
వలలో పడుతున్నారు...
ఇంటర్‘నెట్’లో యువత చిక్కుకుని విలవిలలాడుతోంది. నట్టింటిలోకి దూసుకొస్తున్న ఈ సాంకేతిక మాయాజాలం కుర్రాళ్లపై విషపు వలను విసురుతోంది. ఫలితంగా యువత పెడదారిన పడుతున్నారు. జిల్లాలో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనల్లో మైనర్లే నిందితులుగా ఉండడం దిగ్భ్రాంతికరమైన విషయం. యువత దారి మారుతున్న వైనంపై కథనం.
నీతి కథలు చెప్పే అమ్మమ్మ, తాతయ్యలు చాలా మందికి దూరమయ్యారు... మంచి మాటలు చెప్పే బంధువులు ఇంకా చాలా మందికి కనిపించకుండాపోయారు. ఇప్పటి బాల్యానికి నేస్తాలు టీవీలు, సెల్‌ఫోన్లే. కాలక్షేపానికి ఉన్నది ఇంటర్‘నెట్’ ఒక్కటే. ఎనిమిదో తరగతికే చేతిలో సెల్‌ఫోన్, పదో తరగతికి పార్టీల అలవాటు, ఇంటర్‌కు గర్ల్‌ఫ్రెండ్స్... ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. పర్యవేక్షణ లేని ఇళ్లు, కట్టుబాట్లు లేని కాలేజీలు, స్కూళ్లు కలిపి యువత దారిని మార్చేస్తున్నాయి.
దీనికి తోడు పెరుగుతున్న సాంకేతికత అభివృద్ధికి ఎంతగా దోహదపడుతోందో తెలీదు గానీ యువతపై చెడు ప్రభావాన్ని చూపడంలో మాత్రం నూటికి రెండొందలు శాతం పనిచేస్తోంది. నట్టింట్లోకి వచ్చిన నెట్ మాయాజాలం. మైనర్ల కళ్లకు ‘నీలి’ గంతలు కట్టి ఆడిస్తోంది. బాలికలపై లైంగికదాడులు పెరుగుతున్న నేపథ్యంలో యువత దారిని తల్లిదండ్రులు పర్యవేక్షించాల్సిన సమయం వచ్చింది. కుర్రాళ్ల కదలికలపై గురువులు కన్నెయ్యాల్సిన సందర్భం ఆసన్నమైంది. జిల్లాలోనూ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఈ కేసుల్లో పలు సందర్భాల్లో మైనర్లే నిందితులుగా ఉండడం జిల్లాలోని పరిస్థితికి అద్దం పడుతోంది.
విజయనగరం ఫోర్ట్, విజయనగరం క్రైం: బాలికలపై లైంగిక దాడి... చదవడానికే అదోలా అనిపిస్తుంది. కానీ మన చుట్టుపక్కలే అభంశుభం తెలీని చిన్నారులు చాలా మంది మృగాళ్ల విపరీత కోరికలకు బలైపోతున్నారు. ప్రమాదం జరిగితే గానీ స్పందించని అధికారులు, ఆందోళనలు చేస్తే గానీ పట్టించుకోని నాయకుల మధ్య వీరి భద్రత ప్రశ్నార్థకమైపోతోంది. దీనికి కారణాలు వెతికితే కొన్ని చూపుడు వేళ్లు మనవైపు కూడా చూపిస్తాయి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రతి వ్యక్తికీ అందుబాటులో ఉంటున్న ఇంటర్నెట్ సదుపాయం, పర్యవేక్షణ లేని పెంపకాలు... ఇలా చాలా కారణాలు చిన్నారి బతుకులను నిప్పులపాలు చేస్తున్నాయి.
మైనర్లే బాలికలపై ఎక్కువగా లైంగికదాడులకు పాల్పడుతుండడం దీనికి ఉదాహరణగా కనిపిస్తోంది. ఇప్పటి రోజుల్లో తినడానికి తిండి లేకపోయినా ప్రతి ఇంటిలోను సెల్‌ఫోన్ ఉంది. అరచేతిలో నీలిచిత్రాలను చూడగలిగే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ఇది యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎలిమెంటరీ, హైస్కూల్ పిల్లలు కూడా సెల్‌ఫోన్లను వాడేస్తున్నారు. దీనికి తోడు ఇంటి వద్ద తగు పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు పార్టీల పేరిట మద్యానికీ అలవాటు పడుతున్నారు.
అసలు కారణాలేంటి..?
- చిన్నపిల్లలపై లైంగిక దాడికి పాల్పడే అపసవ్య మనస్తత్వాన్ని సైకాలజీలో పెడోఫిలియా అంటారు
- ఇలా లైంగికదాడికి గురైన వారికి గాయాలు లేకపోయినా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు
- తమ లైంగిక సామర్థ్యంపై విశ్వాసం లేని వారు కూడా చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతారు
- టీవీ, ఫేస్‌బుక్, ఇంటర్‌నెట్, చెడుప్రవర్తన కలి గిన వ్యక్తులతో తిరగడమూ ఓ కారణమే.
ఇవీ కేసులు...
- 2015 జవవరి 8న భోగాపురం మండలం చేపల కంచేరు గ్రామంలో ఏడేళ్ల బాలికపై లైంగికదాడి జరిగింది.
- జూన్ 26న విజయనగరం మండలం అయ్యన్నపేటలో 15 ఏళ్ల బాలికపై లైంగికదాడి జరిగింది.
- జూలై 23న నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామంలో 14 ఏళ్ల బాలికపై లైంగికదాడి జరిగింది.
- దుప్పాడ గ్రామంలో మూడేళ్ల చిన్నారిపై యువకుడు లైంగిక దాడి చేయడంతో బాధితులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
- ధర్మపురి గ్రామంలో ఓ కామాంధుడు ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి నీళ్లకుండిలో పడేసి హత్య చేశాడు.
- దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లిలో మూడున్నరేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలలు లైంగిక దాడికి పాల్పడ్డారు.
సినిమాల ప్రభావమూ ఉంది
సినిమాల ప్రభావం అధికంగా విద్యార్థులపై పడుతోంది. సినిమాలో చూసినవి అక్కడతో మర్చిపోవాలన్న విషయాన్ని ముందు తల్లితండ్రులు అవగాహన కల్పించాలి. పాఠశాలల్లో ఆడపిల్లలను గౌరవించాలని, మర్యాదగా నడుచుకోవాలని వారే చెప్పాలి.
- డి.అరుణ, ఉపాధ్యాయురాలు, విజయనగరం
నీలి చిత్రాలు నిషేధించాల్సిందే...
చదువుకోవాల్సిన పిల్లలు నీలి చిత్రాలు చూసి పాడైపోతున్నారు. ఆడా మగా విచ్చలవిడిగా తిరగకూడదనే విషయాన్ని తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు. మగ పిల్లలు బయట మర్యాదపూర్వకంగా నడుచకోవాలన్న విషయాన్ని తల్లిదండ్రులు చెప్పడం లేదు. నేరం చేసినా శిక్షలు ఆలస్యం కావడం వల్ల ఏమీ కాదనే భావన నెలకొంది. తప్పు చేసిన 10 రోజుల్లో శిక్ష పడితే ఇలాంటి సంఘటనలు జరగవు.
- పట్నాల భవాని, స్పార్క్ సొసైటీ అధ్యక్షరాలు, విజయనగరం
కౌన్సెలింగ్ అందించాలి
లైంగికదాడికి పాల్పడే వారి లక్షణాలను గుర్తించి కౌన్సెలింగ్ అందించాలి. లైంగిక సామర్థ్యంపై విశ్వాసం లేనివారు పిల్లలపై అత్యాచారాలకు ఒడిగడతారు. ముందుగా దగ్గరి బంధువులకు సంబంధించిన పిల్లల అవయవాలు తాకడం ద్వారా ఈ ప్రక్రియ మొదలై తర్వాత అపరిచిత బాలికల అవయవాలకు తాకాలనే కోరికలు పుడతాయి. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి
- ఎస్‌వీ రమణ, సైకాలజిస్ట్
నైతిక విలువలు పెంచాలి...
సెల్‌ఫోన్‌లో చాటింగ్‌లు, మేసేజ్‌లు విద్యార్థులపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. నైతిక విలువలు పెంపొందించాల్సి ఉంది. సెల్‌ఫోన్ నిత్య వాడకంగా మారింది. మంచి, చెడులు గురించి తల్లిదండ్రులు తెలియజేయాలి
- జీకే దుర్గ, చైల్డ్‌లైన్ కౌన్సిలర్
తరగతులు నిర్వహించాలి...
నైతిక విలువల గురించి పిల్లలకు శిక్ష ణ ఇప్పించాలి. ఏదో మంచి, ఏది చెడు అన్న విషయాలను తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలియజేయాలి. సెల్‌ఫోన్‌లు సాధ్యమైనంతవరకు పిల్లలకు ఇవ్వకూడదు.
- గంటా హైమావతి,
బాలల సంక్షేమ కమిటీ సభ్యురాలు కఠిన చర్యలు తీసుకుంటాం
లైంగికదాడులకు పాల్పడటం నేరం. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. యువత, విద్యార్థులు చెడు ప్రవర్తలు, అత్యాచారాలు తదితర నేరాలకు పాల్పడకుండా పోలీసు స్టేషన్ల వారీగా అవగాహన సదస్సుల నిర్వహిస్తున్నాం
- టి.త్రినాథ్, ఎస్‌బీ డీఎస్పీ
జిల్లాలో గత మూడేళ్లలో నమోదైన లైంగికదాడి కేసుల వివరాలు..
సంవత్సరం కేసులు
2012 19
2013 27
2014 25