టీ–శాట్‌ ద్వారా ఉద్యోగాలకు శిక్షణ | Training for jobs by t-sat | Sakshi
Sakshi News home page

టీ–శాట్‌ ద్వారా ఉద్యోగాలకు శిక్షణ

Jun 10 2018 1:13 AM | Updated on Jun 10 2018 1:13 AM

Training for jobs by t-sat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టిన నేపథ్యంలో ఉద్యోగార్థులకు తమ తోడ్పాటునందించేందుకు టీ–శాట్‌ మరోసారి సిద్ధమైంది. పోలీసు శాఖ 18,428, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భర్తీ చేసే 2,786 ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ప్రసారాలను అందించాలని నిర్ణయించింది. టీ–శాట్‌ నెట్‌వర్క్‌ చానళ్లు పోలీసు – పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగ గైడ్‌ పేరుతో చేయనున్న అవగాహన ప్రసారాలకు సంబంధించి సీఈవో శైలేష్‌రెడ్డి ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.

జూన్‌ 11న పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వి.వి. శ్రీనివాస్‌రావు ద్వారా ప్రత్యక్ష ప్రసారంతో ప్రారంభమవుతాయన్నారు. రెండు నెలలు, సుమారు 400 గంటలు, 15 సబ్జెక్టుల్లో ప్రసారాలను అందించనుండగా, అవగాహన ప్రసారాలు టీశాట్‌ సోషల్‌ మీడియాలో అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతిరోజు ఏడు గంటలపాటు జరిగే ప్రసారాలు ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్‌సైన్స్‌తోపాటు మరో 11 సబ్జెక్టుల్లో సుమారు 60 రోజులు, 400 గంటలు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అందించనున్నామని సీఈవో తెలిపారు.

ప్రసారాలను పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీశాట్‌ టీవీకి సంబంధించి www.facebook.com/tsatnetwork, www.youtube. com,  www.twitter.com/ tsatnetwork, వెబ్‌సైట్‌  www.softnet. telangana.gov.in/, టీశాట్‌ యాప్‌ www.tsat.tv లలో ప్రసారాలను వీక్షించవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement