- వెనుకవైపు కన్నం వేసి లోనికి ప్రవేశించిన దుండగులు
- సేఫ్టీ లాకర్, ట్రంక్ పెట్టెల తరలింపు
- గ్యాస్ కట్టర్‌తో తెరచి రూ. రెండు కోట్ల బంగారు నగలు, భారీ మొత్తంతో పరారీ
శివమొగ్గ : జిల్లా కేంద్రమైన శివమొగ్గ తుంగానగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాచేనహళ్లి బీహెచ్.రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు శాఖలో ఆదివారం అర్ధరాత్రి దొంగలుపడి భారీ మొత్తంలో నగదు, న గలతో ఉడాయించారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటన పోలీసు అధికారుల్లో తీవ్ర సంచలనం రేపింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్‌పీ కౌశలేంద్రకుమార్, అదనపు ఎస్‌పీ బీ.దయాళుతో పాటు సీనియర్ పోలీసు అధికారులు బ్యాంకు వద్దకు చేరుకుని పరిశీలించారు.
అనంతరం జాగిలాలు, వేలి ముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. అందిన సమాచారం మేరకు ... అర్ధరాత్రి బ్యాంకు వెనుక వైపున కన్నం వేసి బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం బంగారు నగలు, నగదు ఉన్న సేఫ్టీ లాకర్, ట్రంక్ పెట్టెలను దుండగులు అక్కడి నుంచి ఒక నిర్జన ప్రదేశంలోకి తరలించారు.
గ్యాస్ కట్టర్ సాయంలో వాటిని తెరచి అందులో ఉన్న ఏడు కిలోల బంగారు నగలు, రూ. లక్షల నగదుతో పారిపోయారు. జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ జాతీయ బ్యాంకులో భారీ చోరీ జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. దుండగులు ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు ఎస్‌పీ చెప్పారు.