రాజ్‌నాథ్‌ను కలిసిన శైలేష్ | Shailesh Meets Rajnath | Sakshi
Sakshi News home page

రాజ్‌నాథ్‌ను కలిసిన శైలేష్

Published Sun, Feb 9 2014 1:49 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Shailesh Meets Rajnath

 పరిగి, న్యూస్‌లైన్:  సీనియర్ జర్నలిస్ట్, జీ24 గంటలు టీవీ చానల్ మాజీ సీఈఓ శైలేష్‌రెడ్డి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు పార్టీ కండువా వేసి అభినందించారు. ఆదివారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి చేతుల మీదుగా శైలేష్‌రెడ్డి పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని శైలేష్‌రెడ్డియే స్వయంగా వెల్లడించారు.

  నేడు అధికారికంగా చేరిక..
 సీనియర్ జర్నలిస్ట్, జీ 24 అవర్స్ న్యూస్ చానల్ మాజీ సీఈఓ శైలేష్‌రెడ్డి ఆదివారం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.  ఇప్పటికే  ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానంతో ఆయన సంప్రదింపులు  జరిపారు. బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన నేపథ్యంలో ఆ పార్టీలో చేరటం లాంఛనమే కానుంది. శైలేష్‌రెడ్డి చేవెళ్ల  పార్లమెంట్ స్థానం నుంచి గాని, పరిగి అసెంబ్లీ స్థానం నుంచి గాని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో పరిగి నియోజకవర్గం బీజేపీ నాయకులతోనూ కొంత కాలంగా ఆయన సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. తనకు సన్నిహితులైన ఇతర పార్టీల నాయకులతోనూ ఇప్పటికే ఈ విషయమై ఆయన చర్చించినట్లు సమాచారం. పార్టీలో చేరనున్న నేపథ్యంలోనే ఆయన గత కొంతకాలంగా పరిగి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో  క్రీయశీలకంగా వ్యవహరిరిస్తూ, బీజేపీ నాయకులతో తరచూ సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు.

 స్థానికుడు కావటం కలిసొచ్చే అంశం..!
 శైలేష్‌రెడ్డిది పరిగి నియోజకవర్గంలోని గండేడ్ మండలం జూలపల్లి గ్రామం. స్థానికుడు కావటం ఆయనకు కలిసొచ్చే అంశం కానుంది.  నియోజకవర్గంలో అతను స్థానికుడు కావటంతో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాకుండా పరిగి అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేసేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు నియోజకవర్గంలో పరిచయాలు ఉండటం, ఇటీవల తెలంగాణ విషయంలో బీజేపీ అనుసరించిన విధానాలు సైతం ఆయనకు సానుకూలంగా మారనున్నాయని ఆయన ఆశిస్తున్నారు.

 అయితే రెండు మూడు దఫాలుగా పరిగి తాలుకా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్, నియోజకవర్గానికి చెందిన మరో బీసీ నాయకుడు సైతం ఈసారి  టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో వారిని ఒప్పించుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement