బాబూ.. ఇదేం బుద్ధి ?
- వెంకటరమణ భూ కబ్జాకోరన్నారు
- పార్టీలో చేర్చుకుని టికెట్టిచ్చారు
- మీరు వద్దన్న వ్యక్తికే ఓటేయమంటున్నారు
- తిరుపతి ప్రజల్లోచర్చనీయూంశమైన వ్యవహారమిదీ
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పేదొకటి, చేసేది ఇంకొకటి. రెండు నాలుకల ధోరణి, రెండు కళ్ల సిద్ధాంతం అమలుచేయడమే కాదు... జనాన్ని వెర్రోళ్లను చేసి రాజకీయంలో వక్రభాష్యం చెప్పడానికీ వెనుకాడని ఆయన నైజం మరొకటి. తిరుపతిలో పెద్ద భూకబ్జాకోరని స్వయూన చంద్రబాబే బహిరంగంగా ప్రకటించిన నేతను టీడీపీలో చేర్చుకుని అతనికే అసెంబ్లీ టికెట్టివ్వడమే అందుకు నిదర్శనం.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి మాజీ ఎమ్యెల్యే వెంకటరమణ భూకబ్జాకోరని ఆరోపణలు చేసిన చంద్రబాబునాయుడే ఆయనకు అసెంబ్లీ టికెట్టు ఇవ్వడం ఏమిటనేది ప్రజల్లో తీవ్ర చర్చనీయూంశమవుతోంది. తనకు టికెట్ ఇవ్వలేదని ఇంకో మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి కన్నీరు పెట్టినా కనికరించలేదు. అంటే కబ్జాకోరైతే కోట్ల రూపాయలు ఉంటాయని భావించే టికెట్టు ఇచ్చారనే విమర్శలు ప్రజల నుంచి ఎదురవుతున్నాయి.
వెంకటరమణ శిల్పారామం ఎదురుగా ఉన్న సు మారు 10 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి వేరే వారికి అమ్మేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థలానికి ఎన్‌వోసీ తీసుకొని నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయించారు. చట్టప్రకారం జరగాల్సిందంతా జరిగి పోవడంతో కార్పొరేషన్, రెవెన్యూ వారు చేతులు కట్టుకొని కూర్చున్నారు. వారికి సమర్పించాల్సినవి వారికి చేరడంతో వారి నోట మాట రాలేదనేది విమర్శ. ఇదే కాకుండా దామినేడు వద్ద కూడా మరో ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇక్కడ కూడా చట్టప్రకారం చేయాల్సిందంతా చేశారు. ఇలా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ కోట్లకు కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఆరోపణలు ఉన్న వ్యక్తిని చంద్రబాబు అక్కున చేర్చుకోవడంలో ఆంతర్యం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేర్చుకున్నదే తడవుగా వెంకటరమణకు తిరుపతి టీడీపీ టికెట్ కేటాయించడమేగాకుండా ఆయన గెలుపు కోసం సోమవారం తిరుపతిలో ప్రచారం చేయడంతో ప్రజలకు బాబు ఎంత అన్యాయం చేస్తున్నారనే విషయూన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మచ్చలేని వారికే తమ పార్టీలో స్థానం అని చెప్పే చంద్రబాబు మచ్చలున్న వ్యక్తినే ఎలా నెత్తికెక్కించుటారనేది ప్రశ్నార్థకంగా మారింది.
పేదలకు పంచే మాట మరిచిన బాబు
మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ ఆక్రమించుకున్న భూములన్నింటినీ పేదలకు పంచుతానంటూ గత ఉప ఎన్నికల్లో చంద్రబాబు తిరుపతి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని మరిచారు. అదే మాజీ ఎమ్మెల్యే ఈరోజు టీడీపీలో చేరారు. ఆయనకే ఇపుడు చంద్రబాబు తిరుపతి అసెంబ్లీ టికెట్ కేటాయించారు. అటువంటి చంద్రబాబు ప్రజా సంక్షేమం పేరుతో హామీ ఇస్తే ఎవరు నమ్ముతారు.
- చిన్నం పెంచలయ్య, సీపీఐ నగర కార్యదర్శి.
ప్రజలే గుణపాఠం చెబుతారు
గతంలో కాంగ్రెస్ నాయకుల అక్రమాలు, అవినీతిని గురించి విమర్శించిన చంద్రబాబు నేడు వారిని అక్కున చేర్చుకున్నారు. దీంతో ఆయన విశ్వనీయత ఏపాటిదో అర్థమవుతోంది. అధికారం కోసం ఎంతటి దిగుజారుడు రాజకీయాలకు పాల్పడతారనడానికి ఇదో నిదర్శనం. అప్పట్లో అయోగ్యులుగా ఉన్న వారంతా ఇప్పుడు యోగ్యులయ్యారా? ఈ నీచ రాజకీయాలకు ప్రజలే గుణపాఠం చెపుతారు.
-కందారపు మురళి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి.
భూకబ్జాల్లో అనుభవం ఉన్న వారికే టికెట్టు
అవినీతి, భూకబ్జాలు చేయడంలో అనుభవం ఉన్న వారికే టీడీపీలో టికెట్టు ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గుచూపుతున్నారు. ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేసేందుకు ఉపయోగపడతారన్న ఒకే ఒక్క లక్ష్యంతో అలాంటి వారికి స్వాగతం పలికి టికెట్లు కేటాయిస్తున్నారు.
- కె.కుమార్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి.
బాబువి దిగజారుడు రాజకీయాలు
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలను వేధించి, ఇప్పుడు అధికారమే పరమావధిగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో దొంగలైన కాంగ్రెస్ నాయకులు నేడు టీడీపీలోకి వచ్చేటప్పటికి పుణ్యపురుషులయ్యారా? ఇదే నేపథ్యంలో టీడీపీలోకి వలసలు వచ్చిన నేతలంతా భూకబ్జాదారులు అని చంద్రబాబుకు తెలియదా? కబ్జాకోరు అని తానే విమర్శించిన వ్యక్తికి తిరుపతిలో సీటు ఇవ్వడం దారుణం.
-ఎ.రామానాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి.
2012 ఉప ఎన్నికల సందర్భంలో చంద్రబాబు వ్యాఖ్యలివీ
‘వెంకటరమణ భూకబ్జాకోరు. వందల ఎకరాలు ఆక్రమించాడు. చూస్తా.. మా ప్రభుత్వం రాగానే కొత్తచట్టం తెస్తా. కాంగ్రెస్ దొంగలను నమ్మొద్దు..’ అంటూ గత ఎన్నికల ప్రచారంలో తిరుపతి నగరంలో ప్రస్తుత టీడీపీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి వెంకటరమణ గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అర్బన్‌హట్ (శిల్పారామం) ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశం వద్ద బాబు కాన్వాయ్ దిగి పరిశీలించడమేగాకుండా... కనుసైగ చేస్తూ ‘‘చూడండీ ఎంత భూమిని ఆక్రమించాడో... ఇటువంటి వ్యక్తికి ఓట్లేస్తారా?’’ అని అక్కడున్న వారిని ప్రశ్నించారు.