విడుదలైన ముస్లింలతో శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి
నంద్యాల: హిట్లర్ పాలనను టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి అన్నారు. గుంటూరులో అరెస్ట్ చేసిన ముస్లిం యువకులను బెయిల్‌పై బయటకు తీసుకొని వచ్చి శుక్రవారం రాత్రి నంద్యాల పట్టణంలోని శిల్పా సేవా సమితిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పారవి మాట్లాడుతూ.. హామీలు నెరవేర్చాలని ముస్లిం యువకులు ప్లకార్డులు సభలో ప్రదర్శిస్తే దేశ ద్రోహం కేసు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో, పార్లమెంట్‌లో సైతం ప్లకార్డులు ప్రదర్శిస్తారని, అలాంటిది సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. చంద్రబాబునుప్రశ్నిస్తే ఇంతలా హింసకు గురి చేయాల్సి అవసరం ఏముందన్నారు. తొమ్మిది మంది ముస్లిం సోదరుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియక.. వారు పడిన మనోవేదన వర్ణనాతీతమన్నారు. కేసులకు ఎవరూ భయపడబోరని.. ఇప్పుడు పదిమందే ప్రశ్నించారని, రేపు వందలు, వేల మంది నిలదీస్తారని, వారందరినీ జైలులో పెట్టుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జైళ్లు పట్టబోవన్నారు. ముస్లిం యువకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
పరామర్శించడానికి వెళితే అరెస్ట్ చేస్తారా?
నంద్యాల ముస్లిం యువకులపై అన్యాయంగా కేసు పెట్టి వేధిస్తున్నారని తెలుసుకొని పరామర్శించడానికి పోలీస్ స్టేషన్‌కు వెళితే తనపై కేసు పెట్టి అరెస్ట్ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే చెల్లిందని వైఎస్సార్సీపీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హబీబుల్లా పేర్కొన్నారు. నంద్యాల టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, మరికొంత మంది హబీబుల్లాను నంద్యాలలో అడుగుపెట్టనివ్వమని బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. నంద్యాలకు రానివ్వనని చెబుతున్న ఏవీ సుబ్బారెడ్డిది ఇంతకు ఏ ఊరు అని ప్రశ్నించారు. ఫ్యాక్షనిజం, గూండాయిజానికి తాను ఎన్నటికీ భయపడబోనని, ముస్లిం మైనార్టీల హక్కుల కోసం, వారి సమస్యల కోసం ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు తీసుకున్న నంద్యాల నాయకులు.. ముస్లిం యువకులపై అన్యాయంగా దేశద్రోహం కేసు నమోదు చేస్తే చూస్తూ ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీలను టీడీపీ నాయకలు కేవలం ఓట్ల కోసమే రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ముస్లిం సోదరులకు శిల్పాసోదరులు, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఇషాక్, కౌన్సిలర్ జాకీర్‌హుసేన్, కలాం, నవభారత్ హుసేన్, రసూల్ ఆజాద్, దేవనగర్ బాషా, షాదిక్, అహమ్మద్, కరీం, హబీబ్, జంషీర్, బాసీద్, కార్పెంటర్ మౌలాలీ, మద్దూరుబాషా, తదితరులు పాల్గొన్నారు.
నోరుమెదపరేం..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి వారికి విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించారని శిల్పా రవి అన్నారు. చంద్రబాబునాయుడు తన బావమరిది బాలకృష్ణ ఎమ్మెల్యే కావడానికి హిందూపురం ముస్లిం నాయకుడు అబ్దుల్‌గనికి టికెట్ ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ తన బావమరిది రవీంద్రనాథరెడ్డి కడప టికెట్ కావాలని డిమాండ్ చేసినా ముస్లిం నాయకుడైన అంజాద్‌బాషాకు ఇచ్చారని గుర్తు చేశారు. నంద్యాల టీడీపీ నాయకులు.. శిల్పామోహన్‌రెడ్డిని తిట్టు.. పోస్టు కొట్టు.. అన్న విధంగా తయారయ్యారన్నారు.శిల్పామోహన్‌రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేసి ఇప్పటికే నలుగురు నామినేటెడ్ పోస్టులు తెచ్చుకున్నారన్నారు. ముస్లిం యువకులపై అన్యాయంగా కేసులు పెట్టి జైలులో వేస్తే నంద్యాల టీడీపీ నాయకులు నోరుమెదపడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment