jagadamba center
-
విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. ఆసుపత్రిలో చెలరేగిన మంటలు
సాక్షి, విశాఖపట్నం: జగదాంబ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండస్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురైన రోగులు.. పరుగులు తీశారు. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఆసుప్రతి రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు కమ్మివేశాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. పోలీస్ కమిషనర్ రవి శంకర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. ఇదీ చదవండి: షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం.. 8 కోట్ల ఆస్తినష్టం! -
గులాబీ గూటికి ‘కోరం’
ఇల్లెందు : ఎట్టకేలకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ‘కారు’ ఎక్కనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడంతో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న పుకార్లకు తెరపడినట్లయింది. స్థానిక జగదాంబా సెంటర్లోని ఇందిరాభవన్‌లో ఆదివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. తనతో పాటు కామేపల్లి జడ్పీటీసీ మేకల మల్లిబాబుయాదవ్, ఎంపీపీ మాలోత్ సరిరాంనాయక్, గార్ల జడ్పీటీసీ ఎద్దు మాధవి, బయ్యారం ఎంపీపీ జయశ్రీ, వైస్ ఎంపీపీ మూల మధుకర్ రెడ్డి, టేకులపల్లి ఎంపీపీ భూక్య లక్ష్మీ, ఇంకా పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని వివరించారు. ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమనే దృడ నమ్మకంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ అనతి కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించి బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నారని కొనియాడారు. ఈనెల 10 నుంచి 25వ తేది లోపు పట్టణ, పంచాయతీ ప్రజాప్రతినిధులు కూడా టీఆర్ఎస్లోకి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో ఎంపీటీసీ మండల రాము, అక్కిరాజు గణేష్, తాటి భద్రం, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీని కూడా కాంగ్రెస్‌లో కలిపేస్తారా?
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయంలో రాష్ట్రంలో ఏ చార్జీ పెరగలేదని, అలాగే ఎటువంటి పన్నులు వేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది చేశారని ఆయన కుమార్తె షర్మిల వెల్లడించారు. సమైక్య శంఖరావం పేరిట షర్మిల చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం విశాఖపట్నం చేరుకుంది. ఆ సందర్భం నగరంలోని జగదాంబ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములాంటి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలోని ప్రాజెక్టుల్లో నీరు రాకుంటే ఆ ప్రాంతమంతా ఎడారిగా మారుతుందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా గతంలో మద్రాసు తీసుకున్నారు... ఇప్పుడు హైదరాబాద్‌ను దూరం చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో సీమాంధ్రల కృషి లేదా అని షర్మిల ప్రశ్నించారు. విభజన జరిగితే సీమాంధ్రులు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాల్లో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు. పదేళ్ల కాలంలో హైదరాబాద్ లాంటి రాజధాని నగరం నిర్మించడం సాధ్యమేనా ఆలోచించుకోవాలని ప్రజలకు షర్మిల సూచించారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై ఇంత జరుగుతున్న చంద్రబాబులో ఏమాత్రం చలనం లేదని అన్నారు. రాష్ట్ర విభజనకు అసలు కారణం చంద్రబాబే అని షర్మిల ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి చంద్రబాబు పెద్ద తప్పు చేశారని షర్మిల తెలిపారు. చేసిన తప్పుకు లెంపలు వేసుకోవాని చంద్రబాబుకు సూచించారు. తెలంగాణాకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజీనామా చేసి తమ పార్టీ నేతలతో రాజీ నామా చేయించాలి తెలిపారు. వారంతా రాజీనామా చేశాకే చంద్రబాబు సీమాంధ్రలో అడుగుపెట్టాలన్నారు. ఆత్మగౌరవ యాత్ర అంటూ చేపట్టిన చంద్రబాబు ఆకస్మాత్తుగా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని షర్మిల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డికి బెయిల్ రాకుండా చూసేందుకే బాబు ఢిల్లీ వెళుతున్నారన్నారు. చిరంజీవి ప్రజారాజ్యంపార్టీని కాంగ్రెస్‌లో కలిపినట్లు టీడీపీని కూడా కలిపేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. నేరం రుజువు కాకుండా జగనన్నను 16 నెలలుగా జైల్లో పెట్టడం నీచ రాజకీయాలకు నిదర్శనం అని షర్మిల వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే మన గొయ్యి మనం తవ్వుకున్నట్లే అని షర్మిల ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.