తెరుచుకోని పుస్తకం! | Shortage of subjects teachers | Sakshi
Sakshi News home page

తెరుచుకోని పుస్తకం!

Published Sun, Aug 19 2018 7:22 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

Shortage of subjects teachers - Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌: సబ్జెక్టు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ అపహాస్యమవుతోంది. అసలు సమస్య ఎక్కడుందో ఆయా ప్రాంతాల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సిన అధికారులు.. పక్షపాతం చూపుతున్నారు. అనుకూలురు.. టీచర్లకు సౌలభ్యం ఉన్న పాఠశాలలకు మాత్రమే సర్దుబాట్లు చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ కారణంగా చాలా స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత పదో తరగతి ఫలితాలపై ప్రభావం చూపనుందని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న సర్దుబాట్లను పరిశీలిస్తే విద్యార్థులకు ఒరిగేది శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్జెక్టు టీచర్లు లేని చోటుకు సర్‌ప్లస్‌(మిగులు) ఉపాధ్యాయులను మాత్రమే మార్పు చేయాలి. అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ నిబంధనను గాలికొదిలేసి మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ఆర్జేడీ సిఫారసు పేరిట సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. 

ఇకపోతే సర్దుబాటు అంశంలో డీఈఓ కార్యాలయంలోని ఓ ఉద్యోగి ఏకంగా దందా చేస్తున్నాడు. ఈ విషయమై ఓ ఉపాధ్యా య సంఘం నేత డీఈఓ జనార్దనాచార్యులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొ న్నా ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. టీసీలు అడుగుతున్న తల్లిదండ్రులు విద్యార్థి జీవితంలో పదో తరగతి అత్యంత కీలకం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పదో తరగతిలో చదువు బోధించే టీచర్లే లేరని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా స్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో పిల్లలకు నష్టం కలుగుతోందని టీసీలు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు డీఈఓ, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తున్నా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలుస్తోంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి
 కుందుర్పి మండలం నిజవల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న బయలాజికల్‌ సైన్స్‌ టీచర్‌ను బుక్కపట్నం డైట్‌ కళాశాలకు గతేడాదే పంపారు. ఇప్పటిదాకా ఆమె స్థానంలో ఎవరినీ సర్దుబాటు చేయలేదు. సాధారణ బదిలీల్లో భాగంగా ఉన్న సోషల్‌ టీచర్‌ కూడా ఇటీవల రిలీవ్‌ అయ్యారు.

 శెట్టూరు మండలం తిప్పనపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కొత్తగా అప్‌గ్రేడ్‌ అయింది. హెచ్‌ఎం పోస్టు లేదు. 6–10 తరగతుల విద్యార్థులు 150 మంది దాకా ఉన్నారు. ఫిజికల్‌ సైన్స్, బయాలజి సైన్స్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంబేద్కర్‌నగర్‌ పాఠశాల నుంచి ఒక గణితం టీచరును ఇక్కడికి సర్దుబాటు చేశారు. ఈయనకు అర్హత(టీటీసీ) లేదు. అయితే అంబేద్కర్‌ నగర్‌ స్కూల్‌కు గంటేదొడ్డి పాఠశాల నుంచి మరో టీచరును సర్దుబాటు చేశారు. తిప్పనపల్లిలో జెడ్పీహెచ్‌ఎస్‌ పక్కనే ఉన్న ప్రాథమిక స్కూల్‌లో  ముగ్గురు టీచర్లు ఉన్నారు. వీరిలో క్వాలిఫైడ్‌ టీచరు(బీఈడీ) విల్లింగ్‌ ఇచ్చినా ఆయనను పరిగణలోకి తీసుకోకుండా ఎక్కడో అంబేద్కర్‌నగర్‌ పాఠశాల నుంచి సర్దుబాటు చేశారు.

గుమ్మఘట్ట మండలం కలుగోడు జెడ్పీహెచ్‌ఎస్‌లో 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో పదో తరగతి విద్యార్థులు 41 మంది ఉన్నారు. ఇంగ్లిష్, బయాలజికల్‌ సైన్స్, సోషల్‌ సబ్జెక్టుల టీచర్లు లేరు.

 కుందుర్పి మండలం తూముకుంట ప్రాథమికోన్నత పాఠశాలలో 1–8 తరగతుల విద్యార్థులు 140 మంది ఉన్నారు. వీరిలో 6–8 తరగతుల విద్యార్థులు 50 మంది ఉన్నారు. యూపీ స్కూల్‌కు పండిట్, గణితం, ఇంగ్లిష్‌ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ పని చేస్తున్న ఇంగ్లిష్‌ టీచరును కళ్యాణదుర్గం బాలికల పాఠశాలకు సర్దుబాటు చేశారు. కళ్యాణదుర్గం స్కూల్‌లో నాలుగు పోస్టులు ఉన్నాయి. అదనంగా తూముకుంట నుంచి మరో టీచరును నియమించారు. మరి తూముకుంటలో ఉన్న 50 మంది పిల్లలకు ఇంగ్లిష్‌ ఎవరు బోధిస్తారు?.

కణేకల్లు మండలం యర్రగుంట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉన్నారు.  ఇద్దరు ఇంగ్లిష్‌ టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో ఒకరిని రాప్తాడు మండలం బండమీదపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు సర్దుబాటు చేశారు.     ఈమె స్థానంలో అదే మండలం కొత్తపల్లి యూపీ స్కూల్‌ నుంచి మరో ఇంగ్లిష్‌     టీచర్‌ను సర్దుబాటు చేశారు. కొత్తపల్లి స్కూల్‌లో 200 మంది విద్యార్థులు     ఉండగా ఇంగ్లిష్‌ ఒకే పోస్టు ఉంది. ఆ ఒక్క టీచర్‌ను బయటకు తీసుకొచ్చారు.

అన్ని స్కూళ్లకు సర్దుబాటు చేస్తాం 
ప్రతి ఉన్నత పాఠశాలకు సబ్జెక్టు టీచరు ఉండాలనే ఉద్దేశంతోనే సర్దుబాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సర్‌ఫ్లస్‌ టీచర్లనే సర్దుబాటు చేశాం. కొందరు జాయిన్‌ కాలేదు. ప్రతి ఒక్కరూ జాయిన్‌ కావాల్సిందే. తన దృష్టికి రాకుండా కిందిస్థాయిలో ఏవైనా తప్పులు చేసి ఉంటే చర్యలు తప్పవు. విద్యార్థులు నష్టపోకుండా చూస్తాం.
– జనార్దనాచార్యులు, డీఈఓ

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం 
పాఠశాలలో సోషల్‌ టీచర్ల కొరతపై స్థానిక, జిల్లా అధికారులతో పాటు, ఎమ్మెల్యే పీఏ దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లాం. సర్దుబాటు కింద టీచర్లను నియమిస్తామన్నారు. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీచర్లు లేరంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఒత్తిడి అధికంగా ఉంది. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి.       
 – నాగమణి, కె.బసవనపల్లి 
స్కూల్‌ హెచ్‌ఎం 

పాఠాలు వెనుకబడిపోతున్నాం
స్కూలు మొదలైనప్పటి నుంచి సోషల్‌ సబ్జెక్టులో ఒక్క పాఠం కూడా చెప్పలేదు. రెండు నెలలుగా సబ్జెక్టు టీచరు లేరు. ఇట్లయితే మార్కులు ఎలా సాధిస్తాం. పదిలో పోటీ అధికంగా ఉంటుంది. ఇప్పటి నుంచి కష్టపడితే కానీ మంచి మార్కులు తెచ్చుకోలేం. మా స్కూల్లోనేమో పరిస్థితి దారుణంగా ఉంది.
– పల్లవి, పదో తరగతి, కె.బసవనపల్లి పాఠశాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement