
చిగురుటాకులా వణికిన శ్రీకాకుళం జిల్లా
పై-లీన్ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఎర్రనీళ్లనే పట్టుకుని వాటినే తాగాల్సి వస్తోంది. అధికారులు గానీ, నాయకులు గానీ ఎవ్వరూ తమ వద్దకు రాలేదని, ఎవరికైనా అనారోగ్యం వచ్చినా రోడ్డుమీదకు తీసుకురావడానికి కూడా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు అంటున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు అందించాలని కవిటి, కంచిలి, మందస, ఇచ్ఛాపురం, సోంపేట మండలాల ప్రజలు కోరుతున్నారు.
ఎక్కడికక్కడ సెల్ఫోన్ టవర్లు పడిపోవడంతో కమ్యూనికేషన్ల వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయ్యింది. ఇక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే, ఈ ప్రాంతం మళ్లీ కోలుకోడానికి కనీసం రెండు రోజులు పట్టేలా ఉందని ప్రజలు అంటున్నారు. రోడ్ల మీద పడిపోయిన చెట్లను తొలగించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని, చెట్లు పెద్దవి కావడంతో గొడ్డళ్లతో నరకడం కూడా సాధ్యం కావట్లేదు. మీడియా వాహనాలను కూడా అవతల పెట్టుకుని, ఇవతలకు కాలి నడకనే రావాల్సి వస్తోంది. మంచి రేటు వస్తుందని కొబ్బరి రైతు ఆశిస్తున్న సమయంలో దాదాపు 25 వేల ఎకరాల్లో కొబ్బరి పంట నేలకొరిగింది. అరటితోటలు అసలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి.