ఇల్లెందు : ఎట్టకేలకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ‘కారు’ ఎక్కనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడంతో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న పుకార్లకు తెరపడినట్లయింది. స్థానిక జగదాంబా సెంటర్‌లోని ఇందిరాభవన్‌లో ఆదివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు.
ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. తనతో పాటు కామేపల్లి జడ్పీటీసీ మేకల మల్లిబాబుయాదవ్, ఎంపీపీ మాలోత్ సరిరాంనాయక్, గార్ల జడ్పీటీసీ ఎద్దు మాధవి, బయ్యారం ఎంపీపీ జయశ్రీ, వైస్ ఎంపీపీ మూల మధుకర్ రెడ్డి, టేకులపల్లి ఎంపీపీ భూక్య లక్ష్మీ, ఇంకా పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని వివరించారు.
ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమనే దృడ నమ్మకంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ అనతి కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించి బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నారని కొనియాడారు. ఈనెల 10 నుంచి 25వ తేది లోపు పట్టణ, పంచాయతీ ప్రజాప్రతినిధులు కూడా టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో ఎంపీటీసీ మండల రాము, అక్కిరాజు గణేష్, తాటి భద్రం, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
గులాబీ గూటికి ‘కోరం’
Published Mon, Sep 1 2014 4:33 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement