్లీ కన్సల్టెన్సీల రాజ్యం!

Published Mon, Jul 28 2014 1:57 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

మళ్లీ కన్సల్టెన్సీల రాజ్యం - Sakshi

మళ్లీ కన్సల్టెన్సీల రాజ్యం

* ఏపీలో రాష్ట్రాభివృద్ధి పేరిట ఏడు మిషన్లు
* ప్రతి మిషన్‌కు ఓ అంతర్జాతీయ కన్సల్టెన్సీ
* లక్షలాది రూపాయల వ్యయూనికి సర్కారు సిద్ధం
* ఇకపై ప్రతిదీ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలోనే..

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఏడు ప్రత్యేక మిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. వాటికి సలహాలిచ్చేందుకు అంతర్జాతీయ కన్సల్టెన్సీలను నియమించనుంది. ఏడు ప్రధాన రంగాలకు చెందిన ఈ మిషన్లను సంబంధిత రంగానికి చెందిన అధికారిని కన్వీనర్‌గా నియమించింది. ప్రాథమిక రంగాల మిషన్‌కు సాగు నీటి శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పట్టణ మిషన్‌కు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, నైపుణ్య అభివృద్ధి మిషన్‌కు కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి, మౌలిక వసతుల కల్పన మిషన్‌కు ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని కన్వీనర్‌లుగా సర్కారు నియమించింది.
 
తయూరీ రంగ మిషన్‌కు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, సేవా రంగ మిషన్‌కు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సంక్షేమ మిషన్‌కు గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. ప్రతి మిషన్‌కు ప్రత్యేకంగా అంతర్జాతీయ కన్సల్టెన్సీలను నియమించనున్నారు. గతంలోనూ చంద్రబాబు పాలనలో అంతర్జాతీయ కన్సల్టెన్సీలకు ప్రాధాన్యమిచ్చి, వాటికి కోట్లాది రూపాయలు వెచ్చించారు. గతంలో విజన్-2020 డాక్యుమెంట్ కోసం మెకెన్సీ సంస్థను నియమించి లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు.
 
అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటోంది. నూతన రాజధాని నిర్మాణానికి విరాళాలు సేకరిస్తోంది. ఈ పరిస్థితుల్లో కూడా సమర్థులైన అధికారులను పక్కనపెట్టి, విదేశీ సంస్థలను కన్సల్టెన్సీలుగా నియమించడం, పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికి సిద్ధపడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక  నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే పనులన్నీ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తోనే కొనసాగాలని, ఇటీవలి ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అలాగైతేనే లక్ష్యాలను సాధించగలమని పేర్కొన్నారు.
 
అభివృద్ధి పర్యవేక్షణకు సూచీలు

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పర్యవేక్షణకు 40 మెగా సూచీలను నిర్ధారించారు. ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ప్రతి శాఖకు నాలుగైదు ప్రధాన అభివృద్ధి సూచీలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా పైస్థాయి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు పనితీరు (ఫెర్‌ఫార్మన్స్) లక్ష్యాలను నిర్ధారించనున్నట్లు చెప్పారు. ఈ లక్ష్యాల మేరకు పనిచేసి, వారు సాధించిన ఫలితాల ఆధారంగా ఉద్యోగుల పనితీరును నిర్ధారించనున్నారు. ఆర్ధిక, మానవ వనరులను మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవడానికి ఇలాంటి సూచీలు, లక్ష్యాలు దోహదపడతాయనేది చంద్రబాబు ఆలోచన అని అధికారవర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement