
సాక్షి, విశాఖపట్నం/పొదలకూరు: నైరుతి రుతు పవనాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగులుతోంది. కేరళను తాకిన రుతు పవనాలకు తుపాను రూపంలో ప్రతికూల పరిస్థితి ఏర్పడబోతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండ్రోజుల్లో తుపానుగా బలపడి, ఉత్తర వాయవ్య దిశగా పయనించనుంది. దీనివల్ల గాలిలోని తేమ పాకిస్తాన్ వైపు వెళ్లి నైరుతి రుతు పవనాల విస్తరణను అడ్డుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి రుతు పవనాలు ప్రవేశించాక అల్పపీడనాలు ఏర్పడితే అవి మరింతగా విస్తరించడానికి దోహదపడతాయి. అయితే, ప్రస్తుతం అరేబియా సముద్రంలోని అల్పపీడనం రెండ్రోజుల్లో తుపానుగా బలపడి పాక్ వైపు పయనించే అవకాశం ఉండటంతో రుతు పవనాల్లో చురుకుదనం తగ్గి ఇతర ప్రాంతాలకు విస్తరించటంలో జాప్యం చోటుచేసు కోనుంది. మరోవైపు అల్పపీడన ద్రోణులు ఏర్పడక పోవడం కూడా వర్షాలకు ఆటంకం ఏర్పడనుంది.
ఇది రాష్ట్రంలోకి రుతు పవనాల ప్రవేశంపై ప్రభావం చూపు తుందని వాతావరణ శాఖ మాజీ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఇదిలావుంటే.. నైరుతి రుతు పవనాలు రానున్న 24 గంటల్లో తమిళనాడు, నైరుతి, ఆగ్నేయ, ఈశాన్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం మరింతగా దిగువకు వస్తే రుతు పవనాల్లో కదలిక వస్తుందని, రాష్ట్రంలోకి వాటి ప్రవేశానికి వీలుంటుందని మురళీకృష్ణ చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో రెండు మూడు రోజుల్లో వర్షాలకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు మూడు రోజులూ ఉక్కపోత అధికంగా ఉంటుందని తెలిపారు.
నేడు ఉష్ణ తీవ్రత.. పిడుగుల వాన
సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్రలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
నెల్లూరు జిల్లాలో ముగ్గుర్ని బలిగొన్న పిడుగులు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతోపాటు పిడుగులు పడ్డాయి. వీటి బారినపడి ఓ రైతు, ఓ మహిళతోపాటు గిరిజనుడు మృతి చెందారు. నెల్లూరు రూరల్ మండలం కందమూరు గ్రామానికి చెందిన రైతు పల్లం శ్రీనివాసులు (45) పిడుగుపాటుకు గురయ్యాడు. ఓజిలి మండలం అత్తివరం గ్రామానికి చెందిన పశువుల కాపరి కవిత (24) పిడుగుపాటుకు గురై మరణించింది. కలిగిరి మండలం పోలంపాడు సమీపంలోని పొలంలో పని చేసుకుంటుండగా దాసరి సుధాకర్ (35) అనే గిరిజనుడు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment