ప్రసవం తరువాత మహిళలకు భర్తతో పాటు, కుటుంబ సభ్యుల తోడు, సహకారం చాలా అసవరం. బిడ్డల సంరక్షణలో ఇంట్లోని పెద్దల మద్దతు కీలక పాత్ర పోషిస్తుంది. లేదంటే కొంతమందిలోఅనేక సమస్యలొచ్చే అవకాశం ఉంది.
ఉదాహరణకు:
డాక్టరు గారూ! మా అమ్మాయికి 24 ఏళ్లు. నాలుగు వారాల కిందట సిజేరియన్ ద్వారా మొదటి కాన్పులో మగబిడ్డను ప్రసవించింది. పిల్లవాడు కొంచెం బరువు తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందీ లేదని డాక్టర్ చెప్పారు. అయినా మా అమ్మాయి మొహంలో సంతోషం లేదు. తరచూ ఏడవటం, కంటినిండా నిద్రపోకవడం, ఆ బిడ్డను సరిగా పెంచలేనని బాధపడటం, భారంగా భావించడం, బిడ్డను ఏమైనా చేసి తాను కూడా చనిపొతే బాగుండునని మాటిమాటికీ దుఃఖించడం చేస్తోంది. మా అల్లుడు, మేమంతా కూడా ఆమెకు ఎంత ధైర్యం చెప్పినా, అలాగే బాధపడుతోంది. తను ఎందుకు ఇలా ఉంటోందో, ఏం చేయాలో అర్థం కావడం లేదు. – పి. విజయలక్ష్మి, హైదరాబాద్
మీ కూతురి విషయంలో మీరు పడే బాధ నేనర్థం చేసుకోగలను. మీ అమ్మాయి ‘పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ అనే మానసిక రుగ్మతకు లోనయినట్లు అర్థమవుతుంది. ప్రసవానంతరం 15 శాతం మంది స్త్రీలలో ఈ సమస్య వచ్చే అవకాశముంది. ప్రసవం తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు, నిద్రలేమి, మెదడులో వచ్చే రసాయనిక మార్పులు, వారసత్వ లక్షణాలూ ఇందుకు ముఖ్య కారణాలు. ప్రసవం తర్వాత ఒకటి రెండువారాలు కొంచెం డల్‌గా దిగాలుగా ఉండటం (పోస్ట్ పార్టమ్ బ్లూస్) కొంత సాధారణమైనప్పటికీ, మీ అమ్మాయికి వచ్చిన సమస్యను తీవ్రంగానే పరిగణించాల్సి వస్తుంది.
మీరు వెంటనే దగ్గర్లోని మానసిక వైద్యునికి చూపిస్తే వారు కౌన్సెలింగ్, మందుల ద్వారా చికిత్స చేస్తారు. ఆమెలో ఆత్మహత్య భావాలున్నాయన్నారు కాబట్టి, అవసరమైతే అలాంటి వారిని కొన్నాళ్ళు హాస్పిటల్‌లో అడ్మిట్ చేయించి మరింత గట్టి వైద్యం చేయించాల్సి ఉంటుంది. ఆమె పూర్తిగా కోలుకునేంతవరకు బిడ్డ సంరక్షణ మీరు తీసుకుని, తల్లి నుంచి బిడ్డకు ఎలాంటి హానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి వైద్య చికిత్స, కుటుంబ సభ్యుల సహకారంతో మీ అమ్మాయి పూర్తిగా కోలుకుంటుంది. డోన్ట్ వర్రీ!
Comments
Please login to add a commentAdd a comment