సమీకరణకు కదిలిన గణం
సాక్షి,గుంటూరు : రాజధాని ప్రాంతంలో భూసమీకరణ కోసం ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. వీలైనంత వేగంగా భూసమీకరణ చేసే దిశగా అధికారులు చర్యలు తీసు కుంటున్నారు. ఇందులో భాగంగానే గుంటూరులోని కలెక్టరేట్‌లో శనివారం తొలిదశలో భూ సమీకరణ జరగనున్న 17 గ్రామాలకు సంబంధించిన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డి. సాంబశివరావు పాల్గొని భూసమీకరణకు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి జాగ్రత్తగా ఉంచాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న పట్టాదారుల సంఖ్య, కుటుంబాల సంఖ్యను కులాల వారీగా తీసుకున్నారు.
గ్రామాల వారీగా సంబంధిత వీఆర్వోలతో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. గ్రామ మ్యాప్‌లు పరిశీలించారు.
రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి, తాడేపల్లి, అమరావతి, జిల్లా రిజిస్ట్రార్‌లతో సమావేశమయ్యారు. భూముల ధరలు, రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు. భూములను స్థానికులు కొంటున్నారా, లేక బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు కొంటున్నారా అని అడిగినట్లు తెలుస్తోంది. ఆదాయం, మార్కెట్ విలువ ఎలా ఉందని ప్రశ్నించినట్లు సమాచారం.
అధికారులతో మంత్రి సమీక్ష....
భూ సమీకరణకు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌కల్లం, మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి డి. సాంబశివరావు. ఆర్‌అండ్ బీ ప్రధాన కార్యదర్శి శ్యాంబాబు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమావేశమయ్యారు.మంత్రుల కమిటీ పర్యటించే లోపే రెవెన్యూ రికార్డులు అప్‌డేట్ చేయాలని సూచించారు.
కృష్ణానదికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లోనే రాష్ట్ర రాజధాని నిర్మాణం జరిగేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విలేకరులతో అన్నారు. ఐనవోలు, వెంకటపాలెంలో కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సమీకరించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.
రికార్డులు స్వాధీనం....
తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని ఆ 17గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2009-2014 వరకు ఉన్న అడంగళ్లు, ఆర్‌ఎస్‌ఆర్ రికార్డులను తీసుకొన్నారు.
ఈ రికార్డులను గ్రామ స్థాయిలో పరిశీలించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. తెనాలి, తాడేపల్లి తహశీల్దార్లులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
ఈ 17 గ్రామాల్లో అన్ని రకాల భూములు కలిపి దాదాపు 32,977.95 ఎకరాలు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు.