Cooking gas subsidy
-
కారు ఉందా? సబ్సిడీ కట్
న్యూఢిల్లీ : సొంత కారు ఉందా? అయితే ఇక ఎల్పీజీ సిలిండర్లపై పొందుతున్న సబ్సిడీ విషయాన్ని మర్చిపోవాల్సిందే. దశల వారీగా గ్యాస్‌పై సబ్బిడీ ఎత్తివేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం, తాజాగా ఈ నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. నేరుగా నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 3.6 కోట్ల నకిలీ గ్యాస్ కనెక్షన్లను ఏరేసింది. ఇక రెండో దశలో కారున్న వాళ్లపై సబ్సిడీ ఎత్తివేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ ప్రయోగం తొలి దశలో ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. దీనికోసం కొన్ని జిల్లాలో ఆర్టీఓ కార్యాలయాల నుంచి కారు యజమానుల సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ ఇది సఫలమైతే, సబ్సిడీలో పెద్ద మొత్తంలో ఆదా పొందవచ్చని ప్రభుత్వం చూస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం చాలామందికి రెండు లేదా మూడు కార్లు ఉన్నప్పటికీ గ్యాస్ సబ్సిడీ పొందుతున్నారు. అదేవిధంగా వార్షిక ఆదాయం 10 లక్షలు దాటిందా లేదా చూస్తున్నారు. ఈ లెక్కల్లో ఎక్కువ మంది ఆదాయాలు పది లక్షలు దాటినట్లయితే వారికి ఒక్కవేటున గ్యాస్ సబ్సిడీని ఎత్తేస్తారు. తమకు అంత ఆదాయం లేదని ఎవరైనా నిరూపించుకుంటే మళ్లీ సబ్సిడీని పునరుద్ధరిస్తారు. దీనికోసం ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎల్పీజీ కస్టమర్ల ఆదాయపు సమాచారాన్ని కూడా పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ సేకరిస్తోంది. దీనిలో పాన్, రెసిడెంటల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఉండనున్నాయి. అయితే వాహన రిజిస్ట్రేషన్ వివరాలను పొందడం చాలా కష్టమని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అడ్రస్‌తో కౌంటర్ చెక్ చేసుకోవాల్సినవసరం ఉందంటున్నారు. గివ్ఇట్అప్ క్యాంపెయిన్ లాంచింగ్ తర్వాత గ్యాస్ సబ్సిడీ ఎత్తివేతపై ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలో ఇప్పటి వరకు 75 లక్షల నకిలీ కనెక్షన్లను గుర్తించామని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. -
సబ్సిడీ గ్యాస్ కట్టడికి కఠిన చర్యలు
• చమురు శాఖకు రూ.10 లక్షల ఆదాయ వ్యక్తుల సమాచారం • త్వరలో ఐటీ శాఖతో ఒప్పందం న్యూఢిల్లీ: అధిక ఆదాయ వర్గాలకు సబ్సిడీ వంట గ్యాస్ అందకుండా ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుడుతోంది. ప్రత్యేకించి రూ.10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వ్యక్తుల సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ,చమురు, పెట్రోలియం మంత్రిత్వశాఖకు సమర్పించనుంది. సమాచారం అందజేత, భద్రత ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ), పెట్రోలియం శాఖ మధ్య త్వరలో ఒక అవగాహనఒప్పందం కుదరనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం అధిక ఆదాయ వ్యక్తి పేరు, పాన్ నంబర్, పుట్టినతేదీ, ఈ–మెయిల్ ఐడీ, ఇంటి లేదా ఆఫీస్ ఫోన్, మొబైల్ నంబర్ వంటి అన్ని వివరాలనూ పెట్రోలియం మంత్రిత్వశాఖకు ఐటీ శాఖ ఎప్పటికప్పుడు అందిస్తుంది. ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం 14.2 కేజీల బరువున్న 12 గ్యాస్ సిలిండర్లు ఏటా సబ్సిడీపై పొందే వీలుంది. ధనవంతులుతమకుతాముగా గ్యాస్ సబ్సిడీ వద్దంటూ డిక్లరేషన్లు ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. పన్నులకు లోబడి వినియోగదారు లేదా వారి భాగస్వామిగానీ వార్షికంగా రూ.10 లక్షలకుపైగా ఆదాయంపొందుతుంటే, వారికి సబ్సిడీ గ్యాస్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయించినట్లు కూడా అప్పట్లో కేంద్రం ప్రకటించింది. -
పహల్ పరేషానీ..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ‘వంట గ్యాసు రాయితీ మొత్తాన్ని బ్యాంకు ఖాతా ద్వారా పొందుదాం.. దేశాభివృద్ధికి తోడ్పడదాం..’ అంటూ కేంద్రం అమ లు చేస్తున్న డీబీటీఎల్ (డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎల్పీజీ) పథకం అమలుకు అవరోధాలు ఎదురవుతున్నాయి. రాయితీ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేసేందుకు అమ లు చేస్తున్న ఈ ‘పహల్’ పథకానికి బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్‌లలో పెలైట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు కావాలంటే వంట గ్యాసు వినియోగదారులు ఆధార్ కార్డును, బ్యాంకు ఖాతా వివరాలను సంబంధిత ఎల్పీజీ డీలరుకు సమర్పించాలి. అలాగే తమ ఆధార్ కార్డును ఖాతా ఉన్న బ్యాంక్‌కు కూడా సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలో అనేక మంది వినియోగదారులకు బ్యాంకు ఖాతాలు లేవు. కొత్తగా ఖాతాలు తెరిచేం దుకు దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళితే జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్లు తెరిచేందుకు కొందరు బ్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజనా పథకం కింద జీరో బ్యాలెన్స్ అకౌంట్లు తెరవాలని కేంద్రం బ్యాంకర్లను ఆదేశిం చినా, జిల్లాలో పలు బ్యాంకులు ఇందుకు ససేమిరా అంటున్నారు. మేళాలు నిర్వహించి ఖాతాలు తెరవాల్సి ఉండగా, ఒకటి రెండు బ్యాంకులు మొక్కుబడిగా ఈ మేళాల తంతును గతంలోనే ముగించాయి. దీంతో వినియోగదారులందరూ బ్యాంకు ఖాతాల వివరాలు గ్యాసు డీలర్లకు ఇవ్వలేక పోతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రా మాల ప్రజలు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే జిల్లా లో అనేక మంది వినియోగదారులకు ఆధార్ కార్డులు లేవు. కొందరు నమోదు చేసుకున్నప్పటికి వారికి ఇంకా ఆధార్ కార్డులు చేతికి అందలేదు. దీంతో వారు కేవలం బ్యాంకు ఖా తా వివరాలను మాత్రమే ఎల్పీజీ డీలరుకు అందజేస్తున్నారు. దగ్గర పడుతున్న గడువు.. పౌర సరఫరాల శాఖ గణాంకాల ప్రకారం పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఆదిలాబాద్ జిల్లాలో 3.72 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోపు ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ జిల్లాలో 2.80 లక్షల వినియోగదారులు మాత్రమే తమ బ్యాంకు ఖాతాల వివరాలు ఇచ్చారు. ఇంకా సుమారు 92 వేల మంది వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించాల్సి ఉంది. అలాగే 42 వేల మంది వినియోగదారుల ఆధార్ కార్డుల అనుసంధానం చేయాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 3.30 లక్షల మంది వినియోగదారులు మాత్రమే ఆధార్ అనుసంధానం చేసుకున్నారు. మిగిలిన కనెక్షన్ల అనుసంధానం ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. హెపీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీఎల్ కంపెనీలకు చెందిన మొత్తం 45 గ్యాస్ డీలర్లు ఉన్నారు. గడవులోగా అనుసంధానం చేసుకోని వినియోగదారులకు మే నెలాఖరు సడలింపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
నగదు బదిలీ.. నేటి నుంచే..
-
నగదు బదిలీ.. నేటి నుంచే..
ఆదిలాబాద్ అర్బన్ : రాయితీ వంటగ్యాస్ అక్రమాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన నగదు బదిలీ పథకం శనివారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. దేశంలోని 54 జిల్లాలో ప్రారంభిస్తుండగా.. రాష్ట్రం లో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్‌లలో మొదలు కానుంది. గత యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసినా.. ఎన్నికల ముందు బ్రేక్ పడింది. కొన్ని మార్పులుచేర్పుల తదుపరి బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం అమలుచేస్తోంది. అప్పటి కలెక్టర్ అహ్మద్ కృషి ఫలితంగా జిలాల్లో నగదు బదిలీ ప్రారంభం కాగా, ఈ పథకం కింద ఆధార్ అనుసంధానంలో దేశంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఐదు నెలలుగా ఈ పథకం అమలులో ఉన్నప్పుడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో రాయితీ సొమ్ము జమకాకపోవడం.. పేద, మధ్య తరగతి కుటుంబీకులు మొత్తం ధర చెల్లించి సిలిండర్ తీసుకోలేకపోవడం.. తదితర కారణాలతో పథకం నిలిచిపోయింది. ఫలితంగా అప్పటి ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తడంతో ఎన్నికలకు ముందు నగదు బదిలీని నిలిపివేసింది. ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా అనుసంధానంతో అమలు చేసిన ఈ పథకంలో కొన్ని మార్పుల అనంతరం బ్యాంకు ఖాతాతోనే ఇప్పుడు పథకం ప్రారంభం కావడం విశేషం. జిల్లాలో 3,28,169 మందికి వర్తింపు.. జిల్లాలో 3,74,904 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 3,28,169 మంది లబ్ధిదారుల గ్యాస్ కనెక్షన్లు ఆధార్, బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయ్యాయి. ఇంకా 46,735 మంది తమ బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. వీటిలో 45,303 మందికి ఆధార్‌తో అనుసంధానం అయినా బ్యాంకు ఖాతా లేదు. అందుకే.. ప్రభుత్వం ఈ పథకంలో చేరేందుకు మూడు నెలలు (గ్రేస్ పీరియడ్) గడువు విధించింది. ఈ మూడు నెల (ఫిబ్రవరి 14)ల్లోగా గ్యాస్‌కు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలి. లేదంటే మొత్తం ధర చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత అదికారులు పేర్కొంటున్నారు. అయితే.. ఈ పథకంలో చేరిన లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా అనుసంధానం చేస్తే రాయితీ సొమ్ము నేరుగా సదరు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఆధార్ నంబర్ లేకున్నా సరిపోతుంది. 92,038 మందికి ఖాతాలు లేవు.. ఆధార్, బ్యాంకు ఖాతాతో అనుసంధానం కాని వారు 46,735 మంది ఉండగా.. బ్యాంకు ఖాతాతో చేయని వారు 45,303 మంది ఉన్నారు. దీంతో మొత్తంగా 92,038 మందికి అసలు బ్యాంకు ఖాతాలే లేవు. ఒకే పేరుపై రెండేసి కనెక్షన్లు ఉండడం, కొందరికి ఆధార్, బ్యాంకు ఖాతాలు లేకపోవడం, కొన్ని కనెక్షన్లు హోటల్, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వినియోగించడం వంటి తదితర కారణాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 89 శాతం గ్యాస్ కనెక్షన్లకు ఆధార్, బ్యాంకు ఖాతా అనుసంధానమైంది. బ్యాంకు ఖాతాలు లేని 92,038 మంది లబ్ధిదారులకు జీరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరిచేలా బ్యాంకు అధికారులకు ఆదేశాలిస్తున్నామని సంబంధింత అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. ఈ పథకం అమలు ఎంతమేరకు ఫలిస్తుందో వేచిచూడాల్సిందే. -
రేపటి నుంచి ఏపీలోని 9జిల్లాల్లో నగదు బదిలీ
సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్ సబ్సిడీకి సంబంధించి సవరించిన నగదు బదిలీ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, వైఎస్సార్, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం - తొమ్మిది జిల్లాల్లో ఈ నెల 15వ తేదీ (శనివారం) నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాయితీ (సబ్సిడీ) మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో ఆన్లైన్ ద్వారా వినియోగదారులకు జమ చేసేందుకు వీలుగా బ్యాంకు అకౌంట్లను వంట గ్యాస్ కనెక్షన్లకు అనుసంధానం చేసుకోవాలని బ్యాంకర్లకు, గ్యాస్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. -
15 నుంచి నగదు బదిలీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వంటగ్యాస్ రాయితీకి సంబంధించి నగదు బదిలీ పథకం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈనెల 15 నుంచి జిల్లాలో వంటగ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ డబ్బులు ఇక నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ కానున్నాయి. ఇందుకు సంబంధించి పౌరసఫరాల శాఖ ఏర్పాట్లు వేగిరం చేసింది. వాస్తవానికి గతేడాదే ఈ పథకాన్ని యూపీఏ పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తికాకమునుపే నగదు బదిలీ అమలు చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. దీంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 54జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో ఈవారం చివరినుంచి నగదు బదిలీ అమల్లోకి రానుంది. ఆధార్ లేకున్నా సరే.. జిల్లాలో 13.76లక్షల వంటగ్యాస్ కనెక్షన్లున్నాయి. అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి గ్యాస్ వినియోగదారుడికి ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా పేర్కొంది. ఇందులో భాగంగా ఆధార్ కార్డు సంఖ్య, బ్యాంకు ఖాతాతో లబ్ధిదారుడి వివరాల్ని అనుసంధానం చేశారు. గ్యాస్ సిలిండర్ పొందిన అనంతరం రాయితీ డబ్బులు లబ్ధిదారుడి ఖాతాలో జమ అయ్యేవి. కానీ తాజాగా ఆధార్ సంఖ్య లేకుండానే నగదు బదిలీ అమలు చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే లబ్ధిదారులు బ్యాంకు ఖాతా వివరాల్ని సంబంధిత డీలరుకు చేరవేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 88శాతం లబ్ధిదారుల వివరాలు ఆధార్ వివరాలతో అనుసంధానమయ్యాయి. మిగతా లబ్ధిదారులు ఆధార్ సంఖ్య లేకున్నా బ్యాంకు ఖాతా నంబరును డీలరుకు సమర్పించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నర్సింహారెడ్డి తెలిపారు. ఇక పూర్తి ధర చెల్లించాలి.. శనివారం నుంచి జిల్లాలో గ్యాస్ వినియోగదారులు సిలిండర్ పొందాలంటే పూర్తి సిలిండర్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.490 కాకుండా ప్రభుత్వం అందించే రాయితీని కలుపుకుని పూర్తి ధర చెల్లించాలి. సిలిండర్ పొందిన తర్వాత రాయితీ డబ్బులు నేరుగా వినియోగదారుడి ఖాతాకు ప్రభుత్వం బదలాయిస్తుంది. అక్రమాలకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో ఈ నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. -
ఆధార్ కొర్రీ.. వర్రీ..!
సాక్షి, కర్నూలు/కోసిగి: ఆధార్.. ప్రజల పాలిట గుదిబండగా మారింది. వంట గ్యాస్ సబ్సిడీ కోసం ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని గత కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చివరికి దానికి బ్రేకులు పడ్డాయి. హమ్మయ్యా.. ఇక ఆధార్ పీడ విరుగుడైందని సంతోషిస్తున్న సమయంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఆధార్‌ను తెరపైకి తెచ్చింది. రేషన్ సరుకులు కావాలన్నా.. పింఛన్ రావాలన్నా.. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు పొందాలన్నా.. ఇలా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రయోజనమైనా పొందాలంటే ఆధార్ కార్డుతో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాల్సిందే. దీంతో ఆధార్ కార్డు లేని ప్రజలు నలిగిపోతున్నారు. ఆధార్ కార్డు కోసం నమోదు చేయించుకుని, ఐరిస్ తీయించుకుని, ఫొటోలు తీయించుకున్నా.. నేటికి కార్డులు రాని వారు లక్షల్లో ఉన్నారు. ఆధార్ కార్డు లేకపోతే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతాయో లేదోనన్న అయోమయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చౌక దుకాణాల్లో రేషన్ సరుకులు తీసుకోవాలంటే రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానం చేసుకోవాలని లింకు పెట్టింది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు డీలర్‌కు అందజేసి అనుసంధానం చేయించుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో రేషన్ ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది. జిల్లాలో లక్షలాది మందికి ఇప్పటికీ ఆధార్ కార్డుల్లేవు. ఎన్నిసార్లు ఐరిస్ తీయించుకున్నా.. ఆధార్ కార్డులు రాలేదు. ఈ నెలాఖరులోగా రేషన్ కార్డులకు ఆధార్ కార్డులతో అనుసంధానం చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఆధార్ కార్డులున్న వారు కూడా సరైన సమాచారం లేకపోవడంతో అనుసంధానం చేసుకోవడంలేదు. దీనిపై ప్రభుత్వం సరిగా ప్రచారం చేయడంలేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా జనాభా 43 లక్షలు కాగా 11,54,000 రేషన్ కార్డులున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని లక్షల మందికి ఆధార్ కార్డులు వచ్చాయి. ఇంకా ఎంతమందికి రాలేదనే సమాచారం కూడా అధికారులు వద్ద లేకపోవడం గమనార్హం. 47 శాతం అనుసంధానం.. జిల్లాలో ఆధార్ కార్డులు ఉన్న వారిలో 47 శాతం మంది మాత్రమే రేషన్ కార్డులతో అనుసంధానం చేసుకున్నట్లు తెలిసింది. మిగతా 53 శాతం మంది ఆధార్ కార్డుల వివరాలు అందజేయలేదంటూ తహశీల్దార్లు పేర్కొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం కోసిగి మండలంలోనే 57 వేల మంది ఆధార్‌తో అనుసంధానం కానట్లు తేలింది. జిల్లాలో 23 లక్షల మందికి అవసరం.. జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డులకు 23 లక్షల మంది తమ పేర్లు అనుసంధానం చేసుకోవాల్సి ఉన్నట్లు తెలిసింది. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులుండి అందరికీ ఆధార్ ఉన్నా.. ఆ వివరాలు రేషన్ డీలరుకు అందకపోతు భవిష్యత్తులో సరుకుల పంపిణీ ఆగిపోవచ్చు. కుటుంబ సభ్యులందరి వివరాలు అందిస్తేనే రేషన్ ఇబ్బంది లేకుండా అందుతుంది. అయితే ఇంతవరకు అనుసంధానం కానివారికి రేషన్‌లో కోత విధించాలన్న నిర్ణయమేమీ ప్రభుత్వం తీసుకోలేదని అధికారులు అంటున్నారు. ఆధార్, రేషన్ కార్డులకు అనుసంధానం కాని వారిలో ఎక్కువ మంది కోసిగి మండలంలోనే ఉన్నట్లు తేలింది. -
ఆధార్‌తో తెగిన లింకు
నేరుగా వంట గ్యాస్ సబ్సిడీ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం వినియోగదారులకు ఊరట వంట గ్యాస్ కోసం వినియోగదారులు పడుతున్న కష్టాలు ఎట్టకేలకు తొలగిపోయాయి. ఆధార్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా పెడచెవిన పెట్టిన కేంద్రం.. ఎన్నికలు సమీపిస్తుండటంతో తలొగ్గింది. ఆధార్‌తో నిమిత్తం లేకుండా వినియోగదారులకు నేరుగా గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర మంత్రిమండలి శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా గ్యాస్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆధార్ కార్డు ఉన్నవారి బ్యాంకు ఖాతాలో జమ అవుతున్న సబ్సిడీ ఇక నుంచి నేరుగా అందనుంది. కనెక్షన్ల వివరాలిలా... జిల్లా వ్యాప్తంగా అన్ని గ్యాస్ కంపెనీలకు చెందిన వంట గ్యాస్ కనెక్షన్లు 6.24లక్షలు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు 3.75 లక్షల మంది వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానం చేయించారు. వీరిలో 2.31లక్షల మంది వినియోగదారుల సబ్సిడీ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. జిల్లాలో ఫిబ్రవరి 1నుంచి గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకం అమలవుతోంది. కానీ ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకున్న వారికి కూడా బ్యాంకు ఖాతాలలో సబ్సిడీ డబ్బుల జమ కాకపోవడం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేంద్ర మంత్రి మండలి నిర్ణయంతో వీరికి ఊరట కలిగింది. పది రోజుల్లో అమలు? కేంద్ర మంత్రిమండలి తన నిర్ణయాన్ని గ్యాస్ కంపెనీలకు లిఖిత పూర్వకంగా అందించాయి. ఇది మరో పది రోజుల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గ్యాస్ కంపెనీలు నగదు బదిలీ పథకానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను లోడ్ చేసుకోవడం వల్ల ఇంతకాలం పాటు ఆధార్ లింకేజీ తోనే సరఫరా చేశారు. కాగా పాత పద్ధతిలో గ్యాస్ రీఫిల్లింగ్ చేయనున్నందున తిరిగి సాఫ్ట్‌వేర్‌ను లోడ్ చేయటానికి పది రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు అధికారులు,ఆయా కంపెనీల డీలర్లు పేర్కొం టున్నారు. నేరుగా సబ్సిడీ ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు అనుసంధానం చేసుకున్న వినియోగదారులు ఒక్క గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్‌కు రూ.1220 చెల్లిం చాల్సి వచ్చేది. ఆధార్ లింకు లేకుండా అయితే 445 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఆధార్, బ్యాంకు ఖాతాలు అనుసంధానం చేసుకున్న వారికి ప్రభుత్వ సబ్సిడీ రూ.737 బ్యాంకు ఖాతా ద్వారా చెల్లిస్తున్నారు. అయినా వినియోగదారుడు రూ.40 నష్టపోతున్నారు. పాత పద్ధతిలోనే నేరుగా వినియోగదారుడి సబ్సిడీ అందితే రూ. 445కే గ్యాస్ రీఫిల్లింగ్ సిలిండర్ వచ్చే అవకాశాలున్నాయి. -
గ్యాస్ నగదు బదిలీ జనవరి నుంచి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో వంట గ్యాస్ సబ్సిడీని ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసే పథకాన్ని వచ్చే జనవరి నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) అధ్యక్షుడు, సిండికేట్ బ్యాంకు సీఎండీ సుధీర్ కుమార్ జైన్ తెలిపారు. విధాన సౌధలో బుధవారం జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మైసూరు, తుమకూరు, ధార్వాడ, ఉడిపి జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. నగదు బదిలీకి సంబంధించి ఇప్పటి వరకు 96,864 బ్యాంకు ఖాతాలను ప్రారంభించి, 32,031 డెబిట్ కార్డులను పంపిణీ చేశామని వెల్లడించారు. 63,998 ఖాతాలను ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేశామని తెలిపారు. కాగా రెండు వేల కంటే తక్కువగా జన సంఖ్య ఉన్న గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను అందించే చర్యలు చేపట్టామని చెప్పారు. ఇదివరకే 3,862 గ్రామాల్లో బ్యాంకింగ్ కేంద్రాలను ప్రారంభించామన్నారు. గృహ, విద్య, అల్ప సంఖ్యాకులు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత క్రమంలో విరివిగా రుణాలు మంజూరు చేయాలని ఆయన బ్యాంకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ. రంగనాథ్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి మరో 7 జిల్లాల్లో నగదు బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మరో ఏడు జిల్లాల్లో వంటగ్యాస్ సబ్సిడీకి ఆదివారం నుంచి నగదు బదిలీ పథకం అమల్లోకి వస్తోంది. ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం నుంచి కృష్ణా, గుంటూరు, విజయనగరం, ఆదిలాబాద్, నల్లగొండ, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో అమలు కానుంది. ఈ జిల్లాల్లో ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్యను వంటగ్యాస్ కనెక్షన్లతో, బ్యాంకు ఖాతాలతోనూ అనుసంధానం చేసుకున్నవారికి నేరుగా బ్యాంకు అకౌంట్లకే వంటగ్యాస్ సబ్సిడీ అందుతుంది. వీరు వంటగ్యాస్ రీఫిల్లింగ్ సిలిండర్లకోసం పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆధార్ అనుసంధానం కానివారికి మూడు నెలలపాటు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందుతుంది. మూడు నెలల్లోగా వారు ఆధార్ నమోదు, బ్యాంకు అకౌంట్లతో అనుసంధాన ప్రక్రియలు పూర్తి చేసుకోవాలి. నవంబర్ నెలాఖరులోగా ఆధార్ అనుసంధానం చేసుకోనివారికి డిసెంబర్ ఒకటినుంచి వంటగ్యాస్ సబ్సిడీ వర్తించబోదని పెట్రోలియం మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. మరోవైపు మొదటి విడత నగదు బదిలీ అమల్లో ఉన్న చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వంటగ్యాస్ వినియోగదారుల్లో 50 శాతం మందికి మాత్రమే ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. ఆధార్ అనుసంధానం చేసుకోలేకపోయిన మిగతా 50 శాతం మందికి సెప్టెంబర్ ఒకటి(ఆదివారం) నుంచి వంటగ్యాస్ సబ్సిడీ వర్తించదు. వీరు పూర్తి మొత్తం డబ్బు చెల్లించి సబ్సిడీ రహిత సిలిండర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.