టీడీపీని కూడా కాంగ్రెస్లో కలిపేస్తారా? | sharmila fire on TDP president chandrababu naidu | Sakshi
Sakshi News home page

టీడీపీని కూడా కాంగ్రెస్లో కలిపేస్తారా?

Published Sun, Sep 15 2013 1:12 PM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

టీడీపీని కూడా కాంగ్రెస్లో కలిపేస్తారా?

టీడీపీని కూడా కాంగ్రెస్లో కలిపేస్తారా?

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయంలో రాష్ట్రంలో ఏ చార్జీ పెరగలేదని, అలాగే ఎటువంటి పన్నులు వేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది చేశారని ఆయన కుమార్తె షర్మిల వెల్లడించారు. సమైక్య శంఖరావం పేరిట షర్మిల చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం విశాఖపట్నం చేరుకుంది. ఆ సందర్భం నగరంలోని జగదాంబ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములాంటి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలోని ప్రాజెక్టుల్లో నీరు రాకుంటే ఆ ప్రాంతమంతా ఎడారిగా మారుతుందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా గతంలో మద్రాసు తీసుకున్నారు... ఇప్పుడు హైదరాబాద్ను దూరం చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో సీమాంధ్రల కృషి లేదా అని షర్మిల ప్రశ్నించారు. విభజన జరిగితే సీమాంధ్రులు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాల్లో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు. పదేళ్ల కాలంలో హైదరాబాద్ లాంటి రాజధాని నగరం నిర్మించడం సాధ్యమేనా ఆలోచించుకోవాలని ప్రజలకు షర్మిల సూచించారు.

ఆంధ్రప్రదేశ్ విభజనపై ఇంత జరుగుతున్న చంద్రబాబులో ఏమాత్రం చలనం లేదని అన్నారు. రాష్ట్ర విభజనకు అసలు కారణం చంద్రబాబే అని షర్మిల ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి చంద్రబాబు పెద్ద తప్పు చేశారని షర్మిల తెలిపారు. చేసిన తప్పుకు లెంపలు వేసుకోవాని చంద్రబాబుకు సూచించారు. తెలంగాణాకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజీనామా చేసి తమ పార్టీ నేతలతో రాజీ నామా చేయించాలి తెలిపారు. వారంతా రాజీనామా చేశాకే చంద్రబాబు సీమాంధ్రలో అడుగుపెట్టాలన్నారు.

ఆత్మగౌరవ యాత్ర అంటూ చేపట్టిన చంద్రబాబు ఆకస్మాత్తుగా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని షర్మిల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా చూసేందుకే బాబు ఢిల్లీ వెళుతున్నారన్నారు. చిరంజీవి ప్రజారాజ్యంపార్టీని కాంగ్రెస్లో కలిపినట్లు టీడీపీని కూడా కలిపేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. నేరం రుజువు కాకుండా జగనన్నను 16 నెలలుగా జైల్లో పెట్టడం నీచ రాజకీయాలకు నిదర్శనం అని షర్మిల వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే మన గొయ్యి మనం తవ్వుకున్నట్లే అని షర్మిల ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement