కనకదుర్గ అమ్మవారు
సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు శాకంబరిదేవి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాదిలానే తెలంగాణా నుంచి అమ్మ వారికి బోనాలను సమర్పించేందుకు ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆదివారం ఇంద్రకీలాద్రికి విచ్చేయనుంది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మ వారికి పవిత్ర సారెను సమర్పించేందుకు తెలంగాణతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్త బృందాలు అమ్మ సన్నిధికి తరలివస్తున్నారు.
ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తులు పొటెత్తనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభమయ్యే ఉత్సవాలు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తాయి. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 6 గంటలకు అమ్మ వారి దర్శనాన్ని నిలిపివేస్తారు. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు అమ్మ వారి ఆలయంతో పాటు మల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఇతర ఉపాలయాలను, మూలవిరాట్‌లకు కాయగూరలు, పండ్లు, డ్రైప్రూట్స్‌తో అలంకరిస్తారు. ఆలయాలను కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించేందుకు అవసరమైన కూరగాయల దండలను సేవా సిబ్బంది, భక్తులు సిద్ధం చేస్తున్నారు.
ఊరేగింపుగా బోనాలు
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ నుంచి బోనాలను సమర్పించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మిచెట్టు నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు అమ్మ వారి ఆలయానికి చేరుకుంటుంది.
కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణ
అమ్మ వారి అలంకరణకు తొలి రోజైన ఆదివారం ఆకుకూరలను వినియోగిస్తారు. రెండో రోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడో రోజైన మంగళవారం బాదం, జీడిపప్పు, కిస్‌మిస్, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ప్రూట్స్‌తో అలంకరిస్తారు. అమ్మ వారి అలంకరణకు ఉపయోగించిన ఆకుకూరలు, కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక మూడు రోజులు కూడా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ, పూలకు బదులుగా కూరగాయలు, ఆకూకూరలను దండలుగా కూర్చి అమ్మకు కానుకగా సమర్పిస్తుంటారు. దేవస్థానం కదంబం ప్రసాదాన్ని అమ్మ వారి మహా ప్రసాదంగా భక్తులకు వితరణ జరుగుతుంది. దేవస్థాన ఉచిత ప్రసాదాల కౌంటర్‌లో కదంబం ప్రసాదాన్ని వితరణ చేస్తారు.
నేడు లక్ష మంది దర్శనం
ఒక వైపు శాకంబరిదేవి ఉత్సవాలు, మరో వైపున తెలంగాణా నుంచి బోనాలు, ఆదివారం, ఆషాఢ సారెను సమర్పించేందుకు తరలివచ్చే భక్త బృందాలతో ఇంద్రకీలాద్రిపై పండుగ శోభ నెలకొంది. ఒకే రోజు మూడు విశేషమైన ఉత్సవాలు జరుగుతుండటంతో ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్ష పైబడి భక్తులు అమ్మ వారి దర్శనానికి విచ్చేసే అవకాశముందని భావిస్తున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అమ్మ వారి దర్శనం త్వరగా అయ్యేలా చూడాలి. మరో వైపున ఎండల తీవ్రత అధికంగా ఉండటం, వర్షాభావ పరిస్థితుల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా షామియానాలు, మంచినీటి సదుపాయాలను దేవస్థాన కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment