సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఆందోళనలు వాడవాడలా ఉధృతంగా కొనసాగుతున్నాయి. ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లమీదికి వచ్చి తమ నిరసనలు తెలియజేస్తుండటంతో సమైక్యగర్జన గట్టిగా వినిపిస్తోంది. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అన్ని కుల సంఘాలు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ర్యాలీలు, మానవహారాలు, వినూత్నరీతిలో ప్రదర్శనలు చేస్తూ సమైక్య నినాదాలను హోరెత్తిస్తున్నారు.
కడప పట్టణంలో మున్సిపల్ కార్మికులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యుత్ కార్మికులు, డీఆర్‌డీఏ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, న్యాయశాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు భూపేష్‌రెడ్డి, అఫ్జల్‌ఖాన్, నరసింహారెడ్డిల దీక్షలను ఆదివారం పోలీసులు భగ్నం చేశారు. రిమ్స్‌లో వీరి దీక్షలను జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి,ముద్దనూరు మాజీ జెడ్పీటీసీ శివనాథరెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో వికలాంగులు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
జమ్మలమడుగులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఎస్‌ఎస్‌ఆర్ కోచింగ్ సెంటర్ వారు ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థులకు టెట్ పరీక్షలు రోడ్డుపైనే నిర్వహించారు. న్యాయవాదులు, ఆటో కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వీరికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. ఎర్రగుంట్లలో తొగట వీర క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ ఉపాధ్యాయులు, కవులు, రచయితలు ప్రొద్దుటూరు పట్టణంలో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘ నాయకులు పేరి గురుస్వామి సమైక్యాంద్ర కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు గాయత్రి మంత్రం జపించారు. న్యాయవాదులు, వైద్యులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. డ్రైవర్ కొట్టాలు ప్రజలు పెయింటర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి సోనియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైఎస్సార్ సీపీ నేతృత్వంలో మూడవ వార్డు మహిళలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
పులివెందులలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వీఎన్‌సీ క్లబ్, సరస్వతీ లిటరసీ ఆర్గనైజేషన్ క్లబ్, మెడికల్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఎన్జీఓల ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి.
రాయచోటి పట్టణంలో జేఏసీ, న్యాయవాదుల రిలే దీక్షలు సాగుతున్నాయి. వీరికి స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
రైల్వేకోడూరు పట్టణంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో టోల్‌గేట్ సమీపంలో ప్రజలు బైఠాయించారు. దీంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి.
రాజంపేట పట్టణంలో విద్యార్థి జేఏసీ నాయకులు విష్ణువర్దన్ నాయక్ చేపట్టిన ఆమరణ దీక్షలు రెండవరోజుకు చేరుకున్నాయి.
ఈ దీక్షలకు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, పసుపులేటి బ్రహ్మయ్యతోపాటు న్యాయవాద జేఏసీ నాయకులు శరత్‌కుమార్‌రాజు, లక్ష్మినారాయణ, ఉద్యోగ జేఏసీ నాయకులు ఎస్వీ రమణ, సుబ్బన్న సంఘీభావం తెలిపారు. బద్వేలులో ఉపాధ్యాయులు వినూత్నంగా రోడ్లను ఊడ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజకీయ నాయకులు రాజీనామాలు ఇవ్వకుంటే వారిని ఇలాగే ఊడ్చేస్తామంటూ నినాదాలు చేస్తూ రోడ్లు ఊడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్యవైశ్యులు పట్టణంలో భిక్షాటన చేశారు. అనంతరం రిలే దీక్షల్లో కూర్చొన్నారు. మైదుకూరులో ఎల్‌ఐసీ ఏజెంట్లు, క్యాథలిక్ క్రిస్టియన్లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి టీడీపీ నేత సుధాకర్ యాదవ్ సంఘీభావం తెలిపారు.
సమైక్య గళం
Published Mon, Sep 2 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement
Advertisement