సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మరో ఏడు జిల్లాల్లో వంటగ్యాస్ సబ్సిడీకి ఆదివారం నుంచి నగదు బదిలీ పథకం అమల్లోకి వస్తోంది. ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం నుంచి కృష్ణా, గుంటూరు, విజయనగరం, ఆదిలాబాద్, నల్లగొండ, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో అమలు కానుంది. ఈ జిల్లాల్లో ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్యను వంటగ్యాస్ కనెక్షన్లతో, బ్యాంకు ఖాతాలతోనూ అనుసంధానం చేసుకున్నవారికి నేరుగా బ్యాంకు అకౌంట్లకే వంటగ్యాస్ సబ్సిడీ అందుతుంది.
వీరు వంటగ్యాస్ రీఫిల్లింగ్ సిలిండర్లకోసం పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆధార్ అనుసంధానం కానివారికి మూడు నెలలపాటు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందుతుంది. మూడు నెలల్లోగా వారు ఆధార్ నమోదు, బ్యాంకు అకౌంట్లతో అనుసంధాన ప్రక్రియలు పూర్తి చేసుకోవాలి. నవంబర్ నెలాఖరులోగా ఆధార్ అనుసంధానం చేసుకోనివారికి డిసెంబర్ ఒకటినుంచి వంటగ్యాస్ సబ్సిడీ వర్తించబోదని పెట్రోలియం మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
మరోవైపు మొదటి విడత నగదు బదిలీ అమల్లో ఉన్న చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వంటగ్యాస్ వినియోగదారుల్లో 50 శాతం మందికి మాత్రమే ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. ఆధార్ అనుసంధానం చేసుకోలేకపోయిన మిగతా 50 శాతం మందికి సెప్టెంబర్ ఒకటి(ఆదివారం) నుంచి వంటగ్యాస్ సబ్సిడీ వర్తించదు. వీరు పూర్తి మొత్తం డబ్బు చెల్లించి సబ్సిడీ రహిత సిలిండర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
నేటి నుంచి మరో 7 జిల్లాల్లో నగదు బదిలీ
Published Sun, Sep 1 2013 3:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement