సాక్షి, కర్నూలు/కోసిగి: ఆధార్.. ప్రజల పాలిట గుదిబండగా మారింది. వంట గ్యాస్ సబ్సిడీ కోసం ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని గత కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చివరికి దానికి బ్రేకులు పడ్డాయి. హమ్మయ్యా.. ఇక ఆధార్ పీడ విరుగుడైందని సంతోషిస్తున్న సమయంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఆధార్‌ను తెరపైకి తెచ్చింది.
రేషన్ సరుకులు కావాలన్నా.. పింఛన్ రావాలన్నా.. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు పొందాలన్నా.. ఇలా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రయోజనమైనా పొందాలంటే ఆధార్ కార్డుతో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాల్సిందే. దీంతో ఆధార్ కార్డు లేని ప్రజలు నలిగిపోతున్నారు. ఆధార్ కార్డు కోసం నమోదు చేయించుకుని, ఐరిస్ తీయించుకుని, ఫొటోలు తీయించుకున్నా.. నేటికి కార్డులు రాని వారు లక్షల్లో ఉన్నారు. ఆధార్ కార్డు లేకపోతే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతాయో లేదోనన్న అయోమయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రధానంగా చౌక దుకాణాల్లో రేషన్ సరుకులు తీసుకోవాలంటే రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానం చేసుకోవాలని లింకు పెట్టింది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు డీలర్‌కు అందజేసి అనుసంధానం చేయించుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో రేషన్ ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది. జిల్లాలో లక్షలాది మందికి ఇప్పటికీ ఆధార్ కార్డుల్లేవు. ఎన్నిసార్లు ఐరిస్ తీయించుకున్నా.. ఆధార్ కార్డులు రాలేదు. ఈ నెలాఖరులోగా రేషన్ కార్డులకు ఆధార్ కార్డులతో అనుసంధానం చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.
ఒకవేళ ఆధార్ కార్డులున్న వారు కూడా సరైన సమాచారం లేకపోవడంతో అనుసంధానం చేసుకోవడంలేదు. దీనిపై ప్రభుత్వం సరిగా ప్రచారం చేయడంలేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా జనాభా 43 లక్షలు కాగా 11,54,000 రేషన్ కార్డులున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని లక్షల మందికి ఆధార్ కార్డులు వచ్చాయి. ఇంకా ఎంతమందికి రాలేదనే సమాచారం కూడా అధికారులు వద్ద లేకపోవడం గమనార్హం.
47 శాతం అనుసంధానం..
జిల్లాలో ఆధార్ కార్డులు ఉన్న వారిలో 47 శాతం మంది మాత్రమే రేషన్ కార్డులతో అనుసంధానం చేసుకున్నట్లు తెలిసింది. మిగతా 53 శాతం మంది ఆధార్ కార్డుల వివరాలు అందజేయలేదంటూ తహశీల్దార్లు పేర్కొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం కోసిగి మండలంలోనే 57 వేల మంది ఆధార్‌తో అనుసంధానం కానట్లు తేలింది.
జిల్లాలో 23 లక్షల మందికి అవసరం..
జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డులకు 23 లక్షల మంది తమ పేర్లు అనుసంధానం చేసుకోవాల్సి ఉన్నట్లు తెలిసింది. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులుండి అందరికీ ఆధార్ ఉన్నా.. ఆ వివరాలు రేషన్ డీలరుకు అందకపోతు భవిష్యత్తులో సరుకుల పంపిణీ ఆగిపోవచ్చు. కుటుంబ సభ్యులందరి వివరాలు అందిస్తేనే రేషన్ ఇబ్బంది లేకుండా అందుతుంది. అయితే ఇంతవరకు అనుసంధానం కానివారికి రేషన్‌లో కోత విధించాలన్న నిర్ణయమేమీ ప్రభుత్వం తీసుకోలేదని అధికారులు అంటున్నారు. ఆధార్, రేషన్ కార్డులకు అనుసంధానం కాని వారిలో ఎక్కువ మంది కోసిగి మండలంలోనే ఉన్నట్లు తేలింది.
ఆధార్ కొర్రీ.. వర్రీ..!
Published Tue, Jul 22 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement