Shailesh Reddy
-
ఎస్ఎస్సీ పోటీ పరీక్షల సన్నద్ధతకై
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి వారం రోజులపాటు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఉద్యోగ పోటీ పరీక్షలు జరగనున్నాయని, దీనికోసం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో టి–శాట్ నెట్వర్క్ చానళ్లు పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నాయని సీఈవో ఆర్.శైలేశ్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జనవరి 25న లైవ్ ప్రసారాలతో ప్రారంభమై 27వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు సాధారణ ప్రసారాలు కొనసాగించాలని నిర్ణయించామని, పోటీ పరీక్షలకు ఈ పాఠ్యాంశాలు ఉపయోగపడతాయని శైలేశ్‌రెడ్డి వివరించారు. 25వ తేదీ ఉదయం 11 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే లైవ్‌లో సబ్జెక్టు, సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని, అభ్యర్థులు తమ సందేహాల కోసం ఫోన్ ద్వారా 040–2354 0326, 2354 0726 టోల్ ఫ్రీ 1800425 4039 నెంబర్లకు కాల్ చేయాలని సీఈవో సూచించారు. జనవరి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 12 వరకు ప్రసారాలుంటాయని వెల్లడించారు.(చదవండి: గిరిజన గురుకుల పరిధిలో లా కాలేజీ) ఓయూ ఎంసీఏ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ: విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన ఎంసీఏ కోర్సు పలు సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. ఎంసీఏ 1వ సెమిస్టర్ బ్యాక్లాగ్, 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షల ఫలితాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీ వెబ్సైట్లో ఫలితాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. -
టీ–శాట్ ద్వారా ఉద్యోగాలకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టిన నేపథ్యంలో ఉద్యోగార్థులకు తమ తోడ్పాటునందించేందుకు టీ–శాట్ మరోసారి సిద్ధమైంది. పోలీసు శాఖ 18,428, పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసే 2,786 ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ప్రసారాలను అందించాలని నిర్ణయించింది. టీ–శాట్ నెట్వర్క్ చానళ్లు పోలీసు – పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ గైడ్ పేరుతో చేయనున్న అవగాహన ప్రసారాలకు సంబంధించి సీఈవో శైలేష్‌రెడ్డి ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. జూన్ 11న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాస్‌రావు ద్వారా ప్రత్యక్ష ప్రసారంతో ప్రారంభమవుతాయన్నారు. రెండు నెలలు, సుమారు 400 గంటలు, 15 సబ్జెక్టుల్లో ప్రసారాలను అందించనుండగా, అవగాహన ప్రసారాలు టీశాట్ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతిరోజు ఏడు గంటలపాటు జరిగే ప్రసారాలు ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్సైన్స్తోపాటు మరో 11 సబ్జెక్టుల్లో సుమారు 60 రోజులు, 400 గంటలు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అందించనున్నామని సీఈవో తెలిపారు. ప్రసారాలను పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీశాట్ టీవీకి సంబంధించి www.facebook.com/tsatnetwork, www.youtube. com, www.twitter.com/ tsatnetwork, వెబ్సైట్ www.softnet. telangana.gov.in/, టీశాట్ యాప్ www.tsat.tv లలో ప్రసారాలను వీక్షించవచ్చని తెలిపారు. -
14 నుంచి టీ–శాట్ చానళ్లలో ‘ఇంగ్లిష్ ఫర్ ఆల్’
సాక్షి, హైదరాబాద్: వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం టీ–శాట్ చానళ్లలో ప్రత్యేకంగా ఆంగ్లబోధన పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్లు టీ–శాట్ సీఈఓ ఆర్.శైలేశ్‌రెడ్డి వెల్లడించారు. రామకృష్ణ మఠం సౌజన్యం తో ‘ఇంగ్లిష్ ఫర్ ఆల్’కార్యక్రమాన్ని ఈ నెల 14 నుంచి ప్రతి ఆదివారం నిపుణ, విద్య చానళ్లలో ప్రసారం చేయనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు నిపుణ చానల్లో, సాయంత్రం 4గంటలకు విద్య చానల్లో 45 నిమిషాల పాటు కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీఆర్టీ ప్రసారాలు మరో 3 గంటలు.. టీ–శాట్ నెట్వర్క్ చానళ్లలో ప్రసారం చేస్తున్న టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) అవగాహన ప్రసారాలను ఈ నెల 12 నుంచి మరో 3 గంటలు అదనంగా ప్రసారం చేయనున్నట్లు శైలేశ్‌రెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులున్న నేపథ్యంలో 5 రోజుల పాటు ప్రసారాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. నిపుణ చానల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4గంటల వరకు, విద్య చానల్లో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఈ అదనపు ప్రసారాలుంటాయని పేర్కొన్నారు. -
రాజ్‌నాథ్‌ను కలిసిన శైలేష్
పరిగి, న్యూస్‌లైన్: సీనియర్ జర్నలిస్ట్, జీ24 గంటలు టీవీ చానల్ మాజీ సీఈఓ శైలేష్‌రెడ్డి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు పార్టీ కండువా వేసి అభినందించారు. ఆదివారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి చేతుల మీదుగా శైలేష్‌రెడ్డి పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని శైలేష్రెడ్డియే స్వయంగా వెల్లడించారు. నేడు అధికారికంగా చేరిక.. సీనియర్ జర్నలిస్ట్, జీ 24 అవర్స్ న్యూస్ చానల్ మాజీ సీఈఓ శైలేష్‌రెడ్డి ఆదివారం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానంతో ఆయన సంప్రదింపులు జరిపారు. బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన నేపథ్యంలో ఆ పార్టీలో చేరటం లాంఛనమే కానుంది. శైలేష్‌రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి గాని, పరిగి అసెంబ్లీ స్థానం నుంచి గాని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పరిగి నియోజకవర్గం బీజేపీ నాయకులతోనూ కొంత కాలంగా ఆయన సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. తనకు సన్నిహితులైన ఇతర పార్టీల నాయకులతోనూ ఇప్పటికే ఈ విషయమై ఆయన చర్చించినట్లు సమాచారం. పార్టీలో చేరనున్న నేపథ్యంలోనే ఆయన గత కొంతకాలంగా పరిగి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో క్రీయశీలకంగా వ్యవహరిరిస్తూ, బీజేపీ నాయకులతో తరచూ సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. స్థానికుడు కావటం కలిసొచ్చే అంశం..! శైలేష్రెడ్డిది పరిగి నియోజకవర్గంలోని గండేడ్ మండలం జూలపల్లి గ్రామం. స్థానికుడు కావటం ఆయనకు కలిసొచ్చే అంశం కానుంది. నియోజకవర్గంలో అతను స్థానికుడు కావటంతో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాకుండా పరిగి అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేసేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు నియోజకవర్గంలో పరిచయాలు ఉండటం, ఇటీవల తెలంగాణ విషయంలో బీజేపీ అనుసరించిన విధానాలు సైతం ఆయనకు సానుకూలంగా మారనున్నాయని ఆయన ఆశిస్తున్నారు. అయితే రెండు మూడు దఫాలుగా పరిగి తాలుకా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్, నియోజకవర్గానికి చెందిన మరో బీసీ నాయకుడు సైతం ఈసారి టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో వారిని ఒప్పించుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.