
వేట
సాక్షి ప్రతినిధి, కడప: అక్రమార్జనకు కాదేదీ అనర్హం అన్నట్లుగా మత్స్యశాఖలో అవినీతి తాండవిస్తోంది. అడ్డదారుల్లో లెసైన్సులు విచ్ఛలవిడిగా మంజూరు చేస్తున్నారు. సోమశిల బ్యాక్ వాటర్‌లో మునిగిపోయిన రంగాయపల్లె గ్రామస్తుల పేరిట వందలాది మందికి చేపలవేటకు అవకాశం కల్పించారు. అవకాశం దక్కిందే తడువుగా నిషేధిత వలలతో చేపల మాఫియా చెలరేగిపోతోంది. జనసంచారమే నిషిద్ధమైన అభయారణ్యంలో భారీ వాహనాలు యధేచ్ఛగా తిరుగుతున్నాయి.
అటు మత్స్యశాఖ, ఇటు అటవీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి.సోమశిల బ్యాక్‌వాటర్‌లో చేపల వేటకు అక్రమంగా అనుమతిని ఇస్తున్నారు. ఈతరహా వ్యవహరంలో కొంతమంది సిబ్బంది నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నారు. అక్కడ చేపల వేట ద్వారా జీవనం గడిపేవాళ్లు లేకపోయినా ఇతర జిల్లాలకు చెందిన చేపల వేట దారులను పోత్సహిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వలల ను వాడుతూ చేపలను కొల్లగొడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారు అభయారణ్యంలో తిష్టవేసి అక్రమ కార్యకలాపాలు నిర్విహస్తున్నారు. ఇందుకు ప్రత్యక్షంగా మత్స్యశాఖ ప్రోత్సాహం ఉంటే, పరోక్షంగా అట వీశాఖ సహకరిస్తోంది. వెరసి సోమశిల వెనుక జలాల్లో చేపల మాఫియా రాజ్యమేలుతోంది.
మునక గ్రామం పేరుతో లెసైన్సులు...
లెసైన్సుదారులు మాత్రమే చేపల వేటను నిర్వహించాలి. సోమశిల వెనుక జలాలు నిల్వ ఉన్న ప్రాంతాలలో చేపల వేటదారులు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అత్యధికంగా లభ్యమయ్యే ఇక్కడి చేపల కోసం ఇతర జిల్లాల వారు కన్నేశారు. ఆమేరకు మత్స్యశాఖ సిబ్బందిని మచ్చిక చేసుకున్నారు. వారి మధ్య ఒప్పందం కుదరడంతో విచ్చలవిడిగా లెసైన్సులు మంజూరు అయ్యాయి. నందలూరు మండలం రంగాయపల్లె గ్రామం సోమశిల మునకలో ఉంది. అక్కడ జనవాసాలు లేవు.
ఆ గ్రామం పేరిట దాదాపు 250 మందికి లెసైన్సులు జారీ చేశారు. వీరిపేరుతో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారితోపాటు ఉయభగోదావరి జిల్లాలకు చెందిన చేపల వేటదారులు అడవిలో తిష్టవేసి అక్రమంగా చేపలను వేటాడుతున్నారు. లెసైన్సులు జారీ చేసేందుకు ఆధార్ అనుసంధానం చేయాలని నిబంధనలు ఉన్నా, అవేవీ మత్స్యశాఖ పాటించడం లేదు. దీంతో అక్రమవేటగాళ్లు లారీలతో ఇతర ప్రాంతాలకు చేపలను ఎగుమతి చేస్తున్నారు.
అభయారణ్యంలో వాహనాల సంచారం....
సోమశిల బ్యాక్ వాటర్ ప్రాంతం పెనుశిల నరసింహాస్వామి అభయారణ్యం ప్రాంతంలో ఉంది. జీఓ ఎంఎస్ నెంబర్ 106/1997లో ఆమేరకు గెజిట్ విడుదల అయింది. అభయారణ్యంలో జనసంచారం నిషిద్ధం. అలాంటి ప్రదేశంలో ఏకంగా లారీలు నడుస్తున్నాయి. 2014 సెప్టెంబర్ 1 నుంచి 2015 జూన్ 30వరకూ వాహనాలకు లెసైన్సులు సైతం జారీ చేశారు. చేపల వేటగాళ్లు ఎగుమతి నిమిత్తం తీసుకెళ్లే చేపలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు వాహనాలకు లెసైన్సులు జారీ చేశారు.
అందులో వెళ్లే సరుకును అటవీ యంత్రాంగం తనిఖీ చేయకుండా ఉండేందుకే ఈ తతంగమని సమాచారం. చేపలమాటున ఇంకేం తరలి వెళ్లినా ఎలాంటి ఇబ్బంది ఉండదని పలువురు చెప్పుకొస్తున్నారు. అభయారణ్యంలోకి స్థానికు లు మేకలు మేపుకునేందుకు వెళ్లినా కేసులు బనాయించే అటవీ యంత్రాంగానికి యధేచ్ఛగా పదుల సంఖ్యలో వాహనాలు సంచరిస్తున్నా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకు ఆయా విభాగాల యంత్రాంగాని కి భారీగా లబ్ధి చేకూరుతున్నట్లు తెలుస్తోంది.