అయ్యయ్యో.. ఎంత కష్టం!
రాయదుర్గం టౌన్ :
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వస్తున్న బాలింతలకు కష్టాలు తప్పడం లేదు. శుక్రవారం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చంటిబిడ్డలతో వచ్చిన పలువురు బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్పత్రిలో బెడ్‌ల కొరత ఉంది. దీంతో ఆపరేషన్ అనంతరం బాలింతలను వరండాలో టార్పాలిన్‌పై పడుకోబెట్టారు. ఫ్యాన్‌లు కూడా లేకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు. చంటిబిడ్డల పరిస్థితి చూసి తట్టుకోలేక తల్లిదండ్రులు చీర కొంగు, టవళ్లతో గాలి ఊపడం కనిపించింది. క్యాంపు ఏర్పాటు చేసిన ప్రతిసారీ బాలింతలు ఆపరేషన్ కోసం ఉదయమే ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అయితే.. అనంతపురం నుంచి వచ్చే వైద్య బృందం కోసం మధ్యాహ్నం 12 వరకు వేచి చూడాల్సి వస్తోంది. శుక్రవారం 115 మంది బాలింతలు రాగా.. వైద్య పరీక్షల అనంతరం 105 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసినట్లు ఇన్‌చార్జ్ వైద్యాధికారి, క్యాంపు ఆఫీసర్ సత్యనారాయణ తెలిపారు. డాక్టర్ కృష్ణశశి ఆధ్వర్యంలో ఆపరేషన్లు జరిగాయి. ఆపరేషన్ చేయించుకున్న వారికి రూ.880 చొప్పున ప్రోత్సాహక చెక్కులను అందజేశారు.