పగటి నిద్ర... ఒకింత మేలే!
పగటి నిద్ర పనికి చేటు అంటుంటారు గానీ పగటి నిద్ర మరీ అంత చెడ్డదేమీ కాదంటున్నారు పరిశోధకులు. రోజూ కనీసం అరగంట పాటు పగటివేళ నిద్రపోయే వారికి చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయట. రాత్రి సరిగా నిద్రపట్టని కారణంగా కలిగే ఆరోగ్యలోపాలను పగటి నిద్ర చాలావరకు రిపేర్ చేస్తుందట. అంతేకాదు... స్థూలకాయం, డయాబెటిస్, హైబీపీ, డిప్రెషన్‌తో బాధపడేవారికి పగటి నిద్ర... వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చాలా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.
పగటినిద్రపోయే వారిలోని మెదడులో ఒత్తిడిని తగ్గించే నార్‌ఎపీనెఫ్రిన్ అనే హార్మోను ఎక్కువగా తయారై అది గుండెజబ్బులనూ, రక్తపోటునూ తగ్గిస్తుంది. ఈ ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజమ్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అందుకే పగటిపూట పరిమితంగా కాస్తంత కునుకు తీస్తే అది పవర్‌న్యాప్‌లా పనిచేస్తుందన్న విషయం ఆ జర్నల్ ద్వారా మరోమారు నిరూపితమైంది.