అతిసారం బారినపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రోగులు(నిన్నటి ఫొటో)
సాక్షి, గుంటూరు : పాలకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసిన కలుషిత నీటితో గుంటూరు నగరంలో అతిసారం ప్రబలింది. వ్యాధి బారినపడి ఇప్పటిదాకా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికిపైగా ఆస్పత్రుల్లో చేరారు. చికిత్స పొందుతున్నవారిలో ఐదారుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అతిసార విజృంభణతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు.
మెడికల్ ఎమర్జెన్సీ : అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల వల్లే మంచినీరు కలుషితమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో బుధ, గురువారాల్లో నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్)లో మెడికల్ ఎమర్జన్సీ ప్రకటించినట్లు ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. చనిపోయినవారి పేర్లను ఫాతిమూన్, బీబీజాన్, సబీనా, గోపీ, వెంకట్రావు, పద్మావతి, బాలకోటిరెడ్డి, సామ్రాజ్యంలుగా అధికారులు పేర్కొన్నారు.
మంత్రుల నిలదీత : అతిసార బాధితులను పరామర్శించేందుకు జీజీహెచ్‌కు వచ్చిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, మేకా ఆనందబాబులకు చుక్కెదురైంది. జనం ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడంలేదంటూ మంత్రులపై మండిపడ్డ జనం.. ఆస్పత్రి ప్రధాన ధ్వారం వద్ద బైఠాయింపునకు దిగారు. వైఎస్సార్‌సీపీ నేతలు అప్పిరెడ్డి, గులామ్, రసైల్‌లు ఆందోళనకు నేతృత్వం వహించారు. మంత్రుల రాక సందర్భంగా జీజీహెచ్ వద్ద భారీగా పోలీసులను మోహరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment